గుంటూరు జిల్లా కొండవీడులో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన 'వేమన' తెలుగు జాతి మొదటి ప్రజాకవి, నా అభిమాన కవి. నేడు రెడ్లుగా వ్యవహరింపబడే కాపు కులం లో పుట్టానని ఆయనే చెప్పుకొన్నాడు. రైతాంగాన్ని "వివర మెరుగనట్టి వెర్రి జీవులు" అంటూ వారి అమాయకత్వాన్ని, ఆనాటి మత,కుల గురువుల కుతంత్రాలకు (ఈనాటి రాజకీయుల వాగ్దానాలకు) మోసపొయే వారిగా తన పద్యాల్లో పేర్కొన్నాడు. దేశాటన చేస్తూ సంఘంలోని లోపాలను, మోసాలను, మూఢాచారాలను నిరసిస్తూ చిక్కని, బహుచక్కని అచ్చ తెనుగు ఆటవెలది పద్యాలను మనకందించాడు. చివరకు అనంతపురం జిల్లా కఠారుపల్లె గ్రామంలో తనువు చాలించాడు. అక్కడ వేమన సమాధి ఇప్పటికీ నిలిచిఉంది.
ఆయన పద్యాలలోని కొన్ని ఆణిముత్యాలు:
"ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల
భాండ శుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినురవేమ!"
"రాతిబొమ్మకేల రంగైన వలువలు
గుళ్లు గోపురములు కుంభములును
కూడుగుడ్డ దాను గోరునా దేవుండు
విశ్వదాభిరామ వినురవేమ!"
"కులము గల్గువారు, గోత్రంబు కలవారు
విద్యచేత విర్రవీగువారు
పసిడిగల్గువాని బానిసకొడుకులు
విశ్వదాభీరామ వినురవేమ!"
"గుహలోన జొచ్చి గురువుల వెదకంగ
కౄరమృగ మొకండు తారసిలిన
ముక్తిమార్గ మదియె ముందుగా జూపురా
విశ్వదాభిరామ వినురవేమ!" (హ్హ హ్హ హ్హ...)
1 comment:
తేలికయిన పదాలలో,వ్యవహారిక భాషలో వేమన పద్యాలు వుండడం వల్లనే ఇవి అంత ప్రాచుర్యం పొందాయి.మంచి వ్యాసం అందించారు.
Post a Comment