50,000 ఏళ్ల క్రిందటి మీ/నా ముత్తాత-ముత్తాత-ముత్తాత....!

పైనున్న చిత్రాన్ని చూస్తున్నారుగా. మీరు చదివింది నిజమే- అది 50,000 ఏళ్ల నా ముత్తాత-ముత్తాత-ముత్తాత...ముత్తాత స్వస్థలం: ఆఫ్రికా! నాదే కాదు ఈ భూమ్మీద ఇప్పుడు నివసిస్తున్న అందరి ముత్తాత అక్కడి వాడే! కాకపోతే వివిధ సమయాల్లో వివిధ మార్గాల ద్వారా ప్రస్తుతం నివసిస్తున్న చోటుకు చేరుకొన్నారు.

'నేషనల్ జియోగ్రఫిక్' & 'ఐ.బి.యం' వారు సంయుక్తంగా జరుపుతున్న పరిశోధనల్లో భాగంగా 'జీనోగ్రాఫిక్' అన్న ప్రాజెక్టులో పాలుపంచుకోవడం ద్వారా నాకీ విషయం తెలిసింది. మానవశాస్త్రం(ఆంత్రోపాలజీ) పై నాకున్న ఆసక్తి దృష్ట్యా...'నా మూలాలేవి?' అన్న ప్రశ్నకు సమాధానం కోసం అందరూ వెతుకుతూంటారనే ఊహతో ఇలా మీ ముందుకు తెస్తున్నాను.

అసలు ఈ పరిశోధన ఉద్దేశాలు ఏంటంటే ఐదేళ్లలో లక్షమంది దాకా వివిధ ప్రాంతాల ప్రజల డి.ఎన్.ఏ ను తీసుకొని మానవులు ఎక్కడెక్కడ వలస పోయారు అని నిర్ధారిస్తారు. అంతే కాక కనుమరుగయిపోతున్న కొన్ని రకాల జాతుల వారికి సాయమందిస్తున్నారు. ఇక మన డి.ఎన్.ఏ ఎలా తీసుకొంటారంటే చిన్న దూదిపుల్ల(క్యూ టిప్) తో మన నోట్లో బాగా రుద్దితే చెంపల లోపల ఉన్న మెత్తటి భాగం నుంచి కొన్ని కణాలు అంటుకొంటాయి. వాటితో మన జన్యువులను సంపాదిస్తారు.

ఇక మన జన్యువుల్లో సగం 'నాన్న' నుంచీ, సగం 'అమ్మ' నుంచీ వస్తాయని అందరికీ తెలిసిందే...కానీ ఆ జన్యవులు సమ్మిశ్రమం(రీకాంబినేషన్) చెందడం వల్ల మనం మన పూర్వీకులందరి పోలికలతో ఉంటాము(ఉదా.మన జూ.ఎన్టీయార్ కు తాత గారి పోలికలు రావడం). కానీ దీని వల్ల సమాచారం అంతా కలగాపులగం అయిపోవడంవల వల్ల మనం ఎవరి నుంచి వచ్చామో తెలిసేందుకు కష్టమవుతుంది.

ఇక్కడే మనకు 'వై' క్రోమోజోము ఉపయోగపడుతుంది. మగవారు 'ఎక్స్-వై' అని, ఆడవారు 'ఎక్స్-ఎక్స్' అని మనకు తెలిసిందే. అంటే ఏ సమ్మిశ్రమం కాకుండా తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుకుకు వచ్చే వారసత్వ వాహిక ఇదే. అలాగే తల్లి నుంచి పిల్లలకు ఎలాంటి ఇతర కలయిక లేకుండా వచ్చే జన్యుపదార్థం 'మైటోకాండ్రియా'లో ఉంటుంది. ఇప్పుడు మగవారిలో ఈ 'వై'ను కానీ, స్త్రీలలో 'మై'ను కానీ శోధిస్తే మన పుట్టుపూర్వోత్తరాలు తెలుస్తాయి.

కానీ ఇక్కడా ఓ చిక్కుంది, అరుదుగా సంభవించే 'ఉత్పరివర్తనాలు' (మ్యూటేషన్స్) మనలో మార్పులు తెస్తాయి. కానీ ఇక్కడ అవే మనకు ఉపయోగపడతాయి. ఎలా అంటారా? 30,000 ఏళ్ల క్రితం నా పూర్వీకుని 'వై' లో జరిగిన ఉత్పరివర్తనం మీలో ఉన్నదనుకోండి, అప్పుడు మనం ఆ పూర్వీకుని వారసులం అవుతాము.

ఇక నా జన్యువులను పరికిస్తే 'ఎం.168' అనే జన్యు గుర్తు మొట్టమొదట 50,000 ఏళ్ల కిందట 'ఆఫ్రికా' లోని రిఫ్ట్ లోయ ప్రస్తుత ఇథియోపియా, కెన్యా, టాంజానియా ప్రాంతంలో నివసించిన మీ/నా 2000వ ముత్తాతలో ఉంది. అప్పటి ప్రపంచ మానవ(హోమో సేపియన్స్) జనాభా 10,000! మీ/నా అని ఎందుకంటున్నానంటే ఇతని వంశం మాత్రమే ఆఫ్రికా వెలుపల ఉన్న అన్ని జాతులకు మూలమయ్యింది. అంటే ప్రపంచంలో ఇప్పుడు ఆఫ్రికా జాతి కాకుండా ఉన్నవారందరి మూలపురుషుడు ఈ ముత్తాతగారేనన్నమాట. నమ్మకం కలగడం లేదా...అయితే 'స్పెయిన్' నుంచి ఈయన గారి మూలాలు చూడండి!

2000వ అని ఎందుకన్నానంటే ఉజ్జాయింపుగా ప్రతి 25 సంవత్సరాలకు ఓ తరం మారుతుంది (ఉదా.మా తాత పుట్టింది 1924, మా నాన్న 1950, నేను 1975, మా సుహాసు 2002) అలా లెక్క వేస్తే 50000/25=2000 కదా! ఇక మన జన్యు ప్రయాణానికి తిరిగొస్తే 'ఎం.168' నుంచి 45,000 ఏళ్ల క్రితం 'ఎం.89' అనే మరో జన్యు గుర్తు కల మనిషి 'మధ్యాసియా' ప్రాంతంలో ఉన్నాడు. 30,000 క్రిందట మళ్లీ 'ఎం.69' అనే జన్యు గుర్తు కల పూర్వీకుడు 'భారతదేశం'లోనికి ప్రవేశించాడు. అందుకే ఈ 'ఎం.69'ను 'ఇండియన్ మార్కర్'(భారతీయ గుర్తు) అని పిలుస్తారట.

ఈ 'ఎం.69' మరియు 'ఎం.20' (వీరిని భారతీయ వర్గం అంటారు) జన్యుగుర్తులున్న గుంపులు మనదేశంలోనికి ముఫై వేల ఏళ్ల క్రిందట అడుగుపెట్టాయి. ఇక్కడ ప్రతిసారీ సంవత్సరాల సంఖ్యలను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే మన దేశానికి 'ఆర్యులు' వచ్చిందే 4000 ఏళ్ల కిందట! అంటే అంతకన్నా మునుపు నుంచే నా మూలాలిక్కడ ఉన్నాయని అర్థం. అలాగే మా పూర్వీకులెప్పుడో మతం మారారనీ తెలుస్తోంది. ఈ 'ఆర్య-ద్రావిడు'ల గురించి మరోసారి ముచ్చటిస్తాను.

- మీ డా.ఇస్మాయిల్ పెనుకొండ.

4 comments:

Anonymous said...

ఈ వ్యాసం పై 'సురేష్ కొలిచాల' గారి అభిప్రాయం:

డా.ఇస్మాయిల్ పెనుకొండ గారు,

'జీనోగ్రాఫిక్' మీద మీ వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే మన దేశానికి 'ఆర్యులు' వచ్చిందే 4000 ఏళ్ల కిందట అని అంత ఖచ్చితంగా తేల్చి చెప్పకండి. M-మార్కర్ల కంటే హల్పోగ్రూపులను వాటి పేర్ల ద్వారా ప్రస్తావించడం తేలికేమో? R1a1 మధ్య ఏసియాలో కనిపించినా R2 ఇండియాలో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా పరిశోధనలు చేసి నిగ్గు తేల్చాసిన విషయాలు చాలా ఉన్నాయి.

Regards,
Suresh.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మన దేశానికి ఏ ఆర్యులూ రాలేదు. ఇక్కడివారే ఇతర ప్రాంతాలకి వలసపోయారు. ఆర్యులనేది బ్రిటీషువారు తమ దురాక్రమణల్ని సమర్థించుకోవడానికి అల్లిన కట్టుకథ. సదరు కట్టుకథకి ఏ చారిత్రిక ఆధారాలూ లేవు. మాలాగే మీరూ బయటివారేనని భారతీయులకి నూరిపొయ్యడానికి అంతకుముందు ఎప్పుడూ కనివిని ఎఱుగని జాతి నొకదాన్ని సృష్టించారు.అలాగే సంస్కృత భాష గొప్పతనాన్ని అంగీకరించడం ఇష్టం లేక Proto-Indo-European భాష అంటూ ఒక లేని భాషని అభూత కల్పన చేశారు. చెప్పలంటే చాలా ఉంది.ఈ విషయాల గురించి నా బ్లాగులో ఎప్పుడైనా రాస్తాను.

Dr.Pen said...

సురేష్ గారూ, బా.సు. గారూ...

మీ స్పందనలకు ధన్యవాదాలు. నిజమే! ఆర్యుల గురించి నేను రాసింది చారిత్రకంగా నాకు తెలిసింది మాత్రమే.మీరన్నది నిజమే అయితే ఇప్పటి శాస్త్ర-సాంకేతిక విజ్ఞానంతో అది కూడా కనుక్కొనే రోజు ఎంతో దూరంలో లేదు.

-మీ ఇ.పె.

Unknown said...

మన దేశానికి ఆర్యులు 4000 ఏళ్ల కిందట వచ్చారనేది బాషాపరంగా పురాతత్వ ఆదారాల నిరూపించబడిన పచ్చి నిజం. వారు వచ్చి ఇక్కడి ప్రపంచలో గొప్పగా పేర్కొనబడిన మొదటి మూడు నాగరికతలలో ఒకటయిన ద్రావిడులచే నిర్మింపబడిన ది గ్రేట్ సిందు నాగరికతను ద్వంసం చేసారనేది తిరస్కరించలేని పచ్చి నిజం. అయితే ఈ మాట అన్నప్పుడల్లా కొంతమంది ముఖ్యంగా బ్రాహ్మణులు ఉలిక్కిపడి కాదని వితండవాదం చేస్తారు. తిమ్మిని బొమ్మి చేస్తారు. ఇది బ్రిటిష్ వారి కుట్ర అంటారు. అసలు పురాతత్వ శాస్రమే తప్పు అంటారు. అసలు చరిత్రే తప్పుల తటక అంటారు. ఎందుకంటే బ్రాహ్మణులు ఆర్యులు కనుక. ఇది బ్రాహ్మణులకు బాధ పెట్టినప్పటికీ తిరుగులేని తిరస్కరించలేని చారిత్రాత్మక సత్యం. డా. ఇస్మాయిల్ చెప్పి నట్లు ఇప్పటి శాస్త్ర-సాంకేతిక విజ్ఞానంతో అది కూడా కనుక్కొనే రోజు ఎంతో దూరంలో లేదు. అయితే చరిత్రలో ఎప్పుడో ఆర్యులు చేసినదానికి ఇప్పటి బ్రాహ్మణులను దానికి బాద్యులను చేయాలనుకోవడం కూడా చాలా తప్పు, మూర్కత్వం. చరిత్రలో అన్ని జాతులు, మతాలూ కొన్ని కొన్ని పొరపాట్లు చేసినా అవి తిరిగి మనమంతా ఒక భారత జాతి గా ఏర్పడటానికి ఎంతో దోహదం చేసి మనల్ని ప్రస్తుత నాగారికతలోకి సగర్వంగా నిలబెట్టాయనేది ప్రత్యషంగా కళ్ళ ఎదుట కనిపిస్తున్న నిజం.