Showing posts with label బాబు. Show all posts
Showing posts with label బాబు. Show all posts

ఔరా! 'రైతు' రాజకీయం.


రెండు నెలల విరామమంటూ ప్రకటించుకొన్నాక, ఇప్పటివరకు నా బ్లాగు దరిదాపులకి రాలేదు. ఎన్నో సంగతులు చెప్పాల్సినవి ఉన్నా చాలా నిగ్రహం పాటిస్తూ వచ్చాను. కానీ ఈ రోజు 'రైతు గర్జన' అంటూ ఆంధ్ర ప్రజలను మభ్యపెడుతున్న మన బాబు గారి ఆగ్రహాన్ని చూసి ఈ ఒక్కసారికీ నిగ్రహాన్ని చూపలేకపోయాను. మితృలతో రాజకీయాలు, మతం మాట్లాడకూడదని ఓ నానుడి. అది బ్లాగుపరంగాను నిజమని తెలిసింది. ఇకపై అలా మాట్లాడకూడదని నిర్ణయం తీసుకొన్నాక కూడా, ఈ రాజకీయ టపా ఎందుకంటే కడుపు మంట ఆపుకోలేక!

నా మూడేళ్ల ప్రభుత్వోద్యోగంలో '03 దాకా అనంతపురం జిల్లా అంతటా ఏ మూలకెళ్లినా రైతుల ఆత్మహత్యలే. కాపాడగలిగిన వారిని కాపాడినా ఎందుకు బతికించారు సారూ? అన్న వారి ప్రశ్నలే నాకు జవాబులు. ఇక రాలిపోయిన వారెంత మందో? ఆనాడు ఇదే రైతుల చావుల గురించి ప్రశ్నిస్తే, ఘనత వహించిన ఈ మా.ము.మం. బాబు గారు ఎక్స్-గ్రేషియాగా ఇచ్చే లక్షకో, పాతికకో ఆశపడి ఆత్మహత్య చేసుకొంటున్నారని ఈసడించారు. తను మొదలుపెట్టానని గర్వంగా చెప్పుకొంటున్న సరళీకరణ మంత్రాలకు, ఆనాడు మానవతా పార్శ్వం కనిపించలేదు కాబోలు.

ఈనాడు నిర్లజ్జగా చెర్నాకోలు పట్టి, ఎద్దుల బండినెక్కి, దుక్కి దున్నేవానిలా నాగలి భుజాన పెట్టి తన కంటే పెద్ద రైతు బాంధవుడు లేనేలేడని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. రికార్డు బద్దలుకొట్టిన తన తొమ్మిదేళ్ల పరిపాలనలో వినిపించలేదా ఈ రైతు గోడు. ఆనాటి వారి ఆక్రందనలే శాపాలుగా మారి తన పదవికి ఎసరొచ్చే దాకా ప్రజల ఘోష ఆయన మెత్తటి మనసుకు వినిపించలేదా? చుట్టుపక్కల ఉన్నవాళ్లు, అయ్యేయస్సులు, తోటి నాయకులు చెప్పినా తలకెక్కని విషయం ఇప్పుడు కావలసి వచ్చింది, రాజకీయ లబ్ధికి కాకపోతే, ఆయన గుండెల మీద చేయి వేసుకొని ఈ ఒక్కసారికైనా నిజం చెప్పమనండి. కనీసం చేసిన తప్పును ఒప్పుకొని తెలుగు రైతాంగాన్ని క్షమాపణ అడిగితే కాస్తయినా పాప పరిహారం దక్కుతుంది.

ఇదంతా చదివి నేను కాంగిరేసు పంకానని అపోహ పడేరు, తె.దే.పా ఆవిర్భవించిన రోజుల్లో ఇంటి ముందు టెంటు, చొక్కాకు ఎన్టీవోడి బొమ్మా, చేతిలో పసుపు జెండా పట్టుకొని మూడు-నాలుగు తరగతులలో నుంచే రాజకీయ చైతన్యం పొందినవాడిని. 'చేయెత్తి జై కొట్టు తెలుగోడా...గతమెంతో ఘనకీర్తి కలవోడా' అంటూ చెవులు గింగురుమనేలా రికార్డులు వేసినవాడిని. (ఆ ప్రభావమే నా బ్లాగు మకుటంలో కూడా కనిపిస్తుంది) అసలు మా నియోజక వర్గం శాసనసభ్యుడు మన 'అన్నగారు'. ఆయన ఏ విషయాలలో ఏమి చేసినా, ఆకలిగొన్న వాడికి కూడు - రెండు రూ. కిలో బియ్యం, గుడ్డ - జనతా వస్త్రాలు , నీడ ఇచ్చి ఆదుకొన్న మనిషి. పేదవారి పట్ల, రైతుల పట్ల అభిమానము, నిజాయితీ, వారి బాగోగుల కోసం ఏమైనా చేయాలని తాపత్రయం పడ్డ మనిషి.

అలాంటి ఆయన్ని కారణాలేమైనా, నట్టేట ముంచి, వెన్నుపోటుతో రాజ్యాధికారం చేబట్టి, ఈనాడు నిస్సిగ్గుగా ఆయన పేరు జపిస్తూ, ఆయన బొమ్మలను వాడుకొంటూ, తెలుగింటి ఆడపడుచులకు... (గుర్రాలతో తొక్కించి, నీళ్లను కుమ్మరించినప్పుడేమైందో ఈ ఆడపడుచుల పై ప్రేమ!) అంటూ నక్క వినయాలు నటిస్తే, ఓట్లు కుమ్మరిస్తారని అనుకొంటున్నాడు కాబోలు. వచ్చిన జనాన్ని చూసి వాపుని బలుపుగా భ్రమపడితే మరోసారి భంగపాటు తప్పదు. అవినీతి రాజ్యమేలుతున్న ప్రభుత్వ వ్యతిరేకతే ఇదంతా, మన మహాజనానికి ఒక కొఱివి పోతే, ఇంకో కొఱివి తప్ప నిజంగా కాపాడే నాథుడేడీ?

{చిత్ర సౌజన్యం: 1.ది హిందూ - కార్టూనిస్ట్: కేశవ్, 2.ఈనాడు}