మగమహారాజులూ...మరుజన్మ ఉంటే మగువగా పుడతారా?

రోజూలానే మా ప్రయోగశాలలో పని చేసుకుంటూ ఉంటే మా సహోద్యోగిణి అయిన నైజీరియా నారీమణి మాకు ఈ ప్రశ్న వేసింది. అక్కడున్న మేమిద్దరం ఠక్కున 'నో' అని గావుకేక పెట్టినంత పని చేశాము. వెంటనే 'ఎందుకు?' అని మళ్లీ ప్రశ్నించింది. నేను సమాధానం కోసం వెతుక్కొనే లోపలే మా లాటినో లవర్ బాయ్ 'అమ్మాయిలకు లైనేసే అదృష్టం ఎక్కడుంటుంది?' అని తిరిగి ఆమెనే ప్రశ్నించాడు.

నాకు ఆ సమాధానం సబబుగానే తోచింది:-) అమె భర్త ఇదే ప్రశ్నకు సమాధానంగా "అప్పుడు అన్ని పనులు మేమే చేసుకోవాల్సి వస్తుంది. అందుకు వద్దు బేబీ" అని అన్నాడట. నిజమే కదా! ఇంట్లో పని, వంట పని, ఉద్యోగం, పిల్లల పని, పని...పని...పని...పాపం. మొన్ననే స్వాతి గారి కవిత చదివిన వెంటనే కాకతాళీయంగా ఈ సంఘటన జరగడం ఈ వైపుకు నా ఆలోచను మరల్చింది. అన్నట్టు మా సహోద్యోగులను పరిచయం చేయలేదు కదూ!

మా బాస్ జర్మన్. ప్రశ్న అడిగిన ఆమెది నైజీరియా అని మీకు ముందే తెలుసు. ఇక ఆ మన్మథులుంగారిది డొమినికన్ రిపబ్లిక్&మెక్సికో. సియోల్ (వారు సొల్ అని పలుకుతారు) నుంచి మరో లేడీ పి.హెచ్.డి. ఇక భారతం నుంచి నేను. ఇలా ఆస్ట్రేలియా తప్ప మిగతా అన్ని ఖండాల నుంచి మా పరిశోధనశాలలో ఉన్నారు.(అంటార్కిటికా ఉంది కదా అంటారా!) విచిత్రం ఏమిటంటే అందరూ దక్షిణం వైపు వారే. మా బాస్ దక్షిణ జర్మనీ, ఇక మిగతా వారు దక్షిణ అమెరికా, దక్షిణ కొరియా, దక్షిణ భారతం ఇక నైజీరియా ఆఫ్రికా దక్షిణాన లేకపోయినప్పటికీ దక్షిణ ఖండం కింద జమకట్టాం!

అలాగే రోజూ కెఫెటీరియాలో చూసే ఓ దృశ్యం నాకు ఆనందానిస్తుంది. ఒకే బల్ల దగ్గర హిజబ్ ధరించిన ఓ ఇరానియన్ వనిత, వారి మతాచారం ప్రకారం తలపై చిన్న టోపీ ధరించిన యూదు(జ్యూఁ), ఆర్మేనియన్ క్రిస్టియన్, గుజరాతీ హిందువు, ఆఫ్ఘనిస్థాన్ ముస్లిం(ఈయనది తోరాబోరా దగ్గర పల్లె అట!), అమెరికన్ క్యాథలిక్ కబుర్లు చెప్పుకుంటూ ఎంచక్కా నవ్వుతూ, తుళ్లుతూ భోంచేస్తూ ఉంటారు. సహపంక్తి భోజనం లాగా ఇలాంటివి అన్ని చోట్ల ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది.

ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఈ డొంకతిరుగుడులు ఏమిటి అనుకొంటున్నారా? ఎవర్ని ఏమార్చినా మిమ్మల్ని ఏమార్చలేం కదా! అన్నట్టు ఆమెకు మన 'జంబలకిడిపంబ' గురించి టూకీగా ఓ కథలాగా చెప్పాను, సరే అసలు విషయానికొస్తాను...స్త్రీగా పుట్టడం వల్ల కొన్ని స్వాతంత్ర్యాలను కోల్పోవాల్సి వస్తుందని నా సమాధానం. పడతులూ...నా మీద దీన్ని అలుసుగా తీసుకొని ఎగిరెగిరి పడకండేం! ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అంటే మగవాడిగా పుట్టి ఆ స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలు అనుభవించాక {పెళ్లయిన క్షణం వరకు:-( } అలా కష్టం అని అన్నానంతే కానీ మరోలా అర్థం చేసుకోకండి.

మరి బ్లాగ్రాజులు మీరేమంటారు ఇక్కడ సెలవివ్వండి. బ్లాగ్రాణులు కూడా ఈ ప్రశ్నను కొద్దిగా మార్చి మరుజన్మలో (ఉంటే గింటేనే సుమా!) మగవాడిగా పుట్టాలనుకొంటున్నారా? కు సమాధానమివ్వండి. కాకపోతే ఎవరిచ్చినా మీ సమాధానాలు నిజాయితీగా ఇవ్వండి.

8 comments:

జ్యోతి said...

నేను మాత్రం ఆడదానిగా పుట్టాలనే కోరుకుంటాను.ఎందుకో చెప్తా!

Unknown said...

అసలు ఆడవారు గొప్పా లేక మగవారా ? ఎవరు ఎలా పుట్టాలనుకుంటున్నారు ? ఇలాంటి ప్రశ్నలు అవసరమా ?

తప్పుగా అనుకోకండి. ఎవరు గొప్ప, ఇలాంటి ప్రశ్నలు అనవసరం అని నా అభిప్రాయం. లేని పోని వ్యత్యాసాలు సృష్తిస్తాయని నా అభిప్రాయం. ఎవరు ఏది కాదన్నా మన కుటుంబాలకి ఆడవారు, మగవారు ఇద్దరూ సమానంగా అవసరం అన్నది నిర్వివాదాంశం. మరి అలాంటప్పుడు ఈ వాదనలెందుకు ?

రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అన్నట్టు ఇద్దరూ ఉంటేనే ఒక కుటుంబం సంపూర్ణం. అలోచించండి ఇద్దరూ లేకపోతే పిల్లలు ఎలా పుడతారు. ఆ పిల్లలకు దిశా నిర్దేశం ఎవరు చేస్తారు ? వారిని సంపూర్ణంగా ఎవరు తీర్చిదిద్దుతారు ? అమ్మా, నాన్నా ప్రేమ, అనురాగాలు రెండూ అవసరమే.

తప్పుగా అనుకోకండి. ఇది నా అభిప్రాయం మాత్రమే.

Anonymous said...

నేను అదే చెప్పాలనుకుంటుంటే ప్రవీణ్ గారు చెప్పేశారు.
ఆడైనా, మగైనా, అందమైన మనసు, ఎవరి పాత్ర పై వారికి
అభిమానం, ఇంకొకరి పాత్రపై గౌరవం
ఉండాలని నా కోరిక, ఈ జన్మలోనైనా, మరుజన్మైనా.

అలా ఉంటే రెండు జన్మలూ అందమైనవే.
అయితే నిజానికి మాత్రం ఆడ జన్మలోని మాధుర్యం అనుభవించడానికి
అవకాశం లభించిన ఆడవారు చాలా తక్కువ మంది ఉన్నారు.
మగ జన్మ లోని స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామనుకుంటూ
ఆడ వాళ్ళను అష్తకష్టాలు పెట్టే మగ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.

నా మరు జన్మలో సమాజం లో మనుషులందరూ సమానంగా గౌరవింపబడే
అవకాశాలుండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ, అది ఈ జన్మలోనే ఎందుకు కాకూడదు
అని అనుకుంటున్నాను.

లలిత.

రాధిక said...

అసలు తరువాతి జన్మ లేకుండావుంటే బాగుంటుంది అనుకుంటున్నాను.

Dr.Pen said...

జ్యోతి గారూ...

నా సమాధానం మీ బ్లాగులో!

ప్రవీణ్ & లలిత గారూ...

నా ప్రశ్న సరిగా అర్థం చేసుకున్నట్లు లేదు మీరు.(అయినా అది నా ప్రశ్న కాదు.ఓ స్త్రీ నాకు వేసిన ప్రశ్న!)
జ్యోతి గారికిచ్చిన సమాధానమే మీక్కూడా-
"స్త్రీ జన్మ గొప్పదా?
పురుష జన్మ గొప్పదా?

ఈ ప్రశ్నకు నా సమాధానం ‘స్త్రీ’ జన్మనే!నేను కూడా స్త్రీ పక్షపాతినే…కానీ నా ప్రశ్న ఉద్దేశం(context) వేరు."
రాధిక గారూ...

అందుకే (ఉంటే గింటే) అన్నది.మరుజన్మ అన్నది ఉండదు అని నమ్మేవాన్ని కానీ ఇక్కడ ప్రశ్న 'ఉంటే' మీ సమాధానమేమిటి...అంటే 'అవునా-కాదా' మీ సమాధానం 'అవును'- అయితే 'ఎందుకు?', 'కాదు'-అయితే 'ఎందుకు?'

నా ప్రశ్నను సరిగా అందరూ అర్థం చేసుకోలేదని అనుకొంటున్నాను.

Dr.Pen said...

జ్యోతి గారూ...

సారీ.మీరొక్కరూ సరైన సమాధానమే ఇచ్చారు!

Anonymous said...

ఇస్మాయిల్ గారు,

ఇంకోసారి ప్రయత్నిస్తాను.

మరు జన్మలో మగ వాడిగా పుట్టాలని ఉంది.
కారణం కుతూహలం మాత్రమే.

ఇక్కడ ఒక చిక్కుంది.
పోయిన జన్మ గుర్తు ఉండదు.
కాబట్టి కుతూహలం తీరడమనేది కుదరదు.

ఆడ దాన్నైనా, మగ వాడినైనా, ఆ ఒక్కటే
నాకు సంతొషమో దుఖమో ఇస్తుందని చెప్పలేను.
అందు వల్ల ఇంతకు ముందు అలా రాశాను.

లలిత.

Anonymous said...

ఎప్పుడూ అనిపించలేదు కానీండి.
ప్రసవ వేదన పడినప్పుడు, బాబు వల్ల రాత్రిళ్ళు నిద్ర చాలకపోయినా ఆఫీస్ పని చెయ్యాల్సి వచ్చినప్పుడు,
ఇలా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం ఆహా! మగ వాళ్ళ పని ఎంత హాయి అనిపించింది.

కానీ స్త్రీ కావటం వల్ల చాలా సందర్భాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, గౌరవం, ప్రేమ పొందగలిగినందుకు ఇదే బాగుంది కదా అనిపిస్తుంది.

నేనైతే ఈసారి అబ్బాయిగానే పుట్టాలనుకుంటాను.
లాభాలేవో ఉంటాయని కాదు కానీ లలిత గారన్నట్టు కుతూహలం కొద్దీ.