ఈత - నా మొదటి అనుభవం.

నేను మొదటి సారి ఈత కొట్టింది అనంతపురం జిల్లా, పామిడికి దగ్గరలో ఉన్న 'నాగసముద్రం' అనే గ్రామంలో. ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే మా జిల్లాలో చెఱువులు, సముద్రాలు చాలా ఉన్నాయి కాబట్టి:-) అవి వేసవి సెలవలు, మూడు లేదా నాలుగో తరగతిలో ఉన్నాననుకుంటా అప్పుడు. ముందే చెప్పినట్టు ప్రతి వేసవి సెలవలకు మా చిన్నమామ ఉద్యోగరీత్యా ఏ ఊర్లో ఉంటాడో ఆ ఊరికెళ్లడం నాకలవాటు. ఆ సంవత్సరం నాగసముద్రంలో ఉన్నాడు.

నాగసముద్రం చాలా చిన్న పల్లె. అంతా కలిపి ఓ వంద గడపలు, కనుచూపు మేరా పొలాలు, ఊరికి దూరంగా కొన్ని వ్యవసాయ బావులు. ఒకట్రెండు రోజుల్లోనే ఓ చిన్న పిల్లగుంపు తయారు చేసుకొని ప్రతి రోజూ ఉదయం నుండి చెట్లంబడి, పుట్లెంబడి తిరుగుతూ, ఈత చెట్లకు విరగకాసిన ఈతపండ్లు రాళ్లతో కొట్టి, రాలిపడినన్నిమూటకట్టి, ఇంటికి తీసుకెళ్లేవాళ్లం. అలా ఓ రోజు ఆడుకొంటున్నప్పుడు ఆకస్మాత్తుగా ఈత ప్రపోజల్ పెట్టాడు ఓ మిత్రుడు. నాకేమో ఈత రాదాయె! మా గుంపులో దాదాపుగా అందరికీ ఈత కొట్టడం వచ్చు. సరే, అని ఇంటికెళ్లి 'మునగబెండ్లు' తీసుకొని బావి దారి పట్టాం అందరం.

మొదటిసారి పై నుంచి ఆ దిగుడుబావిని చూడగానే వెన్నులో నుంచి ఒణుకు పుట్టింది. చెడ్డీ తప్ప మిగిలినవన్నీ పక్కన పెట్టించి నడుముకు మునగబెండ్లు నారతాడుతో కట్టడం మొదలుపెట్టారు స్నేహితులు. ఒక్కొక్కొరుగా బావి లోనికి పొడవుగా సాగి ఉన్న బండ (పై చిత్రంలోలా) మీద నుంచి దూకసాగారు. నా వెనుక ఉన్న మిత్రుడు ధైర్యం చెబుతూ 'చింతూ, భయపడొద్దు! కళ్లు మూసుకొని దుంకు" అన్నాడు. నాకేమో కాళ్లు వణుకుతున్నాయి. బావి మెట్లు దిగి నీళ్లలోకి దిగితానని మంకు పట్టు పట్టాను. ఇలా కాదని ఒక్కతోపు తోసాడు. "ఛల్ల్"మని చల్లటి నీళ్లు నా ముఖానికి గట్టిగా తగిలాయి. ఒళ్లంతా ఒక్కసారి జలదరించింది. ఎక్కడో లోపలికి, పాతాళం లోనికి వెళ్లిపోతున్నట్టు అనిపించింది. నోట్లోంచి నీటిబుడగలు. విపరీతమైన భయానికి గురయ్యాను. ఇంట్లో అందరినీ తలచుకొంటున్నాను... అవే నా ఆఖరి క్షణాలయినట్టు. అలా కొన్ని క్షణాలు గడిచాక, అవి నాకు యుగాల్లా అనిపించాయి, ఎవరో నా జుత్తు పట్టుకొని పైకి లాగారు.

గాలి కోసం ఎగశ్వాస పీలుస్తున్నాను. ముగ్గురు కలిసి గట్టిగా పట్టుకొని, లాక్కొచ్చి ఒడ్డున పడేశారు. కడుపులో కొన్ని నీళ్లు వెళ్లాయి, కానీ ఇంకా స్పృహలోనే ఉన్నాను. అసలేం జరిగిందంటే, సరిగ్గా బిగించడంలో లోపమో, లేక రాపిడికి తెగిపోయాయో, మొత్తానికి నా 'మునగబెండ్లు' ఊడిపోయాయి. పైన ఆటలాడుకొంటున్న వారికి అవి అలా తేలుతూ కనిపించడంతో వెంటనే దూకడంతో నేను బ్రతికి బయటపడ్డాను. అసలు అంత ఎత్తు నుంచి దూకితే ఒక్కసారి లోనికెళ్లి మళ్లీ వెంటనే పైకి తేలి మళ్లీ లోనికెళతాము. నాకైతే పైకొచ్చిన జ్ఞాపకమే లేదు. అలా నా జలగండం గడిచింది. ఇంట్లో చెబితే తంతారని అందరూ తేలు కుట్టిన దొంగల్లా ఊరకుండిపోయారు. ఇది నా మొదటి 'ఈతా'నుభవం:-(

ఇక్కడ అప్రస్తుతమైనా, నాగసముద్రంలో సాయంకాలాలు ఏం చేసే వాళ్లమో అదీ చెబుతా. చెనిక్కాయలు(వేరుశెనగ) అనంతపురంలో విస్తారంగా పండే పంట(వానదేవుడు కరుణిస్తే!). అలా ఆ పల్లెలో విత్తనాల కోసం మూటలు మూటలు కాయలు ఒలిచేవారు. శేరు విత్తనాలు, కాయలు కాదు, ఒలిస్తే 'పావలా'(25 పై.) ఇచ్చేవారు. ఇంటి వసారాలో గుట్టలు గుట్టలుగా చెనిక్కాయలు వేసుకొని ఒలుస్తున్న పెద్దల చుట్టూ పిల్లాజెల్లా అంతా చేరి, వారి మాటలు ఆసక్తిగా వింటూ, ఒక్కోసారి ఓ పెద్దమ్మ చెప్పే కథలు వింటూ మేమూ ఒలిచేవాళ్లం. ఆ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు రావు, ఒకామె రెండు చేతులు, రెండు కాళ్లూ ఏకకాలంలో ఉపయోగిస్తూ చెనిక్కాయలను చీల్చిచెండాడేది. నేను రోజంతా కష్టపడితే ఏ పావుశేరో ఒలిచేవాణ్ణి. ఇక మా అమ్మ దగ్గరో, మా అవ్వ దగ్గరో కాసిన్ని దోసిట్లో వేసుకొని,శేరు పూర్తిచేసి ఆ 'పావలా' సంపాదించేవాన్ని.

ఇక ఆ పావలాతో ఏం చేసేవాన్నంటే...ఆ పల్లెలో అప్పుడే కొత్తగా టి.వి./వి.సి.ఆర్. వచ్చాయి. ఓ బుద్ధిమంతుడు, చిన్న గదిలో వాటిని పెట్టి, ఓ చెక్కతో అ గదిని రెండు భాగాలుగా విభజించి ,అందులో ఓ పక్క బల్లలు వేసి, చిన్న వీడియో థియేటర్ నడిపేవాడు. టి.వి. దగ్గరగా అయితే నేల టికెట్టు-వెల: పావలా, బల్ల అయితే బాల్కని-వెల: అర్ధ రూపాయి. దానికి ఊరంతా బండిలో ప్రచారమూనూ! అందుకే ఈ 'పావలా' కష్టాలు. రాత్రి తొమ్మిది కాగానే మెల్లగా ఇంటి నుంచి జారుకొని ఆ థియేటర్ చేరేవాళ్లం. ఆ పావలాతో నేల టికెట్టు కొని, టి.వి. దగ్గరగా ముఖం ఆనించి, సినిమా చూస్తుంటే...నా సామిరంగా! ఆ ఆనందమే, ఆనందం. ఆ తర్వాతెప్పుడో ఐమాక్స్లో 'మాట్రిక్స్' చూసినా, ఆ ఆనందం ముందు అది దిగదుడుపే. అలా ఆ వేసవి సెలవలు నెల రోజులూ, క్రమం తప్పకుండా ముఫ్ఫై సినిమాలు లాగించాను. బాగా గుర్తున్న సినిమా-ఎఎన్నార్ "బుద్ధిమంతుడు", అందులోని పాట- "టాటా.. వీడుకోలు..గుడ్`బై...ఇంక సెలవు!".

(చిత్రం: సాక్షి-హిందూపురం బ్యూరోకు నెనర్లు. అలాగే ఈ వారం బ్లాగు విషయంగా, మంచి పసందైన టాపిక్కులు ఇచ్చి ఎన్నో మధురమైన జ్ఞాపకాలను తట్టిలేపుతున్న ఒరెమూనా 'చావా' గారికి కృతజ్ఞతలతో...)

5 comments:

జాన్‌హైడ్ కనుమూరి said...

బాగుంది మీ ఈతానుభవం

రానారె said...

మొదటిసారి ఈతబావిలో దిగడం, అందరూకలిసి చెనక్కాయలు ఒలవడం -- నిజంగా, మీరన్నట్టు, ఆ దృశ్యాలను వర్ణించడానికి మాటలు చాలవు. ఎన్నెన్నో సంగతులు గుర్తుకొస్తున్నాయి. చాలా అందంగా రాశారు. మీకూ చావాగారికీ ధన్యవాదాలు.

(ఒక మనవి: వ్యాఖ్యలకు వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి.)

శ్రీ said...

బాగా రాసారు.

Unknown said...

Nicely written - Dr you are good writer- must have read lot of Telugu literature

Unknown said...

Nicely written- Dr you are a good writer- must have read lots of Telugu literature- keep writing