Showing posts with label ఒబామా టీమ్. Show all posts
Showing posts with label ఒబామా టీమ్. Show all posts

'వాహ్'టె టీమ్!!!

వాహ్! ఇక హిల్లరీ క్లింటన్ 'మేడమ్ సెక్రటరీ' మన పరిభాషలో అమెరికాకు కాబోతున్న కొత్త విదేశాంగ మంత్రి. బరాక్ అధ్యక్షుడు, హిల్లరీ సెక్రటరీ ఆఫ్ స్టేట్! ఇదే విషయాన్ని కొన్ని నెలల క్రిందట చెబితే ఎవరైనా "పోబ్బా! భలే చెప్పొచ్చావు కానీ" అని ఎగతాళి చేసేవారు. ఎవరో అన్నట్టు "స్కిజోఫ్రినియా" అని అనుమానపడినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా కొత్త అధ్యక్షుడి ఒక్కో నిర్ణయం ఎంతో విజ్ఞతతో, సమయస్ఫూర్తితో తీసుకొంటున్నట్లు ఋజువవుతోంది. I strongly applaud him for his non-partisanship and to move forward with a team of rivals.

ఇక ఒబామా మీద చాలా విమర్శలే వచ్చాయి మన బ్లాగుల్లో. అక్కడ వ్యాఖ్యానిస్తే మళ్లీ ఓ 'రచ్చ' కు తెరతీసినట్లవుతుందని ఏదో నాకు తోచింది నా బ్లాగులో రాసుకొంటున్నాను. (బ్లాగుబద్ధమైన హెచ్చరిక: ఇది ఎవరినీ వ్యక్తిగతంగా కించపరచడానికి రాస్తున్నది కాదని, వారి భావాలకు నా ప్రతిస్పందన అని గమనించ ప్రార్థన.) ఆయన ఎన్నిక చారిత్రాత్మకం కాదన్నారు, సరే. సమానత్వమా...హ!హ!హ! అని నవ్వారు, సోషలిస్టు అని నిందించారు(ఏం చేస్తాం ఈ కాలంలో కమ్యూనిస్టు, సోషలిస్టు పచ్చి బూతు పదాలైపోయాయి, ఇక్కడ కాపిటలిస్టుల కోటలు కూలుతున్నా!) , తొక్క,తోలు అని...ములట్టో అని ఎగతాళి చేసారు. హి ఈజ్ హాఫ్ బ్లాక్ అంటూ రుసరులాడారు. బరాకేశ్వరుడంటూ 'పన్ను' పొడిచారు.

ఇన్ని చేసినా మరీ నోర్మూసుకొని కూర్చొంటే బరాకాకింతుణ్ని(నేను వ్యక్తిగత పూజకు 'సిద్ధయ్య'ను అని ఇప్పటికే మీకు తెలుసును కాన!) ఎలా అవుతానని, ఈ టపా:-) కేవలం తన 'తోలు' గురించి అవమానపరిచారనే ఓ సగటు మనిషి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్ముడైయ్యాడు. "All men are created equal" అని రాసుకొన్న రాజ్యాంగం కింద ఓ నల్లవాడు, ఆఫ్కోర్స్ హాఫ్ నల్లవాడు, అధ్యక్షుడైన క్రమాన్ని భరించలేని వారు కోకొల్లలు (మా లూసియానా రండి, చూద్దురు గానీ). సో సమానత్వమా...వంకాయా! అన్నా 'వాకే'. ములట్టో, హాఫ్ బ్లాక్`ల గురించి కొంత- లించింగ్ అంటే తెలుసుగా, ఊరంతా పండుగలా చూస్తోంటే, ఊరి నడిబొడ్డున- చెట్టుకు ఉరి తీయడం, చచ్చేదాక! కారణాలు ఎన్నో ఉండొచ్చు- తెల్ల పిల్లను, నల్లవాడు కన్నెత్తి చూడడం దగ్గర నుంచీ- అలాంటి స్థితి నుంచీ ఒక తెల్లపిల్లకు-నికార్సైన ఆఫ్రికా నల్లనయ్యకు పుట్టినోడు అదే అమెరికా అధ్యక్షుడైయ్యాడు చూడండి, అది ఫుల్ బ్లాక్ అధ్యక్షుడైన దానికన్నా వెయ్యిరెట్లు చెంపపెట్టు! ఇది చారిత్రాత్మకం కాదనే వాళ్లుంటే, వారికి చరిత్ర తెలియదని మనం సరిపెట్టుకోవాలి.

మైనారిటీ ఓట్లతో అధ్యక్షపీఠం అలకరిస్తున్నాడు, అనేవారికి ఓ సూచన- అందరికన్నా అమెరికా ననవయువతలో బరాక్̍కు ఎక్కువ ఓట్లు పడ్డాయి, అమెరికా భవిష్యత్తు వీరిదే, వారి స్వరాన్ని తమ ఓటు ద్వారా ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ఈ రొడ్డకొట్టుడు రాజకీయాలు, మతం పేరిట ఓట్లు దండుకోవడాలు, ప్రజలను భయవిహల్వులను చేయడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడాలు మొదలైన 'రోవియన్' పాలిట్రిక్సు చూసి, చూసి విసుగెత్తి పోయి, చేవ చచ్చిన 'పెద్ద ముదుసలి' పార్టీని పాడెక్కించారు. కొత్త ఆలోచనలతో ముందుకు రావడం మాని, పాచిపోయిన భావాలకు అందమైన మేలిముసుగు వేసి ప్రజలను నమ్మించాలని చూశారు. అది ప్రజలు తిప్పికొట్టారు. ఇకనైనా మేలిముసుగుల్ని, అందమైన మైనపుబొమ్మల్ని, ముద్దుగుమ్మల్ని కాదని, కాస్త సత్తా ఉన్న యువరక్తంతో పార్టీని నింపితే తప్ప, భవిష్యత్తు లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ దేశంలో 100% ప్యూర్ వైట్- సంప్రదాయక- మతాభిమాన- జాత్యాహంకార-శతాధిక వృద్ధులు మైనారిటీ కాబోతున్నారని గుర్తెఱిగితే వారికే మంచిది.

నా బుర్ర వేడెక్కిపోయింది ఈ టపాతో, చదవిన మీ బుర్ర వేడెక్కితే కాస్త ఈ 'కాఫీ'పాఖ్యానం చూసి, చదివి, తాగి రిలాక్స్ కండి. తోటరాముడు గారు మీకు డిజైనింగు పాఠాలు, అవిడియాలు ఇందులో ఎన్నో ఉన్నాయి:-) ఇక Thanksgiving కు మా థాయ్`లాండ్ నర్స్ మిస్టర్ వచారా కచాట్రాన్ తన adopted అమ్మా, నాన్న ఇంటిలో జరుపుకొంటూ మమ్మల్ని ఆ విందుకు ఆహ్వానించి మాంఛి టర్కీ వంటకాన్ని, బీన్స్ విత్ మాష్డ్ పొటాటో, స్వీట్ పొటాటో (అదే మన గెనసు గడ్డ) pie ను కడుపు నిండా పెట్టి, మా మనస్సంతోషపరచినారని ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయుటకు సంతసిస్తున్నాను. తాంబూలమొక్కటీ తక్కువైంది:-)