మైఖేల్-మదన-కామరాజు!

ఏదో వారాంతంలో పాత కమల్ సినిమా చూసి ఈ సమీక్ష రాస్తున్నానని పొరబడేరు. ఇది కొత్తగా నిన్ననే న్యూజెర్సీలో విడుదలైన బి-గ్రేడ్ సినిమా (ఇక్కడ గ్రేడింగ్ తెలుగు సినీ పరిభాషలో ఇవ్వబడింది). ఇక వచ్చే వారమే నా ప్రస్తుత పరిశోధనా ఉద్యోగానికి ఆఖరి వారం, కాబట్టి నిన్నటి శుక్రవారం పొద్దున్నుంచీ రాత్రి తొమ్మిదింటి దాకా గది తలుపులు వేసుకొని మరీ పని చేసి (ఏ రోజు పని ఆ రోజు చేస్తే ఈ బాధ లేకపోవును.ఏం చేస్తాం!) అలసి సొలసి ఇంటి దారి పట్టాను. ధ.దే.ఈ.శు. అని ఉదయం ఉన్న ఉల్లాసం రాత్రికి కల్లోలంగా మారింది. కానీ ఇంతలోనే పట్టలేనంత ఉత్సాహం మళ్లీ తిరిగొచ్చింది. కారణం దారిలో ఉన్న థియేటర్లో ఈ మైఖేల్-మదన-కామరాజు!

ఆహా ఏమి నా భాగ్యమూ, ఈ న్యూజెర్సీ భోగ్యమూ...ఆఖరికి బి/సి సెంటర్లో ఆడే సినిమాలు కూడా ఇక్కడ ప్రత్యక్షమవుతూంటే అని మురిసిపోతూ, ఇంకో నెల రోజుల్లో ఈ సరదాలన్నీ దూరమవుతాయనే జ్ఞానంతో వగచిపోతూ టికెట్టు కొనడానికెళ్లాను. అప్పుడే సినిమా మొదలయ్యి పది నిముషాలయ్యింది. కానీ లోపలికెళ్లగానే ఖాళీ సీట్లు వెక్కిరించాయి. మరి సినిమా ఎవరికోసం వేసినట్టో అని కళ్లు నులుముకొని తిరిగి చూస్తే ఓ మూల మూడు తలకాయలు కన్పించాయి. ఇదే థియేటర్లో జల్సాకయితే మొదటి బుధవారం ఆటకు కూడా అన్ని సీట్లు నిండి ఓ నాలుగు మిగిలితే, ఇప్పుడు ఆ నాలుగూ నిండి మిగతావి ఖాళీగా ఉన్నాయి. ఔరా స్టార్ పవరూ! అనిపించింది.

ఇక సినిమా కొద్దాం. శ్రీకాంత్, సునీల్, ప్రభుదేవా హీరోలు. ఛార్మి, ఆశా సైనీ హీరోయిన్లు. ఇక కోట, బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్, మల్లిఖార్జునరావు వగైరా తారాగణం. ఇది ఫక్తు తెలుగు కామెడీ సినిమా. బుర్రకు పనిపెట్టకుండా చూసి ఆనందించగల సినిమా. కథ: ప్రేమ అంటే నమ్మకం లేని శ్రీకాంత్(మదన్) ఛార్మితో ప్రేమలో పడతాడు. బావా-బావా అని పిలుచుకొనే మిత్రద్వయం శ్రీకాంత్-సునీల్(కామరాజు). మధ్యలో పానకంలో పుడకలా ప్రభుదేవా(మైఖేల్)వస్తాడు. ప్రభుదేవా ఛార్మిని పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. అందుకోసం నడిపే ఫార్సు కామెడీయే ఈ చిత్రం. చివరాఖరికి మదన్-ఛార్మి ఒక్కటవుతారు. గోవాలో కామరాజుకు పరిచయమయ్యే భామామణి 'ఆశా సైనీ' పూర్వాశ్రమంలో జేమ్స్(బ్రహ్మానందం) భార్య. ఇక జేమ్స్ ఈ కామరాజు వేటలో ఉంటాడు.

అదేంటో బ్రహ్మానందాన్ని చూస్తేనే ఈ మధ్య నవ్వు వస్తోంది. అలనాడు రేలంగిని చూస్తేనే జనం నవ్వేవారట! అన్నట్లు మొన్న 'జల్సా'లో బ్రహ్మానందం ప్రవేశ దృశ్యానికి హీరోకు పడినన్ని ఈలలు పడ్డాయి. ఇదంతా ఒక ఎత్తైతే సమయం దొరికితే చాలు సందర్భం లేకుండా బీభత్సంగా నటించే నటభేతాళ, రాష్ట్ర విఖ్యాత నట సార్వభౌముడిగా కోట. ఇక చిన్న పాత్రల్లో వేణుమాధవ్, ఆలీ. మరీ అదిరిపోయే కామెడీ కాకున్నా కొన్ని జోకులు బాగానే పండాయి. అక్కడక్కడా నవ్వాపుకోలేక పోయాను. శ్రీకాంత్ "శ్రమ తెలియకుండా" నటించేశాడు. సునీల్ మొరటు హాస్యం రొటీనే. ప్రభుదేవా ఓ పాటలో కొన్ని ఝలక్̍లిచ్చాడు. ఇక హీరోయిన్లంటారా :-) చారుమీ న'మిత' అయ్యింది ఈ సినిమాలో

3 comments:

chandramouli said...

గుత్తంగా బాగుంది అనా బాగలేదనా మీ అభిప్రాయం ...అర్దం కాలేదు....
ఎలగయితేనేమి చూడక తప్పుతుందా ఏమిటి.. అసలే ఆంద్ర ప్రజలు...
"సమస్తసినిమాదర్శనవ్రతం" చిన్న తనంనుంచే చేస్తుంటారు కదా మరి... ....

Unknown said...

బ్రహ్మానందం అదుర్స్
అసలు తెలుగు సినిమా ప్రజలను
Expressions తో చంపేస్తున్నారు గా బ్రహ్మానందం గారు...

Mobchannel said...

Just saw your blog from www.mobchannel.com. Its a good agregator, you can find blogs of all indian languages including telegu and with a lot of good features. Please visit www.mobchannel.com.