'హోమియో' పని చేస్తుందా? మనం ఏం చేద్దాం?

'రావు గారి' టపాకు స్పందన ఈ టపా: 'హోమియో' పనిచేస్తుందా? అంటే చేస్తుంది, కొంతవరకు. అదీ దీర్ఘకాలిక రోగాలకు- immunological disorders from simple 'allergic rhinitis' and to more complex 'connective tissue disorders'. కానీ ఏ వైద్య విభాగమయినా చికిత్సలను కొన్ని శాస్త్రీయ పరిశోధనల ద్వారా బుజువు చేయాల్సి ఉంటుంది. అది చేయడానికి డబ్బు, అవసరం అది ఎవరిస్తారు? ప్రభుత్వమే అలాంటి ప్రయత్నాలకు చేయూతనిచ్చి హోమియో, ఆయుర్వేద వైద్య విధానాలను శాస్త్రీయ పరీక్షకు నిలబెట్టాలి. ఫలితం సకారాత్మకంగా ఉంటే ఎంతో మందికి స్వాంతన కలిగించిన వారవుతాం. ఏమో? మన ఆయుర్వేదంలోని మందుల్లో ఎయిడ్స్ కారక హెచ్.ఐ.వి. వైరసును నిరోధించే శక్తి ఉన్న పసరు ఉందేమో? పరీక్షిస్తే కదా తెలిసేది.

అయితే Small Pox, Polio, Measles ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో అంటువ్యాధి మహమ్మారులను దాదాపు నిర్మూలించే విధానం కనిపెట్టింది అల్లోపతి విధానంలోనే. ఒక్క పెన్సిలిన్ వలనే చావు నుంచి బయటపడ్డ ప్రాణాలు ఎన్నో కోట్లు ఉంటాయి ఈ వందేళ్లలోపు. అలాగే గుండెపోటు, హృద్రోగ సంబంధ వ్యాధులకు, కాన్సర్, ఆస్థ్మా లాంటి ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో అల్లోపతి చికిత్సకు సాటి అయిన వైద్యవిధానం మరోటి లేదు. Think : Aspirin, Statins, Beta blockers, Anti hypertensives, Streptomycin, Antiretrovirals, Antibiotics, Albuterol, Corticosteroids, Insulin, ICDs, Pacemakers...the list goes on and on.అయితే దాని పరిమితులు దానికీ ఉన్నాయి. 24 ఏళ్ల యువకుడిని 'Scleroderma & CTD' కు కోల్పోయాం, అన్ని ప్రయత్నాలు చేసినా కాపాడలేకపోయం. అలాగే ఇంకో పార్శ్వంలో నుంచీ చూస్తే ఓ 60 ఏళ్ల వృద్ధుడు, ఇప్పుడు 72 ఏళ్ల యువకుడు.

ఆ కథానాయకుడు, నిన్న నేను మాట్లాడిన నా పేషంట్ భర్త 'మిస్టర్ X'. ఆయన గుండె పనిచేయని (terminal cardiac failure) కారణంగా 8 నెలలు ఐ.సి.యులో చావుకు అతి దగ్గరగా గడిపాడు. ఒక కుటుంబం దురదృష్టవశాత్తూ(ఆయన అదృష్టవశాత్తూ???), 16 ఏళ్ల కుర్రాడు మొదటిసారి కారు నడుపుతూ ప్రమాదానికి గురయి మెడ దగ్గర వెన్నుపాముకి బలమైన దెబ్బ తగిలి కోమాలోకి వెళ్లిపోయాడు (vegetative state) అంటే brain dead అన్నమాట. కేవలం తన driving license మీద తన అవయవాలను దానం చేయడానికి అంగీకరించినందు వల్ల, వారి కుటుంబం ఒప్పుకోలుతో ఆ అబ్బాయి గుండెను మన X గారికి అమర్చారు. ఇప్పుడు ఆ 16 ఏళ్ల గుండె వయస్సు 28 ఏళ్లు. X గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఎంతో చలాకీగా వ్యవసాయం చేస్తూ, తను పండించిన పంటలనే తింటూ ఆ అబ్బాయిని తన గుండెల్లో నిలుపుకుంటూ జీవిస్తున్నాడు గత పన్నెండేళ్లుగా!
ఇందులో మనకు ఆదర్శం: చావులో కూడా అమరుడయిన ఆ అబ్బాయి 'simple'' decent act. Organ donationకు అంగీకరిస్తూ మన డ్రైవింగ్ లైసెన్స్ మీదో, లేదా వీలునామా లోనో రాసుకుంటే ఎవరో ఒకరి కళ్లలోనో, గుండెలోనో మనం తిరిగి జీవిస్తాం. ఒకరి కాలేయంగానో, కిడ్నీగానో వారి శరీరంలోని విషపదార్థాల నుండి కాపాడే 'గరళకంఠుడు' అవుతాం. ఇంకో వ్యక్తి ఊపిరిత్తిత్తుల్లో ఊపిరులూదే 'దేవుడు' అవుతాం. ఇలా అధమపక్షం ఓ ఏడు మంది జీవితాలకు అమృతం పోసిన వారవుతాం. ఏడు జన్మలున్నాయో లేవో కానీ, మనల్ని పోలిన ఏడగురు వ్యక్తులు ఉన్నారో లేరో కానీ, మనం ఈ పృథ్విపై లేకపోయినా ఏడు జీవితాలతో మన జీవితాన్ని పెనవేసుకొని ఇంకో రకంగా బ్రతుకుతాం. నేనెప్పుడో ఈ పని చేసేశాను. ఇంకెందుకాలస్యం మీరూ ఇప్పుడే ఆ పనిలో ఉండండి. ఇది ఖచ్చితంగా 'పని' చేస్తుంది."ఆలస్యం అమృతం విషం"!
(చిత్ర సౌజన్యం: క్రియేటివ్ కామన్స్. వ్యాఖ్య టపా చేసినందుకు ధన్యవాదాలు 'రావు' గారూ!)

6 comments:

సిరిసిరిమువ్వ said...

"ఈ పృథ్విపై లేకపోయినా ఏడు జీవితాలతో మన జీవితాన్ని పెనవేసుకొని ఇంకో రకంగా బ్రతుకుతాం"-అవును డాక్టరు గారు, కానీ ఈ విషయంలో ఇండియా కొంచం వెనుకబడి ఉందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే ప్రజలలో కాస్త అవగాహన కలుగుతుంది. ఈ అవయవదానం గురించి మీలాంటివారు మాలాంటివారు అందరం కలిసి ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేసి జనాలలో అవగాహన తీసుకురావాలి.

నేనైతే మోహన్ ఫౌండేషను వాళ్ల నంబరు ఎప్పుడో నోట్ చేసి పెట్టుకున్నా.ఓ వీలూనామా లాంటిది(ఆస్తుల గురించి కాదులేండి, అవయవాల దానం గురించి)రాసి పెట్టుకున్నా:)

ఏకాంతపు దిలీప్ said...

@ఇస్మాయిలు గారు
మీరేమీ అనుకోనంటే నాకనిపించింది చెప్తాను... శీర్షిక "హోమియో..." అని పెట్టి, ఇంకో విషయంలోకి వెళ్ళిపోయారు... నేనేమో ఇంకా హోమియోపతి గురించి కూళంకషంగా ఒక వైద్యునిగా ఏమైనా చెప్తారేమో అని వస్తే, నా చేత ఇంకోటి చదివించారు( అది కూడా చదివి తెలుసుకోవాల్సిన మంచి విషయమే)... కానీ నేను దాని కోసం రాలేదు కదా! ఇలానే నాకు మీరు ఇతర బ్లాగుల్లో రాసిన కొన్ని వ్యాఖ్యలు కూడా అనిపించాయి... ముందు ఆ విషయం మాట్లాడి, క్రమేణా ఆ విషయం నుండి దూరమైపోతారు మీరు... అది టపాని చదివించడానికి, చర్చని కొనసాగించడానికి సహకరించదు అని నా అభిప్రాయం... పోనీ ఈ టపాని స్పందనగా రాసారు కదా అని రావు గారి టపా చదివితే, అక్కడ కూడా మీరు రెండో పేరానుండి చర్చించిన విషయాన్ని ఆయన స్పృశించలేదు...మీకు ఇబ్బంది కలిగిస్తే మన్నించండి...

Dr.Pen said...

@సిసిము గారు...
ధన్యవాదాలు. మన తెలుగు బ్లాగర్లంతా దీన్ని(అవయవ దానం) ఒక ఉద్యమంలా చేపడితే ప్రజల్లో అవగాహన వస్తుందేమో? సామాజిక ప్రయోజనమున్న పని మనం ఏం చేయాలి అని అప్పుడప్పుడు మన బ్లాగుల్లో చర్చ జరుగుతుంది. ఇదీ అందులో ఒకటి అని చెప్పడమే నా అభిమతం.

@దిలీప్ గారు...
హోమియో గురించి చెప్పాల్సింది మొదటి పేరాలోనే చెప్పేశాను. శాస్త్రీయ పరిశోధనలు లేకుండా మనం ఎన్ని చర్చలు చేసినా ఉపయోగం శూన్యం.
ఇక మీ రెండో అభ్యంతరం గురించి- నేను బ్లాగు రాసేది నా random thoughtsని అక్షరబద్ధం కావించడానికి. ఒక విషయంపై మొదలైన నా ఆలోచన మరో ఆలోచనకు ప్రేరణగా మారినప్పుడు వాటిని కలిపి ఒకే చోట రాయడం నాకలవాటు. మీకు కష్టం కలిగితే క్షంతవ్యుణ్ణి.

రాధిక said...

ఇస్మైల్ గారూ ఇక్కడ పౌరసత్వం లేకపోతే రక్తం కూడా తీసుకోరటండి.మొన్నా మధ్య మావారి ఆఫీసుకి న్యూసు వచ్చిందట ఓ పాజిటివ్ రక్తం వెంటనే కావాలని.మావారు నాకు ఫోను చేసి ఇస్తావా అంటే సరే అన్నా.తీరా అక్కడకి వెళ్ళాకా ఎవరివి పడితే వాళ్ళవి తీసుకోమని చెప్పారు.పౌరసత్వం వుండాలట.ఇంతకీ మీరు చెప్పిన లైసెన్సు మీద డొనేషన్ డిటైల్స్ అదీ ఎలాగో వివరం గా చెపుతారా.

KumarN said...

హ్మ్.. సిటిజన్షిప్ ఉండాలా రక్తమివ్వాలంటే? ఆశ్చర్యంగా ఉందే? నేనెప్పుడో హెచ్-1 మీద ఉన్నప్పుడు తీసుకోవడానికి ఒప్పుకున్నారే!!..కాని చివర్లో నేనివ్వలేకపోయాను, ఎందుకంటే ఆ ప్రశ్నల్లో నాకూ, వాళ్ళకూ తెలిసిందేంటంటే, ఆ తేదీకి ముందు 12 నెలల్లో మలేరియా వచ్చి ఉంటే రక్తం ఇవ్వకూడదని. నాకా షరతు వర్తించింది కాబట్టి చివర్లో వాళ్ళు తీసుకోలేమని చెప్పారు.

ఇకపోతే ఇస్మాయిల్ గారూ..ఒక్క క్షణం కూడా నొప్పి భరించలేక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నొప్పి తెప్పించేంత హడావిడి చేసే నాలాంటి వాళ్ళకి అల్లోపతి చేసిన మేలు అంతా ఇంతా కాదు లెండి :-) మీరెప్పటికీ మా పాలిటి దేవుళ్ళే, అందులో ఏ అనుమానమూ లేదు. I checked those restrictions now, and they can be found at http://www.redcross.org/services/biomed/0,1082,0_557_,00.html#tra

PS to Ismail: ఇంకెవరో కుమార్ అనే వ్యక్తి కూడా కామెంట్లు రాస్తున్నట్లున్నారు(ex: నవతరంగం కామెంట్). ఇకనుంచీ నేను KumarN అని రాస్తాను చివర్లో, గమనించ ప్రార్థన.

Dr.Pen said...

@రాధిక...అలాయేం లేదండి. ఎవరైనా ఇవ్వొచ్చు. కుమార్ గారు చెప్పినట్లు మలేరియాలాంటివి రక్తం ద్వారా మన రక్తం ఇచ్చే వ్యక్తికి రాకుండా కొన్నాళ్ల పాటు ఆగాలని చెప్తారి అదీ మనకు మలేరియా ఓ సంవత్సరం లోపు వచ్చి ఉంటేనే. నేను ఈ ఆగస్టులోనే రక్తదానం చేసాను. సాక్ష్యం కావాలా? ఇదిగో -
http://www.orkut.com/Main#AlbumZoom.aspx?uid=6730814141027521156&pid=1215238538412&aid=1214693156$pid=1215238538412
:-)
ఇక అవయవ దానం గురించి మనం పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. ఇక్కడ డ్రైవింగు లైసెన్సు తీసుకొనేటప్పుడు Organ Donation అన్న boxలో ఓ టిక్కు కొడితే చాలు. ఈ సరికే లైసెన్సు ఉన్నవారు రెన్యూవల్ చేయించేటప్పుడు ఈ పని చేయొచ్చు, లేదా ఈ పని కోసమే రెన్యూవల్ చేయించుకోవచ్చు:-)

@Kumar'N'...ఏం చేస్తాం ఈ మధ్య కూడలంతా కుమారమయమైపోతోంది:-) మంచి లంకె ఇచ్చారు. వివరాలన్నీ విపులంగా అక్కడ ఉన్నాయి. ఇక నేను మరచిన నొప్పి నివారణులను గుర్తు చేశారు. అసలు అన్నిటికన్నా ముందు వరుసలో ఉండాల్సింది అవే:-)