దేశాటన!

{ప్రియమిత్రుడు సోమశేఖరరెడ్డితో...}

మూడేళ్ల తరువాత మళ్లీ స్వదేశమెళ్లే భాగ్యం కలిగింది. కానీ అదీ ఓ పదిహేను రోజులు మాత్రమే! అందులో సింహభాగం ప్రయాణానికే సరిపోయింది. ఇక మిగిలింది పది రోజులు. అనుకొన్నవన్నీ చూడకపోయినా అందర్నీ చూసాననే తృప్తి మాత్రం మిగిలింది. దేవనహళ్లిలో దిగి హిందూపురంలో మా మేనమామ కూతురి పెళ్లికి సమయానికే చేరుకొన్నాను. బంధుమిత్రులందరినీ పేరుపేరున పలకరించి వారి కుశలప్రశ్నల జల్లుల్లో తడిసి ముద్దయ్యాను. మా ఊరి వీధి-వీధి తిరిగి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఓసారి తడిమి చూసుకొన్నాను.

{నేను చదివిన - మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాల}
రాగానే మా గురువు శ్రీయుతులు హెచ్.సుబ్బారావు గారిని పలుకరించాలని వారి ఫోన్ నెం. కోసం ఆరా తీసాను. మరుసటి రోజే వారు పరమపదించారన్న వార్త నాకు ఆశనిపాతంలా తగిలింది. ఎందరో విద్యార్థులకు దారి చూపించిన మహనీయుడాయన. వందేళ్ల మహాత్మాగాంధీ హైస్కూలు చరిత్రలో అటువంటి ఉపాధ్యాయుడు "నభూతో: నభవిష్యతి". ఆయన పేరు మీద, మా మరో సైన్సు మాస్టారు శ్రీ తిప్పన్న గారి పేరు మీద "సుబ్బారావు-తిప్పన్న" పతకం ఏర్పాటు చేయాలని నా ఆశయం. అలాగే మరో మిత్రుడు, ఇప్పటి లెక్కల మాస్టారు అయిన సుదర్శన్ బలవంతం మీద నేతాజీ పాఠశాలలో ఓ ప్రార్థనా సమయంలో రెండు మంచి మాటలు చెప్పే అదృష్టం కలిగింది, ఆ రెండు మాటలు "బాగా చదవండి". అంబేద్కర్ అయినా, ఎల్లాప్రగడ సుబ్బారావయినా, అబ్దుల్ కలాం అయినా, ఇప్పటి ఒబామా అయినా వారి విజయాలకు చదువే పునాది అని ఉదాహరణాలతో సహా వారిలో కొంత స్ఫూర్తిని రగిలింపజేసే ప్రయత్నం చేశాను.
{నేతాజీ పాఠశాలలో ఓ ఉదయం}

ఇక హిందూపురం నుంచి అనంతపురంలో ఓ రోజు గడిపి మిత్రులు - శరత్, సోము, శిష్యులు - రవి, చంద్ర, ఆనంద్̍లతో నగర విహారం చేసి వేడి వేడి రాజకీయ కబుర్లతో కాలక్షేపం చేసి రాజధానికి బయలుదేరాను. అదేంటో హైదరాబాదుతో అంత అనుబంధం లేకపోయినా అక్కడికి రాగానే ఓ ఆహ్లాదకరమైన భావన. మా చెల్లి కుటుంబాన్ని పరామర్శించి, అటు నుంచి కాకతీయ రాజధాని ఓరుగల్లుకేగి మా బావ (శ్రీమతి సోదరుడు)తో మాట్లాడి, పనిలో పనిగా వేయిస్తంభాల గుడిని దర్శించి వచ్చాను. నా యాత్రలో "హంపి" వెళ్లడానికి కుదరలేదు, అదొక్కటే పెద్ద బాధ ఇది చూశాక ఆ బాధ వేయింతలైంది. అలాగే ప్రజారాజ్యం అధినేత మా మెగాస్టార్̍ను కలవకపోవడం, ఏం చేస్తాం సమయం లేకపోయింది. మన e-తెలుగు సమావేశంలో బ్లాగు పెద్దలందరినీ కలుద్దామని అనుకొన్నా నేను ఉన్న రోజుల్లో సమావేశం లేకపోయింది.
{చిన్నారి అన్నా-చెల్లెళ్లు}
వస్తూ వస్తూ పెనుకొండలో దిగి బాబయ్య దర్గాను దర్శనం చేసుకొని, మళ్లీ మా హిందూపురం వచ్చి చిన్ననాటి చర్చిలో ప్రార్థన చేసి, తిరుపతి వెంకన్నను, ఆ షిర్డీసాయిని అనంతపురంలోనే మొక్కేసి మొత్తానికి అన్ని దేవుళ్ల దర్శనం అయిపోయిందనిపించాను. అయినా చిత్తశుద్ధి ఉంటే చాలు ఎన్ని పూజలు చేసినా ఫలమేమిటి అని మా వేమన్న ఎప్పుడో చెప్పాడు కదా:-) తిరుగు ప్రయాణంలో లండన్లో ఓ రోజు ఉండే అవకాశం దొరికింది. చాన్నాళ్ల తరువాత ఆప్తమిత్రుడు 'శివ'తో ఓ రోజంతా గడిపే అదృష్టం లభించింది. ఇంటికి వచ్చాక "హోమ్ సిక్" లక్షణాలు కనపడ్డా మా అమ్మా-నాన్న మళ్లీ ఇక్కడికి రాబట్టి కొంతలో కొంత నయం. మళ్లీ ఉరుకుల పరుగుల జీవితంలోకి...ప్చ్!
{ఆప్తమిత్రుడు శివలాలిరెడ్డితో}

5 comments:

కొత్త పాళీ said...

It is always too damn short.
You didn't metion who're the bro-sis in the B&W pic.

జ్యోతి said...

its ismail and his sister in the picture. am i right brother..

Unknown said...

సూటూ బూటూ వేసుకుని అరిపిస్తున్నారుగా :-)
మీ ప్రయాణం చక్కగా సాగినందుకు సంతోషం.

teresa said...

అన్న,చెల్లి cuteగా ఉన్నారు.మీ జూనియర్లెలా ఉన్నారు?
అబ్బ్,ఆ internship చాకిరీ నించి 2వారాలయినా తప్పించుకుని enjoy చెయ్యటం గొప్ప అదృష్టం .

Dr.Pen said...

@కొత్తపాళీ
అవునవును. జ్యోతక్క చెప్పేసారుగా!

@జ్యోతి
అక్కా నీవెప్పుడూ రైటే!

@ప్రవీణ్
యా:-)

@టెరెసా
నెనర్లు. అచ్చు ఇలాగే ఉన్నారిప్పుడు!
మీరు చెప్పింది అక్షరాలా నిజం.