ఎడిసన్ - యమదొంగ - దేశిపండిట్ - పది బ్లాగులు!

పైనున్న చిత్రంలోని విద్యుద్దీపం 'థామస్ అల్వా ఎడిసన్' పేరు మీద వచ్చిన బల్బుల్లో మొట్టమొదటిది. మా ఇంటికి ఓ పది మైళ్ల దూరంలో ఉన్న 'ఎడిసన్' (ఆయన గౌరవార్థం పెట్టిన పేరిది) పట్టణంలో ఆయన పని చేసిన 'మెన్లోపార్క్' ప్రయోగశాల నుంచి వచ్చిన అనేక సృజనల్లో ఇదీ ఒకటి. ప్రపంచంలో మొదటిసారి విద్యుద్దీపాలతో ధగధగలాడింది ఈ ప్రదేశం. కానీ మనం చిన్నప్పటి నుంచి చదువుకొన్నట్టు 'ఎడిసన్' కొత్తగా కనిపెట్టలేదీ 'బల్బు'ను, ఉన్నవాటిని మరింత ఉపయోగకరంగా మార్చాడు. అంతకు మించి వాటిని ప్రపంచం ఉపయోగించేట్టు చేశాడు. దీని కంటే ఆయనకిష్టమైన పనిముట్టు 'ఫోనోగ్రాఫ్'!


ఈ మాట్లాడే యంత్రాన్ని చూసి మొదట్లో చాలా మంది జడుసుకొన్నారట. అలాగే దూరవాణి(టెలిఫోను) లోనూ ఓ చెయ్యి వేశాడు. దాదాపు వెయ్యికి పైగా కొత్త 'పేటెంట్'లను తన పేర నమోదు చేసుకొన్న ఈ 'మెన్లోపార్క్ మాంత్రికుడు' ప్రాచుర్యం లోనికి తెచ్చిన మరో ఆసక్తికరమైన పదం ఏదో తెలుసా?...అలో.అలో..అలో...అంటూ మన 'రావుగోపాలరావు' కంఠంతో ప్రసిద్ధి గాంచిన 'హల్లో'!
కొసమెఱుపు: అమెరికాలో తెలుగు వారు గణనీయంగా ఉన్న ప్రదేశాల్లో న్యూజెర్శీలోని 'ఎడిసన్'ది ప్రథమస్థానం. కానీ నేను వెళ్లిన ఈ చిన్న మ్యూజియంలో అన్ని భాషల వారి రాతలు కనపడ్డాయి ఒక్క తెలుగు తప్ప! అందుకే ఇలా...
------
ఇక 'యమదొంగ'. సినిమా చూడలేదు, కానీ అంత కంటే ఆసక్తికరమైన విషయం ఎంటంటే...కొత్తగా 'గ్లోబల్ మూవీ సెంటర్' అంటూ మా 'నువార్క్ స్క్రీన్స్'కే పేరు మార్చి, అందులో ఓ తెరపై మన తెలుగు సినిమాలు ప్రదర్శించడం మొదలుపెట్టారు. గత మూడేళ్లుగా రోజూ ప్రయాణించే దారిలో ఉండడం మూలాన, బోరు కొట్టినప్పుడల్లా వెళ్లి హాలివుడ్ సినిమాలు చూసేవాన్ని, ఇప్పుడిక ఏకంగా తెలుగు సినిమానే చూడొచ్చు(కానీ హాలివుడ్ ఐదు వరహాలు, టాలీవుడ్ పదిహేను వరహాలు!!!). అన్నట్టు పక్కా హాలివుడ్ సినిమా చూసినా (లాస్ట్ లెజియన్) అందులోనూ 'ఐశ్వర్య' కనిపించి మురిపిస్తుంది. అబ్బో! చాలా దూరం వచ్చాం.
******
దేశరాకుమారి గురించి మాట్లాడుకొన్నాం కాబట్టి ఇప్పుడు కొత్త 'దేశిపండితుడి' పరిచయం కూడా చేస్తాను. ఈ మధ్య పని ఒత్తిడి,కుటుంబ బాధ్యతలు, చదువులు అన్నీ ఎక్కువై ఏమీ బ్లాగలేకున్నాను. అంతే కాక 'ఆంధ్రులు-ఆరంభశూరులు' అన్న నానుడిని నిజం చేస్తూ సగర్వంగా తీసుకొన్న బరువు బాధ్యతలకు న్యాయం చేకూర్చలేకపోయాను, అందుకు నా క్షమాపణలు! తెలుగు బ్లాగు ప్రపంచంలోని నవ-యువ-శశి("చుక్కలెన్ని ఉన్నా చందమామ ఒక్కడేలే...") అయిన 'వెంకట్' గారికి ఆ బాధ్యతను అప్పజెప్పాను. ఇక ఆయన 'ఐశ్వర్య'తో సినిమా తీయడమే తరువాయి!
******
ఇక 'ఆ' పది బ్లాగులూ...
1.సాలభంజికలు
2.కల్హర
3.సత్యశోధన
4.చదువరి
5.ఒరెమూనా
6.మనిషి
7.శోధన
8.అంతరంగాలు
9.స్నేహమా
10.గుండెచప్పుడు
ఈ పదే కాకుండా మది దోచినవి చాలానే ఉన్నాయి. ఉదా.విహారి,నా మదిలో, కొత్తపాళీ,24fps...మరెన్నో. తెలుగు బ్లాగులు అప్రతిహతమవుగాక!

6 comments:

రాధిక said...

మీ చేతి రాత చాలా బాగుందండి.ఎంత బిజీ అయినా అప్పుడప్పుడూ పలకరిస్తూ వుండండి.

కొత్త పాళీ said...

ఎల్లనృపులు గొల్వ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స!

పరువు నిలబెట్టారు డాక్టరుగారూ.

Anonymous said...

ఈ 4 in 1 ఏంటి మహాత్మా?

అంత బిజీ అయ్యారన్నమాట. ప్చ్...

-- విహారి

Anonymous said...

మీ బ్లాగు ఆ ఎడిసన్ మహాశేయుడి స్మారకాన్ని చూసేందుకు ప్రేరణగా ఉంది. త్వరలో వెళ్ళొస్తాను! కృతజ్ఞతలు!

రానారె said...

"ఆకాశవాణి. వార్తలు చదువుతున్నది డా.ఇస్మాయిల్." అన్నట్లుగా గబగబా విషయాలన్నీ రాసి(శి) పడేశారు. మెరుపు టపాలన్నమాట. ఈ పద్ధతి బాగుంది.

Naga said...

తెలుగులో కూడా రాసి చాలా మంచి పని చేసారు.