"కాఫీ విత్ కొత్తపాళీ"...


ఎన్నాళ్లుగానో అనుకొన్న భేటీ ఈనాటికి కుదిరింది. మొట్టమొదటి సారి 'కొత్తపాళీ' అన్న పేరు కొత్తగా విన్న రోజుల్లో ఎవరీయన? అన్న ప్రశ్న చాన్నాళ్లు ఓ మిస్టరీలా, విడిపోని చిక్కుముడిలా ఉండేది. బ్లాగులో చిత్రం చూసి అల్లసాని వారిలా పెద్దాయన ఏమో అనుకొన్నాను. మొదటి సారి ఆయన ఛాయాచిత్రం చూశాక మరీ పెద్దాయన కాదు కానీ, నడివయస్కుడే అనుకొన్నాను. కానీ ప్రత్యక్షంగా చూశాక నేనే మధ్యవయస్కుణ్ణి అనుకొంటూంటే ఈయనేంటి కుర్రాడిలా ఇంత చలాకీగా ఉన్నాడని ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది.

సంగీత, సాహిత్య ఆస్వాదనే కాకుండా స్వతహాగా నిత్య నృత్య విద్యార్థి అయిన నాశీ గారు ఈ మధ్య సునీల్ సిక్స్ ప్యాక్ చూసి కాస్త వ్యాయామం, కసరత్తు చేసేలాగుంది అనుకొన్నాను. మొత్తానికి క్రిసెంట్ సిటీలో చంద్రశేఖరుని దర్శనం జరిగినంత సంబరపడ్డాను. అదీ సతీసమేతంగా రావడం మరింత ముదావహం.ఇద్దరితో ఎన్నో కబుర్లు, తర్వాత జాక్సన్ బ్రూవరీలో విందుతో ఎంతో పసందుగా గడచింది ఆ సాయంత్రం.

ఈ ఉదయం మళ్లీ కెఫెలో కాఫీ తాగుతూ ముచ్చట్లలో పడ్డాం. కథల గురించి మాట్లాడేటప్పుడు ఎన్నో ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు, ఇప్పుడు ఆలోచిస్తే వాటిని రికార్డు చేయాల్సింది అనిపించింది, కానీ ఆ క్షణంలో మైమరచి వింటూ ఆ విషయమే మరచిపోయాను. బ్లాగులు, కథలు, సినిమాలు, పుస్తకాలు అలా అలా మాట్లాడుతూ సమయమే తెలియలేదు. చివరగా వీడ్కోలు చెప్పేప్పుడు, చిన్నప్పుడు ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే...వాళ్లు వెళ్లిపోయేటప్పుడు ఏదో తెలీని బాధ కలిగేది, అలాంటి బాధ...వెలితి మళ్లీ అనుభవంలోకి వచ్చింది. 'ప్రతి వీడ్కోలు మరో కలయికకు నాంది' అని మనస్సుకు నచ్చచెప్పుకొని మా ఊరి దారి పట్టాను.

3 comments:

శరత్ కాలమ్ said...

టపా టైటిల్ బావుంది :)

Kottapali said...

Thank YOU for making the trip. I too enjoyed our conversations.

మాగంటి వంశీ మోహన్ said...

రాయలవారు అంత లోటాడు కాఫీ తాగించాక, మీకు కిక్కెక్కినా ఎక్కకపోయినా మాటలు నచ్చకపోతే అప్పటిదాకా ఒరలో ఉన్న కత్తులు బయటకు రావూ? కొండొకచో రాయలవారికి కోపం వస్తే శిరచ్చేదనం కూడా జరిగిపోగలదు....Just kidding

డాట్రారూ - రికార్డరు లేకపోతే ఏమి? మనసులో మిగిలిపోయిన ఆ ఆణిముత్యాలేవిటో ఇక్కడ జల్లితే మేమూ చూసి మురుస్తాం!