Showing posts with label జిల్లా కలెక్టరు. Show all posts
Showing posts with label జిల్లా కలెక్టరు. Show all posts

మీరే మీ జిల్లా కలెక్టరయితే?

తెలుగు బ్లాగులు ఓ మంచి చర్చా వేదికగా బాగా పనికొస్తున్నాయి.మరి మన అభిరుచులు, కోపాలు, సరదాలు పంచుకోవడమే కాక ఇంకా ఏదైనా నిర్మాణాత్మక కార్యక్రమం ఈ బ్లాగుల ద్వారా చేయొచ్చా? అని చాన్నాళ్లుగా నాలో నలుగుతున్న ప్రశ్న. అందుకు సమాధానం కూడా దొరికింది కానీ, దానికి ఓ రూపు ఇచ్చేటప్పటికి ఆలస్యమయ్యింది.

ఈ పెట్టుబడీదారీ ప్రపంచంలో 'ఆలోచనలే' పెద్ద పెట్టుబడులు. తళుక్కున మెరిసిన ఓ ఆలోచన మీ పంట పండిచ్చవచ్చు. అలాగే మనం బ్లాగుల ద్వారా ఇతర్లతో పంచుకొనే వన్నీ ఆలోచనలే కదా! ఆ ఆలోచనలనే పెట్టుబడిగా మార్చి సొంత లాభం మానుకోకుండానే పొరుగు వాడికి తోడ్పడవచ్చు...అదెలాగంటారా?

నాలో వచ్చిన ఈ ఆలోచనే అందుకు తార్కాణం. ఆ ఆలోచనే "మీరే మీ జిల్లా కలెక్టరయితే?" సొంత ఊరు, సొంత జిల్లా అంటే సాధారణంగా అందరికీ అభిమానముంటుంది. పైపొచ్చు మీ జిల్లా కష్టనష్టాలూ మీకు బాగా తెలిసుంటాయి. అయితే చీటికీ-మాటికీ ప్రభుత్వాన్ని తిట్టిపోసే ముందు, మీకే అధికారమిస్తే మీరేం చేస్తారో బ్లాగితే...అందులో మేలైన కొన్ని ఆలోచనలలో ఒక్కదానినైనా అమలు చేస్తే తద్వారా వచ్చే ప్రయోజనాలు అనంతం. జిల్లా స్థాయిలోనే ఎందుకు అంటే? రాష్ట్ర స్థాయిలో అమలు చేసేవాటి పరిధి విస్తృతమే కాకుండా, అమలులో కూడా పరిమితులుంటాయి. ఇక కలెక్టరెందుకంటే జిల్లాకు రాజు ఆయనే కాబట్టి. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా:)

ఇక తెలుగు బ్లాగర్లు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో నిష్ణాతులు, మీ ఆలోచనలు ఈ వైపునకు మళ్లించడమే ఈ వ్యాసరచన పోటీ ఉద్దేశ్యం. మరి మీ బుర్రలకు పనిపెట్టండి, మేధోతుఫాను సృష్టించండి. తెలుగు బ్లాగుల్లో కొత్త చరిత్రకు నాంది పలకండి! మరి ఈ పోటీలో విజేతనే ఉత్తమ తెలుగు బ్లాగు విజేత-2007 గా ప్రకటిస్తే సరి:)