దేశరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు నా నివాళి.

(హంపి యాత్రలో కీ.శే.సందీప్ ఉన్నికృష్ణన్, ఎన్.ఎస్.జి. కమాండో)
ముంబయిలో జరుగుతున్న మారణహోమానికి అసలు కారణం ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం లాంటి మానసిక వికారాలు కానీ ఇది మతానికి సంబంధించిన అంశం కాదు. నా ఉద్దేశంలో ప్రపంచ రాజకీయ యవనిక మీద సరికొత్త ధృవతారలా దూసుకువస్తున్న భారతావనిని అడ్డుకోవాలని కొన్ని శక్తులు పన్నిన కుట్ర ఇది. అమెరికాకు దగ్గరవుతున్న నేపథ్యంలో పశ్చిమ దేశాల పౌరులను కేంద్రంగా చేసుకొని సాగించిన మారణహోమం ఇది. అమెరికాలో మారిన రాజకీయ చిత్రంతో పాకిస్తాను, ఇండియాతో సాన్నిహిత్యం పెంచుకోవలసిన అగత్యం ఏర్పడింది. అందుకు తగ్గ సూచనలు ఈ మధ్య కనిపించాయి. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లో పెరిగిన ఒత్తిడిని తగ్గించుకొనే భాగంలో, కాశ్మీర్ అంశం మరుగున పడిపోతుందనే భయంతో, మళ్లీ ఈ రెండు దేశాల మధ్య నిప్పు రాజేసే ప్రక్రియలో భాగమే ఈ తీవ్రవాద దాడి.

ఇదంతా తెలిసీ దీన్నో మతవిద్వేషంలా తీర్చిదిద్దే పని నిర్విఘ్నంగా చేస్తున్నారు మన రాజకీయ(వి)నాయకులు. అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉన్న వారిని విడదీసి, మత విద్వేషాలు రాజేసి, కొన్ని వేల మంది శవాల పునాదులపై తమ రాజకీయ కోటలు నిర్మించుకొని, అధికారానికి వచ్చాక నిర్లజ్జగా చేసిన బాసలు మరచి, మళ్లీ ఇప్పుడు మతవిద్వేషాన్ని రగిలించి ఆ సందడిలో ఇంకో సారి అధికారాన్ని అందుకోవాలనే కుత్సిత నాయకులు ఉన్నంత కాలం దేశం ఇలా రావణకాష్ఠంలా రాజుకుంటూనే ఉంటుంది.

ఇది అంతర్జాతీయ తీవ్రవాదం. దీన్ని అంతమొందించాలంటే అన్ని దేశాల మధ్య నిఘా వ్యవస్థలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంబించాలి. ఏ ఒక్క దేశానికో ఇది పరిమితం కాదు. కమ్యూనిస్టు బూచిని చూపెట్టి ఓ భయంకర ఫ్రాంకైన్స్టిన్̍కు జన్మనిచ్చింది కోల్డ్̍వార్. తీవ్రవాదం లేని చోట్ల అనవసర యుద్ధాలకు దిగి అంతకంతా అభివృద్ధి చేసారు 'ఏలినవారు'. ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా అమెరికా మన దేశానికి మిత్రరాజ్యంగా మారడం ఈ అరాచక శక్తులకు మింగుడు పడడం లేదు.

సందీప్ ఉన్నికృష్ణన్, హేమంత్ కర్కారె, అశోక్ కామ్టె, విజయ్ సలాస్కర్, గజేంద్ర సింగ్, సదానంద్ దాటె, అరుణ్ చిటాలె, ప్రకాష్ మోరె, ఇలా ఎందరో తమ ప్రాణాలు ఎదురొడ్డి కిరాతక మూకల నుంచి ప్రజలను రక్షించారు. వీరందరికీ నా శ్రద్ధాంజలి, భాష్పాంజలి. 31 ఏళ్ల యువ ప్రాయంలో వీరోచితంగా పోరాడి, తన మితృలను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సందీప్ ఫోటోలు చూస్తూంటే మనసంతా ఏదో వేదన - 'జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపీ గరీయసి!' అన్న రాముడి మాటలు నిజం చేసిన ఈ వీరుడు, స్వర్గమంటూ ఉంటే అక్కడ కూడా తన జన్మభూమిని తలచుకొంటాడేమో?

ఇక ఈ నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన వారు...అమీనా హమీద్ షేక్, అశోక్ శివరామ్ ఫూల్కె, అజీజ్ నబిలాత్ రామఖూరె, భాగాన్ షిండె, బ్రెడ్ గిల్బర్ట్ టేలర్, ఫకీర్ మొహమ్మద్, గౌతమ్, హాజీ ఇజాజ్ భాయ్, జాస్మిన్, జుర్గెమ్ హెర్తాజ్ రుఢాల్ఫ్, మస్తాన్ ఖురేషి, మీరా ఛటర్జీ, మైఖేల్ స్టెర్ట్, మిశ్రాలాల్ మోర్యా, ముఖేడ్ భిఖాజీ, గోపాలకృష్ణ, ప్రభుకుమార్ లాల్, రీమా షేక్, సంజయ్ సుర్వె, శంకర్ గుప్తా, శశాంక్ షిండె, శిరీష్ చావ్లా, సీతారామ్ మల్లప్ప, సొహేల్, అహ్మద్ షేక్, స్టడ్డార్ ఢాఫ్నె, సుశాంత్ పాటిల్, ఠాకూర్ బుధా వాఘేలా, అలాన్ షెర్, నయోమి షెర్, గావ్రియెల్ హోల్జ్బర్గ్, రివ్కా - హిందూ, ముస్లిం, క్రిస్టియన్, యూదు - ఇలా ఎందరో అమాయకులు. వీరందరికి నా ఘన నివాళి.

(చిత్రం: సందీప్ ఆర్కుట్ ప్రొఫైల్ నుంచి)

1 comment:

Dr.Pen said...

'మోడీ' కోటి రూపాయల్ని కాలదన్నిన కర్కారే భార్య 'కవితా కర్కారే' నిజమైన దేశభక్తురాలు. You are a True Patriot madam, I salute you for your courage and strength.