"కళామతల్లి"

"ఉత్తమ సాహితీ సుగంధాలు గుబాళించే అజరామర సినీ గీతాలను తెలుగు కళామతల్లి చరణ సుమాలుగా అర్పించి అర్చిస్తున్నసారస్వత మూర్తి నవనవోన్మేష విశిష్ట రచనా స్ఫూర్తి వేటూరి కలం నుండి పల్లవించిన ఎందఱో సినీ మహనీయుల ప్రస్తుతి వ్యాసాలే ఈ కొమ్మ కొమ్మకో సన్నాయీ." అంటూ తెలుగు వికిపీడియాలో రాసారు. అది చూశాక అప్పుడెప్పుడో ఈ 'కళామతల్లి' గురించి వేటూరి గారు వాపోయిన సంగతి గుర్తుకు వచ్చింది.


మన తెలుగు సినీ ప్రముఖులు మాట్లాడే మొదటి మూడు వాక్యాల్లో, తెలుగు 'కళామతల్లి' ముద్దుబిడ్డలం ఉండడం తప్పనిసరి, ఆఖరికి భాష మీద పట్టు ఉన్న బాలకృష్ణతో సహా!  ఇక మన వార్తాపత్రికల వారూ, ఘనత వహించిన తెలుగు ఛానెల్సూ, వాటి" లంగర్లూ" విరివిగా వాడే మాట ఈ 'కళామతల్లి'. వీరి అన్వయం అంతా 'తల్లి' మీదనే. ఆఖరికి ఇది సినీ కళామతల్లి, రాజకీయ కళామతల్లి, తెలంగాణా కళామతల్లి అంటూ కళామతల్లి విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఓ సారి నొక్కండి.


అసలు 'కళామతల్లి' అంటే ఏమిటి? మతల్లి అంటే శ్రేష్ఠమైన లేద గొప్ప అని అర్థం. కళామతల్లి, అంటే అన్ని కళల్లో శ్రేష్ఠమైనదని అర్థం, అంతే కాని ఆమె ఓ 'తల్లి' కాదు నాయనలారా... అని వేటూరిగారే స్వయంగా అరచి గీపెట్టినా, వినే నాథుడు లేకుండాపోయాడు. అందుకే మనం తెలుగు పాఠాలపై కాస్త శ్రద్ధ వహించాలని మనవి. ఇంతకూ ఆ వేటూరి గారి వ్యాసం దొరకలేదు కానీ, ఈ 'మతల్లి' గురించి నాకు ప్రాణప్రదమైన ఆముక్తమాల్యదలోని ఈ పద్యంలో ఉంది. చూ. వీచిమతల్లి = గొప్ప అల.


అంత కంటే గొప్పగా  ఆ పద్యాన్ని, పనసతొనలు ఒలిచి నోటికిచ్చిన చందంగా విడమరచి చెప్పిన  భైరవభట్ల వారి అద్భుతమైన వ్యాఖ్యానం చదివితే  ఇంకా బాగా అర్థమవుతుంది. చూ."కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి కడుపార నెవ్వాని కన్నతల్లి" - స్థూలంగా చూస్తే, "పాలసముద్రమునుంచి పుట్టినవాడు ఎవడో అతడు" అని అర్థం, అంతే! ఇందులో కవిత్వమేముంది? అని పెదవి విరిచేస్తే ఏమీ లేదు! ... సీస పద్యం ఒకో పాదంలోనూ చంద్రుని ఒకో గొప్పతనాన్ని వర్ణించాడు. చంద్రుని వంశోన్నతిని చాటుతున్నది మొదటిపాదం. అయితే ఇందులో మంచి చమత్కారాన్ని చేశాడు పెద్దన. చంద్రుడు ఫలానా పాలసముద్రపు కొడుకు అని అన్నాడా? లేదు! కలశపాథోరాశి అంటే పాలసముద్రం. ఆ పాలసముద్రం మధ్యలోనున్న, "వీచి మతల్లి". మతల్లి అంటే శ్రేష్ఠమైన లేద గొప్ప అని అర్థం. వీచి అంటే అల. వీచిమతల్లి అంటే ఒక గొప్ప/పెద్ద అల..."  కాబట్టి ఇకనైనా 'తల్లి' అనే అర్థంలో కాకుండా నిజమైన అర్థం తెలుసుకొని మాట్లాడితే, ఆ పాటల మాంత్రికుని మాటలకు అర్థం చేకూర్చినవారవుతాం.


అది అలా ఉంచితే ఈ 'తెలుగు పద్యాల'ను, 'తెలుగు పాఠాల'ను మరచిపోకుండా చదివితే, అదే మన తెలుగు కళామ'తల్లి'కి మనం చేసే నిజమైన సేవ! :-*

4 comments:

Kathi Mahesh Kumar said...

నిజమా...నేనూ కళ+తల్లి అనే అనుకుంటున్నానే!

Bapiraju Nandury said...

నిజంగా తెలియని విషయం ఒకటి తెలుసుకున్నాను. ధన్యవాదములు.

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

లంగరు=యాంకరు సూపరో సూపరు.
మంచి విషయం గుర్తుచేశారు.ఐనా "అది ఏదైతే ఉందో దాన్ని..."అనే రాజకీయ నాయకులు తెగులు మాట్లాడితే పర్వాలేదు గానీ మరీ తెలుగుపై అభిమానం ఉన్న వాళ్లు కూడా "కళామతల్లి ముద్దుబిడ్డలం" అంటున్నారు.
సంతోష్ సూరంపూడి

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...
This comment has been removed by a blog administrator.