(మా హిందూపురం 'కొట్నూరు' చెరువు గట్టు)
దిల్ గారు 'దిల్ ఖుష్' అయ్యే వ్యాసం పరిచయం చేశారు. మొదట ఇంత మంచి వ్యాసాన్ని రచించిన 'వనజ' గారికి, అందించిన 'ఆంధ్రజ్యోతి'కి కృతజ్ఞతలు. చెరువులు మన ప్రాంత రైతన్నలకు ప్రాణాధరువులు! ఇలాంటి మంచి పనులు మన ప్రభుత్వాలు ఎందుకు చేయవో? రాయల కాలం నాటి ప్రాప్తకాలజ్ఞత, ముందుచూపు ఇప్పుటి పాలకులకు ఎందుకు లేదో అర్థం కాదు. ఇలాంటి మంచి పనులు చేసి వారి జీవితాల్లో దీపం పెడుతున్న వారికి నా అభినందనలు.
మా అనంతపురం జిల్లాలో ఈ చెరువులు కోకొల్లలుగా కనిపిస్తాయి...అందుకు ఈ ఊరి పేర్లే నిదర్శనం- కొత్తచెరువు, రాయలచెరువు, నల్లచెరువు, ఓబులదేవరచెరువు, ఎర్రతిమ్మరాయచెరువు,తలారిచెరువు, మద్దెలచెరువు(మన సూరి బావ ఊరు!)...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో! అలాగే సముద్రం అన్న ఊరి పేర్లు కూడా ఈ చెరువులనే సూచిస్తాయి.ఉదా. బుక్కరాయసముద్రం, మణేసముద్రం, బ్రహ్మసముద్రం, భోగసముద్రం...ఇలా. అలాగే కుంటలు కూడా - నంబూలపూలకుంట.
చెరువు కట్ట తెగితే తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి కాపాడుకొనేవారు ఆనాటి ప్రజలు. ఎందుకంటే ఆ రోజుల్లో ఊరిలో అందరికీ నీరే జీవనాధారం కాబట్టి. అలా అనంతపురం చెరువు తెగినప్పుడు తన ప్రాణాలను ధారపోసిన ఓ యువతి 'ముసలమ్మ'. అప్పటి నమ్మకాల ప్రకారం ఆమె ప్రజల క్షేమం కోరి ఆత్మాహుతి చేసుకొంది. ఆ సంఘటనే 'కట్టమంచి రామలింగారెడ్డి' రాసిన 'ముసలమ్మ మరణం' కవితకు ప్రేరణ అయ్యింది.
-మీ 'డా.ఇస్మాయిల్ పెనుకొండ'.
అలాగే తెలుగు కథకుల్లో చాలా మందికి 'చెరువు' కథా వస్తువయ్యింది. 'ఈమాట'లో 'అటా' వారి బహుమతి పొందిన వ్యాసంలో 'చెరువు'పై వచ్చిన కథలను పరిచయం చేసుకోండి ఇలా...
"వ్యవసాయానికి అవసరమైన నీటి వనరులను జాగ్రత్త చేసుకోవడం కంటే కూడా అధిక పెట్టుబడులతో ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే క్రమంలో చెరువులు లేకుండా చేయడం అన్న పరిస్థితిని చర్చకు పెడుతూ మధురాంతకం మహేంద్ర ‘ముసలమ్మ మరణం’ అన్న కథ రాశారు.
నీరు వారి జీవనాధారం. అవి లేనట్టయితే పంటలు పండక కడుపు నిండక కరువు పాలవుతారు. అందుకే జలవనరులను కాపాడుకోవడం కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు తాపత్రయ పడతారు .అయితే భూమిని అమ్మకపు సరుకుగా మాత్రమే చూసే వాళ్ళకు ఇవన్నీ కాబట్టవు, ఆ చెరువును కాపాడుకోవడానికి ఆమె జీవిత పర్యంతం చేసిన పోరాటం, సంఘర్షణ...చివరికి ఆమె మరణం తర్వాత ఆ స్థలం పారిశ్రామిక వాడగా మారిపోవడం...వీటన్నింటి వెనుకనున్న రాజకీయ ఆర్థిక సూత్రాలను లోతుగా పట్టుకున్న కథ ‘ముసలమ్మ మరణం.’
ఇదే కోవలో గంథం నాగరాజు రాసిన ‘చెరువు’ అన్న కథలో చెరువును తెగ్గొట్టడాన్నిచివరి క్షణందాకా వ్యతిరేకించి పోరాటం చేసిన నర్సిరెడ్డి చివరికి ఊళ్ళో వాళ్ళు చెరువు నరుకుతుంటే అడ్డంపడి తలపగిలి చచ్చిపోతాడు."
- "ప్రస్తుత తెలుగు కథ - ఒక జీవన కఠోర వాస్తవం" నుండి »రచన : వి. ప్రతిమ.
1 comment:
మా వూరి పేరు "కల్పనాయుని చెరువు". రాయల సీమలో ప్రతిచోటా ప్రతి వూరికీ ఇంచుమించు ఒక చెరువు వుంటుందనుకొంటా!
--ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment