"మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు"

"నన్నయాదుల కన్నతల్లికి సన్నజాజుల మాలలు అర్పిస్తూ
ఆంధ్రకేసరి వీరమాతకు సాంద్రకర్పూర హారతులందిస్తూ
రాలుకరిగే త్యాగరాజుని రాగసుధలో పరవశిస్తూ
కూచిపూడి కళామతల్లికి నాట్యాంజలులు సమర్పిస్తూ
అమెరికాలో తెలుగు తల్లికి సాహిత్యాలంకరణలు చేస్తూ
మురిసిపోదాం మనందరం
మనందరం తెలుగు భాషాభిమానులం"
వంగూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో,  అమెరికాలోని హ్యూస్టన్ మహానగరంలో గత శని, ఆదివారాల్లో  జరిగిన  "మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" లో పద్మశ్రీ యార్లగడ్ల లక్ష్మీప్రసాద్, వింజమూరి అనసూయా దేవి, డి.కామేశ్వరి, భువన చంద్ర, ద్వా.నా. శాస్త్రి, అక్కిరాజు రమాపతిరావు, సాహిత్య అకాడమీ సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాసరావు, తెన్నేటి సుధాదేవి, నందుల సుశీలాదేవి, కడిమెళ్ల వరప్రసాద్, కోట లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు. అంతే కాక తెలుగంటే పడి చచ్చే తెలుగు పిచ్చోళ్లు చాలా మందే విచ్చేశారు, తెలుగు సాంస్కృతీ సౌరభాలను పోటీలు పడి మరీ పీల్చేసారు.
అలాంటి తెలుగు పిచ్చోళ్లలో ఒక్కడైన నేను ఈ పుణ్యాన అయినా బూజు పట్టిన నా  బ్లాగుని ఓ దుమ్ము దులిపి  మీతో ఆ విశేషాలు పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అఫ్సర్ గారు  అంకుశంతో పొడిచి, కొత్తపాళీ గారు తమ చురుకైన పాళీతో గుచ్చి, మా జ్యోతక్క ఘాటు ఘాటు తిరగమోత వేసి మరీ నన్ను ఇటు వైపుకి లాక్కొచ్చారు. వీరికి ముందుగా నా కృతజ్ఞతలు.

'వంగూరి చిట్టెన్ రాజు ', ఆ రాజు గారి 'విక్టోరియా' మహారాణి గురించి ఎన్నాళ్లుగానో ఎక్కడెక్కడో చదువుతూ వచ్చాను కానీ వారి దర్శనభాగ్యం మాత్రం ఇప్పుడే కలిగింది. అంతే కాక ఎప్పుడూ పుస్తకాల్లో, బ్లాగుల్లో, ఫేసుబుక్కుల్లో చూసిన పెద్దలు వెల్చేరు నారాయణరావు గారు, వేమూరి వెంకటేశ్వరరావు గారు, జంపాల చౌదరి గారు మున్నగు వార్లతో భేటీ అయ్యే మహదవకాశం కలిగింది. 


ఇక మిత్రులు, స్నేహ బంధువులు అఫ్సర్, కల్పనగార్లను చాలా కాలం తర్వాత కలవడమే కాకుండా అఫ్సర్ గారి సన్మానం, కల్పన రెంటాల గారి 'తన్హాయీ' నవల ఆవిష్కరణలో పాలుపంచుకొనే అవకాశం దక్కింది. 'కౌముది' సంపాదకులు కిరణ్ ప్రభ గారిని, 'సుజనరంజని' సంపాదకులు రావు తల్లాప్రగడ గారిని కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది.


ఇక విషయానికి వస్తే ఈ మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు "మా తెలుగు తల్లి" పాటతో శుభారంభం అయ్యింది. హ్యూస్టను తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షురాలు 'శారద ఆకునూరి'గారు  ప్రధాన అతిథులను వేదిక మీదకు ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన కావించిన తర్వాత, కళాప్రపూర్ణ 'డా. వింజమూరి అనసూయా దేవి' గారి చేతుల మీదుగా సభ లాంఛనంగా  ప్రారంభం అయ్యింది. ఇక సభలో సాగిన ఉపన్యాసాలు, స్వీయ రచనా పఠనాలు, 'భువన చంద్ర' గారి చమ్మక్కులు, 'ద్వానా శాస్త్రి' గారి కంచు కంఠంతో చేసిన ప్రసంగం, జంట కవులు "కడిమిళ్ల వరప్రసాదు, కోట లక్ష్మీ నరసింహం" గారి ఆశుకవిత్వం షడ్రసోపేత భోజనాన్ని తలపించాయి.  




ఉపన్యాసాలలో ముఖ్యంగా చెప్పుకోవలసింది " ఆంధ్ర సాహిత్యంలో జానపద కథల గొప్పతనము ఏది?" అంటూ తెలుగులో ప్రసంగించిన ఫ్రెంచి ప్రొఫెసర్ 'డేనియల్ నెజెర్స్'  పరాయి భాషను కష్టపడి నేర్చుకోవడమే కాకుండా, ఎంతో ఇష్టపడి సంకర భాషలో కాకుండా, అచ్చమైన తెలుగు పదాలతో ఆయన చేసిన ప్రసంగం ముచ్చటగొలిపింది. 


ఇక ముఖ్యమైన ఉపన్యాసాలు - ఉపన్యాసకుల వివరాలు :

'ఐరోపాలో తెలుగు సాహిత్యం' -  రామకృష్ణ మాదిన
'
మధ్యప్రాచ్య దేశంలో తెలుగు స్థితిగతులు' - బి.వి. రమణ
'సినిమా పాటలో సాహిత్యం' - భువన చంద్ర
'తెలుగు కథ పరిణామం' - డి.కామేశ్వరి
'ఆంధ్రప్రదేశ్ లో సాహిత్య ప్రభంజనం' - వంశీ రామరాజు
'తెలుగు సాహిత్యంలో విదేశీయుల పాత్ర' - ప్రసాద్ తోటకూర
'మనోళ్లు' - మూర్తి జొన్నలగడ్డ
'మానవ విలువలు విప్పార చేధ్దాం' - నరిసెట్టి ఇన్నయ్య
'ధూర్జటి విలక్షణత' - రావు తల్లాప్రగడ
'కవితా వికాస క్రమం' - తెన్నేటి సుధాదేవి
'ఆరువందల పదసాహిత్యం' - ప్రమీళాదేవి మంగళగిరి
'తెలుగు సాహిత్యంలో సంగీత శాస్త్రాలు' - శారదా పూర్ణా శొంటి
'మనుచరిత్ర' - బాలాంత్రపు రమణ


రమణ గారి శ్రీమతి శారద గారు పాడిన 'పాండవోద్యోగ విజయాల' నుంచి పద్యాలు ఒన్స్ మోర్ ఈలలతో పసందుగా సాగాయి.ఇవన్నీ ఒక ఎత్తైతే కర్ స్టెన్ డి.కాలవే అనే అమెరికా విద్యార్థిని చేసిన ముద్దు ముద్దు మాటల తెలుగు ప్రసంగం ఇక్కడ...


ఈమెకు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ఉత్తమ విద్యార్థి పురస్కారం లభించింది. అలాగే పోకల శిరీష్, కొవ్వలి ఆరతి కామేశ్వరి, విరళ్ భాయ్ ఎం. భక్తలకు తానా పురస్కారాలు...క్రిష్టఫర్హ్ జాన్ బ్రాం, శొంటి పూజలకు శాన్ ఆంటోనియో తాసా పురస్కారాలు లభించాయి. వీరందరికీ చదువు చెప్పించిన తెలుగు మాష్టారు 'అఫ్సర్ మొహమ్మద్' కు  తానా వారు "  Outstanding Professor"   ఫలకాన్ని ఇస్తూ ఘనంగా సత్కరించారు. 



ఇక 'డాలాస్ గ్యాంగ్' అని ముద్దుగా పిలుచుకొనే తెలుగు యాంకీ - సురేష్ కాజా , మల్లవరపు అనంత్, రాయవరం భాస్కర్, జువ్వాది రమణ, మద్దుకూరి చంద్రహాస్, నసీం షేక్, చంద్ర కన్నెగంటి, ఊరిమిండి నరసింహారెడ్డి మొదలగు వారితో కబుర్లు. ఇందులో భాస్కర్ గారు "నీతి పద్యాలు - సమకాలీన విశ్లేషణ"   అంటూ ఇప్పటి సమాజానికి అప్పటి సుమతీ శతకం, వేమన చెప్పినవి ఎలా సార్వజనీన సత్యాలుగా మిగిలిపోయాయో సోదాహారణంగా వివరించారు.  ఇక మద్దుకూరి చంద్రహాస్ గారు పవర్ పాయింట్ ద్వారా 'కవితా సాక్షాత్కారం' కావించారు. మల్లవరపు అనంత్ "తెలుగు నుడికారం"   పై   చేసిన ప్రసంగం ఆద్యంతము ఆసక్తిగా నడిచింది.  విప్లవకారుడు నసీం "  తెలుగు సాహిత్యం పై మార్క్సిజం ప్రభావం"   ప్రభావంతంగా సాగినా అందరి ప్రసంగాలు సమయాభావం వల్ల కుదించాల్సి రావడం కొంచెం అసహనాన్ని కలిగించింది.
అలాగే సమయాభావం వల్ల జరగాల్సిన కొన్ని చర్చలు..ముఖ్యంగా " పిల్లలలో పఠనాసక్తి పెంపొందించడం ఎలా?" అనే ఆసక్తికరమైన చర్చ పూర్తిగా సాగలేదు. ప్రేక్షకులలో చాలా మంది స్వీయరచనా పఠన మీద ఉన్న ఆసక్తి, సభాముఖంగా నాలుగు మాటలు చెప్పుకోవాలన్న దుగ్ధ సమయాన్ని మింగేసాయి. అందులో నేనూ భాగస్వామ్యున్నే. ఖచ్చితంగా సమయాన్ని పాటించింది తన కవితను వినిపించిన మితృడు 'కిరణ్ చక్రవర్తుల' మాత్రమే.తెలుగు బ్లాగుల గురించి ఎవరేనా మాట్లాడుతారేమోనని చూసిన నాకు ఎవరూ లేకపోతే సాయి రాచకొండ గారిని అభ్యర్థించి ఓ నాలుగు ముక్కలు నేనూ మాట్లాడాను.


నేను అనుకొన్న 'తెలుగు సాహిత్యంలో తెలుగు బ్లాగుల పాత్ర' అనే విషయం సంగ్రహంగా :

తొలి తెలుగు బ్లాగు 'ఒరెమూనా' చావా కిరణ్...కినిగె ద్వారా తెలుగు పుస్తకాల విక్రయం కొరకు జరుగుతున్న కృషి, 'కొత్తపాళీ' తో మొదలుకొని ఎందరో తెలుగు కథా రచయితలు తమ తమ కథలను బ్లాగు ద్వారా పరిచయం చేస్తూ, కొందరు బ్లాగు ద్వారా రాసిన కథలు (ఉ. 'తెలుగోడు' ) ఎంత ప్రసిధ్ది పొందింది చెబుతూ, ఇక 'తూర్పు-పడమర' బ్లాగు ద్వారా కల్పన రెంటాల గారు రాసిన 'తన్హాయి' నవల ఎంతో ప్రజాదరణ పొంది ఆంధ్రదేశంలో ఇక్కడా ఎన్నో చర్చలకు ఎలా కారణభూతమయ్యిందీ వివరిస్తూ, ఇంకా ఆ కథ ఓ సినిమా రూపం తీసుకొంటోందనీ చెప్పాను. అలాగే 'పర్ణశాల' కత్తిమహేష్ తిలక్ కథను 'ఎడారి వర్షం' లా తీసిన విధానం, చలం 'పురూరవ'కు చిత్రరూపం కల్పించి వీటి రూపంలో ప్రస్తుత యువతకు తెలుగు సాహిత్యాన్ని ఇలా కూడా పరిచయం చేయవచ్చు అని నిరూపించాలని కొందరు పడుతున్న తపన తెలియజెప్పాను. అలాగే కృష్ణశాస్త్రి స్త్రీగా పుట్టాడా అని అబ్బురపరిచే కవితలతో సాగే స్వాతికుమారి బ్లాగు 'కల్హార',  సమకాలీన రాజకీయాలపై విశ్లేషించే తుమ్మల శిరీష్ కుమార్ 'చదువరి', కడప మాండళీకంతో చక్కెర గుళికల్లాంటి పదాలతో సాగిన ఒక్కప్పటి హ్యుస్టన్ వాస్తవ్యుడు రానారె 'మనిషి' ప్రస్థానం, మాగంటి వారి 'జానతెనుగుసొగసులు' వారి మాగంటి.ఆర్గ్ సాహిత్య భాండాగారం, 'పద్మ' సృష్టికర్త వెన్న నాగార్జున, వీవెన్ 'లేఖిని', అశ్విన్ బూదరాజు 'ఇపలక' ను ఉపయోగించి కంప్యూటర్లో తెలుగెలా రాయొచ్చో చెబుతూ, తెలుగు బ్లాగులు రాయాలంటే రహ్మాన్, సుజాతగార్ల 'బ్లాగు పుస్తకం' గురించి చెప్పకుండానే వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలనుకొన్న సౌమ్య, పూర్ణిమల 'పుస్తకం', వెంకట్ సిద్ధారెడ్ది  'నవతరంగం' ఇవన్నీ బ్లాగు ప్రాతిపదిక మీదే వచ్చాయని చెప్పాల్సింది.
చివరగా శ్రీమతి డి.కామేశ్వరి మరియు శ్రీ అక్కిరాజు రమాపతిరావు గార్లను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. హ్యూస్టను సాహితీ సమితి వారు వంగూరి చిట్టెన్ రాజు గారిని వారి విక్టోరియా మహారాణిగారితో సహా సన్మానించారు. ఏదేమైనా తెలుగు బ్లాగుల ద్వారా నవతరం చేస్తున్న సాహితీసేవను ఈ వేదిక ద్వారా తెలియపరిచే అవకాశాన్ని ఇచ్చిన సాయి రాచకొండ గారికి, వంగూరి చిట్టెన్ రాజుగారికి సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పడం మరచిపోయాను ఇప్పుడు బ్లాగుముఖంగా చెప్తున్నాను. ఈ సభను ఇంత దిగ్విజయంగా జరిపిన శారద ఆకునూరి, రాం చెరువు, సాయి రాచకొండ, సుధేష్ పిల్లుట్ల, హేమనళిని, కృష్ణకీర్తి మున్నగు వారికి అభినందనలు తెలుపుతూ ఇంతటితో నా నివేదికకు ముగింపు పలుకుతున్నాను.
( సూ. గుర్తున్నంత వరకూ పేర్లు ప్రస్తావించాను, మరచిపోతే మన్నించండి.)

13 comments:

Sudesh said...

Ismail garu, చక్కటి సామీక్ష - చాల బాగా వ్రాసారు. మిమ్మల్ని కలవడం చాల బాగుంది. అన్ని ప్రసంగాలను మెల్లి గా YouTube లోకి ఎక్కిస్తున్నాను ఇంకొక రెండు మూడు రోజులలో పూర్తి చేస్తాను.

జ్యోతి said...

ఇస్మాయిల్ భాయ్. భళాభళి...

Sudesh said...

This is our YouTube Channel

http://www.youtube.com/houstonsahitilokam

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

సంతోషకరమైన విషయాలు. చాలా రోజుల తరువాత మీరు మళ్ళీ బ్లాగింగు చేస్తున్నారు. ఇది ఇంక ఎక్కువ సంతోషకరం.

వీవెన్ said...

డాట్రు గారూ, నివేదికను పంచుకున్నందుకు నెనరులు. తరచూ బ్లాగుతూండండి.

Unknown said...

మీరింకా కొన్ని పేర్లు రాయడం మర్చిపోయినట్టున్నారు గానీ అందరమూ అలా కలుసుకోవడం బాగుంది. హ్యూస్టన్ తెలుగు సంఘం వాళ్ళ అతిథిమర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఈ శనివారం డల్లాస్ రండి వీలయితే.
ఒక పొరబాటు: వేల్చూరి కాదు, వెల్చేరు.

Kathi Mahesh Kumar said...

:) :) :) :) :)

Dr.Pen said...

-నచ్చినందుకు అందరికీ నా నెనర్లు.
-'వెల్చేరు' ఓ టైపాటు...అంటే నా టైపింగులో పొరపాటు...క్షంతవ్యుణ్ణి...సరి చేశాను.
-ఈ శనివారం న్యూఆర్లీన్స్ లో కొత్తపాళీ గారితో భేటీ..డలాస్ రాలేకపోతున్నాను..మన్నించాలి.

మరువం ఉష said...

చాలా సంతోషం మీ బ్లాగు లో కదలిక వచ్చినందుకు. మొన్నీమధ్యనే "ఏమైయ్యారు వీళ్ళంతా?" అని తలుచుకున్న వారిలో మీరొకరు. ఈ ఏడాది వసంతం ముందే వచ్చినట్లుగా, ఉగాదికి మునుపే సాహితీ సదస్సు వార్తల మీ నివేదికాను. అందరి మాటే నాదీను.

cbrao said...

నివేదిక ఆసక్తికరంగా ఉంది.

cbrao said...
This comment has been removed by a blog administrator.
bhuvanachandra said...

ippude chadivaanu.....chaalaa baagaa raasaaru...god bless you....bhuvanachandra

bhuvanachandra said...

ippude chadivaanu.....chaalaa baagaa raasaaru...god bless you....bhuvanachandra