Showing posts with label స్నేహితురాళ్లు. Show all posts
Showing posts with label స్నేహితురాళ్లు. Show all posts

వయస్సు 33 - మనస్సు 13 ;-)

నేటితో నాకు 33 ఏళ్లు నిండుతాయి. మూడేళ్ల క్రితం 30వ పుట్టినరోజున కళ్లంబడి నీళ్లు వచ్చాయంటే నమ్మండి. అప్పుడే ముఫైయా అని! కానీ 31 నుంచి మళ్లీ మామూలే , ఏమీ అనిపించడం లేదు. వయస్సు శరీరానికి కానీ, మనస్సుకు కాదు కదా. అందుకే ఈ రోజు నా జీవితంలోని మధురానుభూతులను ఓ సారి నెమఱు వేసుకొందామని ఈ టపా. అంతే కాదండోయ్, ఈ టపా నా 200వ టపా కూడా!

జీవితంలో మధురానుభూతులంటే ఖచ్చితంగా ఓ అమ్మాయయినా అందులో ఉంటుంది. మఱీ ఓ అమ్మాయికే పరిమితం చేస్తే బావోదని నాకు పరిచయం ఉన్న స్నేహితురాళ్లకు ఈ టపా కేటాయించాను. ఏమో ఇది చదివి ఒక్కరయినా పలక్కపోతారా అని ఓ చిన్ని ఆశ;-)

నా జీవితంలో మొట్టమొదటి స్నేహితురాలు 'మా అమ్మ'. ఎవరికయినా అంతే అనుకోండి. కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మతో నాకు సాన్నిహిత్యం ఎక్కువ. తను ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయిని. నాకు తెలుగంటే తెగని ఆసక్తి కలగడానికి ఆమే ప్రథమ కారణం. పేరు 'నూర్జహాన్'- ఈ ప్రపంచానికే(జహాఁ) వెలుగు(నూర్) అని అర్థం. ఇక రెండో స్నేహితురాలు, నా ముద్దుల చెల్లి 'బుజ్జి' అని ప్రేమగా పిలుచుకొనే 'షబానా'. ఇప్పుడు హై.లో గైనకాలజిస్టు. ఒకటో తరగతి పరీక్ష హాలు...అన్ని ప్రశ్నలకు సమాధానం రాసి, ఓ ప్రశ్న మాత్రం ఖాళీగా ఉంచి దిక్కులు చూస్తున్నాను. ఆ ప్రశ్న P_O_I_E. ఇంతలో నా పక్క వరుసలో ఉన్న అమ్మాయి ఎలా చూసిందో, నేనడగక ముందే పదే పదే తన అట్ట కేసి చూడమని కనుసైగ చేస్తోంది. అట్ట వెనకాల ప్రామిస్ వారి టూత్`పేస్ట్ ప్రకటన. నాకు ఎందుకా ప్రకటన చూపిస్తోందా అని తికమక. మఱి కాసేపైయాక, కాస్త ఆలస్యంగా ఐనా బుర్ర వెలిగింది. పరీక్షలో నూటికి నూఱు. ఆ అమ్మాయి పేరు 'సంధ్య'. చిన్మయా స్కూలులో నా మొదటి స్నేహితురాలు.

రెండో తరగతి క్లాసు రూం...మా మాస్టారు, పెద్దయ్యాక మీరేమి కావాలనుకొంటున్నార్రా? అన్న ప్రశ్నకు ఒక్కరొక్కరు సమాధానం చెబుతూ వస్తున్నారు. నా దాకా వచ్చేసరికి, అప్పడప్పుడే చదువుకొన్న ధృవుడి కథ ప్రభావమేమో తపోదీక్షలో కూర్చొన్నట్లు భంగిమ పెడుతూ, అడవికి పోయి తపస్సు చేసుకోవాలనుకొంటున్నా సార్! అన్నా. పక్కనెక్కడో కిసుక్కున నవ్విన 'మాధవి'. తనకు పేరు రాసుకొనే స్టికర్ లేబుల్లంటే చాలా ఇష్టం, మా అమ్మ ఇచ్చే పావలా దిన బత్తెంతో స్టిక్కర్ల పటం కొని మరీ ఇచ్చేవాన్ని ప్రతిరోజూ. సాయంత్రం పైనాపిల్ బండి వాడి దగ్గర అప్పు షరా మామూలే!

మూడో తరగతి స్కూలు మెట్లెక్కుతూ నేను... వెనకాల 'రాణి జయప్రద'. అప్పీ! (అలానే పిలిచే వాళ్లు మా హిందూపురంలో మఱి:-) నీ షర్టు చినిగింది చూసుకో అంది. నిజమేనేమో అని వెనక్కు తిరిగితే షర్టయితే చినగలేదు కానీ వెనకాల ఆ అమ్మాయి పెన్ను నుంచీ భారీగా ఇంకయితే పడింది. ఆ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే మరి. మా ఇంటికి అప్పుడప్పుడూ వచ్చేది కూడా. ఆ మరుసటి సంవత్సరమే వేరే ఊరికి ట్రాన్స్`ఫర్ అయి వెళ్లిపోయారు.

నాలుగో తరగతి క్లాసు మొత్తం ఛాయాచిత్రం కోసం... ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను బుద్ధిమంతుడిలా రెండు చేతులు కట్టి కెమెరా వైపే తదేకంగా చూస్తూ కూర్చొన్నాను. ఇ'స్మైల్' అంటూ ఫోటోగ్రాఫర్ కెమెరా క్లిక్కుమనిపించాడు. తరువాతెప్పుడో వచ్చిన ఫోటో చూస్తే నా పక్కనే 'సునీత'. మా ఊరు పక్కనే ఉన్న పల్లె నుంచీ రోజూ వచ్చేది. కొద్ది రోజుల్లోనే క్లోజు ఫ్రెండ్సు అయిపోయాం. ఆ తరువాత తొమ్మిదో తరగతిలో అమెరికా వెళ్లి వచ్చిందని ఊర్లో భలే క్రేజు.

ఐదో తరగతి అమరాపురంలో భగవద్గీత పోటీలు... ఎంతో కష్టపడి "ఏవం సతతయుక్తాయే..." అంటూ బట్టీయం వేసిన ద్వాదశోధ్యాయాన్ని అప్పజెప్పి, ఓ చిన్నపాటి కప్పు గెలుచుకొని అర్థరాత్రి మా ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నాం. బస్సులో నా పక్కనే పెద్ద చిన్మయా స్కూలు నుంచి 'బృంద'. ఆ మాటా ఈ మాటా కలిసింది. తరువాత ఆరో తరగతి నుంచి ఇంటరు వరకు నా స్నేహితురాలు కం. పోటీదారు.

ఆరో తరగతి సాంఘిక శాస్త్రం క్లాసు... మొదటి బెంచీలో ఉన్న నేను, అస్లం గాన్ని బ్రతిమాలి బామాలి చివరి బెంచీలోని వాడి సీటుకు మారి, పక్కనే ఉన్న రెండు జళ్ల 'కళ్యాణి'తో బాతాఖానీ మొదలు పెట్టాను. చూడనే చూసింది మా ఆడ మేడమ్ రాక్షసి, ఇద్దరినీ ఆ రోజంతా నిలబెట్టింది. అప్పుడు ముఖం ముడుచుకొన్నా, తన చిన్నప్పటి ఫోటోలను బహుమతిగా ఇచ్చి నాకు మరో మంచి స్నేహితురాలయ్యింది కళ్యాణి.

ఏడో తరగతి డిసెంబరు 24... స్కూలు నుంచి ఇంటికి వెళుతూంటే ఆపి మరీ గ్రీటింగ్ కార్డిచ్చి వెళ్లాడు అనిల్. వీడికింత అభిమానమేమిటా అని తీసి చూస్తే ఎన్నో రోజులుగా ప్రాణాలుగ్గ బట్టి ఎదురుచూస్తోన్న 'పసివాడి ప్రాణం'లో మా చిరంజీవి ఛాయాచిత్రంతో ఉన్న గ్రీటింగ్ కార్డు. వెనకాల 'హ్యాపీ బర్త్ డే- ఇస్మాయిల్'...అంటూ 'మంజుల'. ఆ రోజుల్లో మేము తయారు చేస్తున్న చిరు రికార్డు పుస్తకానికి ( అంటే ఏం లేదు ఓ నోటు పుస్తకంలో చిరు గ్రీటింగు కార్డులతికించడం, వాటి పైన ఏవో రంగు రంగుల కోడి ఈకలు పెట్టి సరదా పడడం) ఆ ఫోటో ఇమ్మంటే ససేమిరా అన్న అమ్మాయి, నా పుట్టినరోజు అందమైన సర్`ప్రై జు ఇచ్చింది. స్నే. జాబితాలో మరో ఖాతా.

ఎనిమిదో తరగతి కొత్త పాఠశాలలో...అందరూ కొత్తవారే. దిక్కులు చూస్తూన్న నన్ను మీ పేరు 'ఇస్మాయిలా?' అని పలకరించింది ఓ కొత్త గొంతు. పేరు 'నాగవేణి'. మా హిందీ టీచరు కూతురు. కొద్ది రోజుల్లోనే నాకు అత్యంత ఆప్తురాలయిపోయింది. నా చెల్లి తర్వాత అంతగా నన్ను ఇష్టపడే వ్యక్తి వేణీయే. ప్రతి రాఖీ పండక్కి ఎక్కడున్నా నాకు రాఖీ పంపేది. పెళ్లయ్యాక సంసారంలో పడి మరచిపోయినట్టుంది. అలాగే ' భానురేఖ', 'ప్రశాంతి' కూడా.

తొమ్మిదో తరగతి మళ్లీ మా క్లాసు రూము... కొత్తగా బిడియ పడుతూ ఓ అమ్మాయి అడుగుపెట్టింది. చూడగానే ఏదో తెలియని కొత్త భావం. క్లాసు లీడరుగా నేనే స్కూలంతా తిప్పి చూపాను. పేరు 'పల్లవి'. నాకు తెలియకుండానే అప్పుడప్పుడూ 'పల్లవించవా నా గుండెలో, పల్లవి కావా నా పాటలో' అని పాటలు పాడేసుకొంటూండే వాన్ని. వేణి, భాను, పల్లవి,నేను మధ్యాహ్నం కలిసే భోం చేసే వాళ్లం. తరువాత ఇంటరులో వాళ్ల నాన్న మా కెమిస్ట్రి మేస్టారు.

పదో తరగతి స్కూలు ఆవరణ... అర మార్కుకీ, కాలు(1/4) మార్కుకీ సిగపట్లు పట్టే మా 'డి.డి శ్రీవిద్య' కుంటుకొంటూ నడుస్తోంది. కారణం అరకాలిలో గుచ్చుకొన్న ముల్లు అని డయాగ్నోస్ చేసేసి, తనతోనే శస్త్రచికిత్సకై పిన్నీసుని బదులు తీసుకొని, విజయవంతంగా ముల్లు బయటకు తీసి ఆపరేషన్ సక్సెస్ చేసాను. అప్పటి నుంచీ చదువులో సై అంటే సై అనే శ్రీవిద్య బయట మాత్రం నేనంటే చాలా అభిమానం చూపేది. అలాగే నేనంటే ఉడుక్కొనే 'అపర్ణ', కళ్లెగరేసే 'శైలజ', ఇంటి దగ్గర 'చిట్టి'...వగైరా వగైరా, అబ్బో పదో తరగతంటేనే అంతేనేమో?

ఇంటరు ఎంటరయిన తరువాత ఒక్కసారిగా ప్రశాంతంగా నడుస్తున్న నా జీవితం అల్లకల్లోలంగా మారింది. కారణం తొలిసారిగా ప్రేమలో పడ్డం. అదే సమయంలో మా ఊరి నుంచి నిమ్మకూరు వెళ్లడం, నీళ్ల నుంచి బయట పడ్డ చేపలా అయ్యింది నా పరిస్థితి. గోడకు కొట్టిన బంతిలా వెంటనే తిరిగొచ్చాను పది రోజులకే. ఇక రెండు సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియదు, అదే సమయంలో 'కుముద', 'హేమ' అని ఇద్దరు అక్కచెల్లెళ్లు మా కాలేజీలో ఎంసెట్ కోసమని చేరారు. నాకు అక్క లేని లోటు తీర్ఛారు. నేనంటే పంచ ప్రాణాలు వాళ్లకప్పుడు.

మెడికల్ కాలేజీ మెట్లెక్కినా మనస్సంతా హిందూపురంలో... అలా ఓ రోజు ఎవరికీ తెలియకుండా ఊరెళితే బయటపడ్డ దారుణమైన నిజం, వేరే అబ్బాయితో 'ఆ' అమ్మాయి కనబడ్డం, వారి మధ్య లేఖలన్నీ చదవడం. మనస్సు వేయి కాకపోయినా కొన్ని ముక్కలయ్యింది:-( మరీ దేవదాసు కాకపోయినా ఓ రేంజిలో భగ్న ప్రేమికుడిగా అనుభవం సంపాదించాను. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఉన్నట్టుండి ఓ రోజు కాలేజీలో మా మరదలి స్నేహితురాలు పరిచయం అయ్యింది. మాటా మాటా కలిసింది, రోజూ నిముషాలతో మొదలయిన మాటలు, గంటల వరకూ వెళ్లాయి. ఇప్పుడిలా చెబుతున్నట్టే ఇంకా వివరంగా నా జీవితాన్నంతా పూసగుచ్చినట్లు ఆ కొన్ని రోజుల్లో చెప్పేశాను. ఎందుకు చెప్పానో తెలియదు. తను కూడా నాతో అంతే స్నేహంగా మసలుకొంది. యండమూరి ని, తిలక్ ను చదివిన ప్రభావమేమో కవితలు, లేఖలు, పాటలు (క్యాసెట్టుల్లో) బాగా నడిచాయి ఇద్దరి మధ్య.

దక్షిణ షిర్డీ, 1998. కర్నూలులోని సాయిబాబా ఆలయం గుడి మెట్లు... నేను, తను. కొబ్బరి చిప్పలు పగులకొడుతూ 'నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను" అని సిన్సియర్`గా అడిగేసాను. అంత ఆకస్మాత్తుగా అడిగే సరికి తనకి ఏం చెప్పాలో తోచలేదు. ఏం ఫర్లేదు బాగా ఆలోచించుకొని నీకు నచ్చితే రేపు కాలేజీకి నాకు నచ్చిన కలువ పూవులున్న ఆ నల్లంచుల తెల్లచీర కట్టుకొని రా అన్నాను.(చినేమాల ప్రభావం ఎక్కువ కదా మఱి;-) ఆ పదుకొండు గంటలు కొన్ని యుగాల్లా గడిచాయి. ఆ తర్వాత ఇంకేముంది, మీకు తెలిసిందే... ఉదయం హృదయం ఉప్పొంగే సంతోషంతో నేను. ఆ మరుసటి ఏడాదికే నా రాణి అయ్యింది ఈ 'సుధారాణి' :-) ఇక మళ్లీ 'గర్ల్ ఫ్రెండ్స్' అంటూ తిరక్కుండా చేసేందుకేమో అందర్నీ మించిన ది బెస్ట్ గర్ల్ ఫ్రెండ్`ని ఇచ్చింది. ఆ ముద్దుల, మురిపాల ముద్దుగుమ్మే ఈ 'సుహానీ శ్రేయ పెనుకొండ', మై స్వీటెస్ట్ 'హనీ'!