గ్రంథాలయం - నా దేవాలయం.

దేవుడి గురించి ఓ టపా మొదలు పెట్టి అది చాంతాడులా అలా సాగుతూ ఉంటే కట్టి పెట్టేసా! కానీ ఈ వారం బ్లాగు విషయం ''గ్రంథాలయం" అని తెలిసి మళ్లీ దేవుడి గురించి రాయాల్సి వచ్చింది. (చట్టబద్ధమైన హెచ్చరిక: నేనే మతానికీ చెందిన వాన్ని కాను.)

"ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను"': బైబిలు-యోహాను 1:1
"In the beginning was the Word, and the Word was with God, and the Word was God."John 1:1

(ఇక్కడ Wordను వాక్యమంటున్నారేంటీ అని మొదట అనుకొన్నా, అనువాదమెప్పుడూ అర్థాన్ని స్ఫురింపచేయాలి కానీ మక్కీకి మక్కీ(ఇది హిందీ పద ప్రయోగం:-) ఉండనవసరం లేదని తరువాత తెలిసింది.)

సరే మళ్లీ దేవుడి దగ్గరికొద్దాం...పై వాక్యంలోని 'బ్రహ్మ'రహస్యమేంటో గమనించారా? వాక్యం లేదా పదం (అంటే భాష)అనేవే లేకుంటే 'దేవుడు' అనే వాడే లేడని! అక్షరానికి, పదానికి, వాక్యానికి ఇంతకు మించిన గౌరవం ఎక్కడా నేను చూడలేదు.

అందుకే ఈ పదాలు, వాక్యాలు కలిగిన పుస్తకాలతో నిండిన విజ్ఞానభాండాగారమైన గ్రంథాలయం నా దేవాలయం అన్నది. ఒట్టి పదాలే కాదు, అంత కంటే ముఖ్యమైనది ఆ పదం మనకు చేర్చే భావం.

"But words are things, and a small drop of ink, Falling like dew, upon a thought, produces That which makes thousands, perhaps millions, think." - George Gordon Byron

ఒక మదిలో మెదిలిన ఆలోచన పదాలలో ఒదిగి మన వద్ద చేరి మనలను స్పందింపచేస్తుంది, ఆలోచింపజేస్తుంది. అందుకే అలా లక్షల మందిని ఆలోచింపజేసే పుస్తకాలకు నెలవైన గ్రంథాలయం నా జీవితంలో అంతర్భాగమైంది.

నాకు ఊహ తెలిసి మొదటిసారి నేను వెళ్లింది మా హిందూపురంలోని 'పురపాలక సంఘ గ్రంథాలయానికి'. ఇక అది కాక ఇంకో చిన్న గ్రంథాలయమూ ఉండేది- అది జిల్లా.గ్రం. వారి శాఖ అనుకొంటాను. అప్పట్లో పేపరు చదవడం, వారపత్రికలు చదవడంతో మొదలయ్యింది నా పఠనా వ్యాసంగం. ఇక వేసవి సెలవలకు మా చిన్నమామ(గ్రామీణ బ్యాంకు అధికారి) ఏ ఊర్లో ఉంటే ఆ ఊరి కెళ్లే వాళ్లం. ఇక అక్కడ నాకు నచ్చే ఒకే ఒక్క ప్రదేశం ఆ ఊరి గ్రంథాలయం.

అలా ఏ నాలుగో తరగతిలో మొదలు పెట్టిన వ్యాపకం ఇప్పుడు వ్యసనమై కూర్చొంది. నేను రాయడంలో కంటే చదవడంలో ఎక్కువ ఆనందం అనుభవిస్తాను(అందుకే ఎక్కువగా బ్లాగను:-) అదీ ఇదీ అని లేదు 'చదవబుల్' అయితే చిత్తు కాగితాన్నయినా ఏరుకొని మరీ చదవి 'పారేస్తా'ను. అప్పట్లో 'సోవియట్ యూనియన్' అని మంచి నాణ్యమైన కాగితంతో, ఒత్తుగా ఉండే పుస్తకాలొచ్చేవి, (అవి ఒక్కోసారి ఉచితంగా ఇచ్చేవాళ్లు) వాటిని ఆసాంతం చదివి ఆ తర్వాత నోటు పుస్తకాలకు అట్టలుగా వేసుకొనే వాన్ని. ఆ ప్రభావంతోనే ఏమో నా గదిలో సినీ హీరోల పటాలకు బదులు 'లెనిన్' చిత్రపటం ఉండేది.(మనం చిరంజీవికి పిచ్చ ఫ్యాన్ అని మీకిప్పటికి తెలిసే ఉంటుంది:-)

ఇక యండమూరి నవలలు, శ్రీశ్రీ, చలం పుస్తకాలన్నీ అలా చదివినవే. ఏడుతరాలు(రూట్స్) నన్ను కదిలించిన మరో పుస్తకం. చెంఘీజ్ ఖాన్ లాంటి చారిత్రక నవలలుంటే ఇక పండగే పండగ. చందమామలు, బాలమిత్రలు, బుజ్జాయిలు, మధుబాబు నవలలు, మరీ ముఖ్యంగా 'ముసుగు వీరుడు' లాంటి జానపద నవలలు అన్నీ ఈ గ్రంథాలయాల్లోనే చదివాను. ఆ ప్రభావంతోనే నాకు ఒక్కసారిగా ఓ ఆరు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆ గుర్రపుస్వారీలు, పూటకూళ్లమ్మ ఇల్లు, అడవిలో విశ్రమించడాలు ఇవన్నీ చేయాలని చచ్చేంత ఆశ.

ఈ బ్లాగు రాయల వారి పేర పెట్టడం వెనుక కారణం కూడా అదే, అంతే కానీ ఏ ఇతర grandiose delusions లేవు:-) ఇక ఇంటర్లో అనంతపురం వచ్చాక జిల్లా గ్రంథాలయం లో వీరవిహారం చేసేవాడిని. అక్కడ ఆంత్రోపాలజీ పుస్తకాలు, భారతదేశ, ప్రపంచ చరిత్ర పుస్తకాలు అన్నీ వేసుకొని డిగ్రీ కన్నా ముందే సివిల్సు కోసం చదవడం ఓ మధుర జ్ఞాపకం. అలా చరిత్ర పిచ్చి పట్టిందన్న మాట:-) ఇక కర్నూలులో వైద్య కళాశాలలో ప్రవేశించాక ఆ పుస్తకాల మోతలో కొన్నాళ్లు మా కళాశాల గ్రంథాలయానికే పరిమితం కావలసి వచ్చింది. అదీ ఒకటిన్నర సంవత్సరమే....ఆ తర్వాత ఛలో "గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జిల్లా గ్రంథాలయం". (రాయలసీమ అని మా సీమకు పేరు పెట్టిందితనే!)

చాలా మంది సినిమాల్లో చూసే ఉంటారు-కర్నూలులో కొండారెడ్డి బురుజుని. సరిగ్గా దాని వెనకాలే ఉంటుంది. అక్కడ మొదటి సారిగా బూజు దులిపి చదివిన గ్రంథం "తెలంగాణా సాయుధ పోరాటం" నిజాంకు వ్యతిరేకంగా సాగిన ఈ సమరంలో కళ్లు చెమర్చే సంఘటనలు ఎన్నో, మళ్లీ భారత ప్రభుత్వ సైనికుల చేతిలోను అసువులు బాసిన వారెందరో. సమయం దొరికితే చాలు నా బి.ఎస్.ఎ. ఎస్సెల్లార్ సైకిలేసుకొని కొండారెడ్డి బురుజు దాటి సర్వోత్తమరావు కోటలో సెటిలయ్యేవాన్ని.

ఇక అట్లాంటిక్ దాటి ఇక్కడికొచ్చాక మొదట ఈ దేశంలో నచ్చిన ఒకే ఒక ప్రదేశం మా కౌంటీ లైబ్రరీ. కొత్త కొత్త పుస్తకాలు ఎన్నో ఇంటికి తీసుకెళ్లి మరీ చదవొచ్చు. కానీ అక్కడ కుర్చొని చదివితే వచ్చే ఆనందం ఇంటిలో రాదు. ఇక అప్పట్లో(04') కొత్తగా కారు కొన్న రోజుల్లో అలా దారి తెన్నూ తెలియకుండా పోతూ ఉండడం (అప్పుడు నా దగ్గర జి.పి.ఎస్. లేదు మరి) ఎక్కడైనా పచ్చ రంగు గుర్తు కనపడితే అలా అక్కడ వెళ్లి ఠికానా వేయడం. అలా ఉత్తర న్యూజెర్సీలోని అన్ని కౌంటీ లైబ్రరీలు తెగ తిరిగి చివరికి మళ్లీ 'జార్జి స్మిత్ మెడికల్ లైబ్రరీ'కి పరిమితమవ్వాల్సి వచ్చింది.

ఇక్కడి రాజకీయాల గురించి లెక్కలేనన్ని పుస్తకాలు చదివాక, ఇక బయోగ్రఫీలపైన పడ్డాను. ఇందిరాగాంధీ గురించి ఇక్కడ చదివిన పుస్తకాలలో ఎన్నో కొత్త సంగతులు బయటపడ్డాయి. ఒక కాలంలో అమెరికా పంపే గోధుమ గింజలపైన మన భారతావని ఆధారపడి ఉందని తెలిస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అనిపించిందో! అవి బూచిగా చూపి 72'యుద్ధంలోఇందిర/ఇండియా మెడలు వంచాలని చూసినా ఆ పప్పులేమీ ఉడకలేదనుకోండి.ఇందిర అంటే ఓ దెయ్యంలా ఊహించుకొనే వాడిని (నేను ఎన్టీవోడికీ పిచ్చ ఫ్యానే:-) అది ఈనాడు ప్రభావమని ఇప్పుడు అర్థమయ్యింది. కానీ తను అప్పుడు అంతర్జాతీయంగా ఎదుర్కొన్న సవాళ్లు తన ధీరోధాత్తతను తెలిపాయి. ఒక మనిషి ఒకే పార్శ్వాన్ని చూపే ఏ పత్రిక మంచిది కాదని నా అభిప్రాయం.

ఇక అలా అలా పూర్తిగా ఆంగ్లంలో పడి మునిగి తేలాక , తెలుగు కోసం తపించిపోతున్నప్పడు ఒక్కసారిగా నాలుగు చందమామల దర్శనమయ్యింది. అప్పటి నుంచి తెలుగు బ్లాగులు చదవటం తరువాత నేనూ ఒకటి మొదలుపెట్టడం జరిగింది(అన్నట్టు మొన్నామధ్యే నా బ్లాగుకు రెండేళ్లు పూర్తి అయ్యాయోచ్!) మొదట కాస్త నత్తనడక నడిచినా, తరువాత మందగమనాన్ని, ఇప్పుడు వాయువేగాన్ని అందుకొన్నాయి తెలుగు బ్లాగులు. ఇక ఇప్పుడు సమయమంతా కూడలికే అంకితం.

చివరిగా ఓ మాట...ఈ అంతర్జాలమొచ్చాక ప్రపంచంలోని గ్రంథాలయాలన్నీ మీ ముంగిట వాలినా, గ్రంథాలయానికి వెళ్లి ఓ పుస్తకం దుమ్ముదులిపి ప్రశాంతంగా అలా పేజీలు తిరగేస్తూ చదివే అనుభూతి ఎన్ని గూగుల్ పుస్తకాలు, డిజిటల్ మాగజైన్లు చదివినా రాదు. గుడికి వెళ్లి ఆ ప్రశాంత వాతావరణంలో చేసే పూజకు, నెట్లో ఎదో ఒక సైటు నొక్కి చేసే డిజిటల్ పూజకు ఎంత తేడా ఉందో గ్రంథాలయంలో అసలు సిసలు పుస్తకాన్ని తీసి చదవడానికీ, అంతర్జాలంలో డిజిటల్ పుస్తకం చదవడానికీ అంత తేడా ఉంది.

కొసమెఱుపు: కాస్త పక్కకు చూస్తే కొత్తగా ఏర్పాటు చేసిన నా 'డిజిటల్' లైబ్రరీ కనిపిస్తుంది, షెల్ఫారీ వారి సౌజన్యంతో....కానీ ఈ పుస్తకాలన్నీ అలా పేజీలు తిప్పేస్తూ, కొత్తపేజీల వాసన చూస్తూ చదివినవే సుమా!

2 comments:

Anonymous said...

రాదుగ పుస్తకాలతో పరిచయం ఐనదన్నమాట!

అవును. అక్షరాల మీరన్నది నిజం. పుస్తకం హస్త భూషణం అన్నారు కాని, దానికి కొంత మంది చెప్పుకునే అర్ధం వేరు. ఆ కాగితం వాసన, ఆ కాగితమ్ "ఫీల్" వేళ్ళకి తగులుతూ ఉంటే ఆ పుస్తకం చదువడం లోని ఆనందం వేరు. అలాగే, పాత పుస్తకాలని కంపోజు చేసి ఆత్తోచ్చించేవారు. ఆ కాగితాలలో లోని ఖతి (ఫాంట్) ని స్పర్శించగలిగేవాళ్ళం. నేటి DTPలో ఆ అవకాశం లేదు. వేలు అలా జర్రున జారిపోతుంది. అదొక అనుభూతి. అలాగే నేటి బుక్ రీడర్స్.

word verification తప్పని సరా మీకు, వ్యాఖ్యలకి ఇబ్బందిగా ఉంటుంది అది.

జాన్‌హైడ్ కనుమూరి said...

its nice to read few lines after long time.

maagina usiri pacchadi tinnattugaa

abhinandanalu