అఫ్సర్, కల్పన, రానారెలతో ఓ సాయంత్రం!

'దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు'...ఇదిగో ఇప్పుడు కుదిరింది. ఆ మధ్యన (అనగా దాదాపు ఓ నెల క్రిందట) మా బామ్మర్ది డెట్రాయిటు నుండి రావడం, వాడు హ్యూస్టను నగర విహారం చేయాలని సరదాపడడం, సతీ-పుత్ర-పుత్రికా సమేతంగా మేము బయలుదేరడం వరకూ అంతా సవ్యంగానే జరిగింది. కానీ పోయిన మొదటిరోజే మా ఘనత వహించిన 'డాడ్జ్-గ్రాండ్-కారవాను' మమ్మల్ని నడిరోడ్డులో నిలువునా ముంచడం, మా వాడి 'నాసా' ఆశల మీద నీళ్లు చల్లడం అన్నీ ఓ పద్ధతి ప్రకారం పై వాడు జరిపించాడు.
సరే ఇక చేసేదేముంది అని కారవానుని పెప్-బాయ్స్ కు అప్పజెప్పి, మారువేషంలో కాకున్నా రాత్రి పూట నగరవిహారం అయ్యిందనిపించాం. ఇక మరునాడు ఓ అద్దెకారులో చచ్చీచెడీ మా ఊరు వచ్చి పడ్డాం. కాకపోతే మరుసటి రోజే కారవాను ఇక ఆగకుండా దౌడు తీయగలదు అని పె.బా. వాళ్లు భరోసా ఇచ్చాక మళ్లీ మరోసారి హ్యూస్టను దారిపట్టాను. వాడికి ఓ వెయ్యి వరహాలు సమర్పించుకొని, ఇక ఓ హోండా 'పైలటు'ను అవ్వొచ్చన్న నా ఆశలు అడియాసలు కాగా ఊసూరుమంటూ మళ్లీ మా ఇంటి దారి పట్టాను.

ఈ వ్యవహారమంతా ఓ వైపు జరుగుతూండగా ఆస్టిన్ నుంచీ 'అఫ్సర్-కల్పన' ద్వయం,  అఫ్సర్ గారి చిరకాలమిత్ర దర్శనం కోసం హ్యూస్టను వేంచేస్తున్నారని వేగు అందింది. మొదటిసారి వెళ్లినప్పుడు యథాప్రకారం రామనాథుడికి 'కాల్చేయడం'(చూ.కొత్తపాళీ), వారితో పాటు 'లీడర్' చిత్రరాజాన్ని చూసి, ఆ ఇద్దరు ముద్దుగుమ్మల అందాన్ని ఆస్వాదించడం అయ్యింది.

ఇక మళ్లీ మొదటికొస్తే..మా అమ్మ ఊరికి బయలుదేరింది. హ్యూస్టనులో విమానం, కాబట్టి మళ్లీ ప్రయాణం! అలా ముచ్చటగా మూడోసారి ఓ వారం రోజుల వ్యవధిలోనే 'విశ్వనగరాన్ని' సందర్శించే అవకాశం, సరిగ్గా అదే సమయంలో అఫ్సర్ గారి కుటుంబం అక్కడే ఉండడం తటస్థించింది. సరే అమ్మను విమానమెక్కించాక భారమైన హృదయంతో 'రానారె' ఇంటి వైపు పయనమయ్యాను. ఆ సమయానికి అయ్యవారు ఓ సంగీత సభలో తన గానంతో శ్రోతలను రంజింపచేయవలసి ఉంది. కానీ ఈ సారి పైవాడు కరుణించి ఆయన దారికి అడ్డంకులు సృష్టించి నా కోసం తన సమయాన్ని కేటాయించాడు.అఫ్సర్ గారికి ఈ విషయం తెలియజేసి, ఒంటరి పక్షి అయిన రానారె ఇంటనే మా 'ముషాయిరా'కు ముహూర్తం పెట్టాం. అలా ఈ సాయంత్రం మొదలయ్యింది. ( అమ్మయ్య! ఉపోద్ఘాతం ముగిసింది.)

మొదట ముఖపరిచయాలు అయ్యాక, తీరిగ్గా కబుర్లలో పడ్డాం. అఫ్సర్ గారు మా అనంతపురంలో 'ఆంధ్రభూమి'లో పనిచేసారని తెలిసింది. మా అనంతపురం బాషనీ, పల్లెప్రజల ఆప్యాయతల్ని పొగుడుతూ ఉంటే ఎక్కడో కాస్త గర్వంగా అనిపించింది. ఇక రెంటాల కల్పన గారినీ ఇదే మొదటిసారి చూడడం. ఆమె గురించి ఎన్నో యేళ్ల క్రితమే చదివాను, అలాగే అఫ్సర్ గారి సాహిత్య పేజీల్నీ మరమరాల్లాగ నమిలేసిన గుర్తులు ఉన్నాయి. అలాంటి వారిని కళ్లెదుట చూడడం నిజంగా అబ్బురమే!
ఇది నా వైపైతే, అటు అఫ్సర్ గారు, కల్పన గారు 'రానారె' అంటే ఎవరో తల నెఱిసిపోయిన పెద్దాయన అనుకొని, ఎదుట నిలుచున్న నవయవ్వన యువకుణ్ని చూసి నోరెళ్లబెట్టారు. కడప మాండలికానికి మరో 'నామినీ' అని కితాబులిచ్చారు. అలా మొదలయ్యిన మాటలు ఇక కోటలు దాటాయి. తెలుగు కవిత్వంలో పోకడలు, మతం-కులం, స్థానిక చరిత్ర, తెలుగు కవయిత్రులు, రాష్ట్ర రాజకీయాల నుంచీ ప్రపంచ రాజకీయాల దాకా...అబ్బో చాలా, చాలా మాట్లాడేసుకొన్నాం. అఫ్సర్ గారు 'గూగూడు కుళ్లాయప్ప' గురించి చేస్తూన్న పరిశోధన నాకు చాలా ఆసక్తి కలిగించింది. ఎందుకంటే మతసామరస్యానికి పేరెన్నికగన్న అనంతపురంలోని 'గూగూడు'  గ్రామంతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం, అంతే కాక మా అమ్మమ్మ పేరు 'కుళ్లాయమ్మ' కావడం, మా జేజినాయన పేరు 'కుళ్లాయప్ప' కావడం ఈ పరిశోధనపై అనురక్తిని కలిగించింది.
ఇక్కడ ఓ విచిత్రం జరిగింది. అఫ్సర్ గారేమో తెలంగాణా 'ధూం-ధాం!" అంటున్నారు, రానారె 'విశాలాంధ్ర' నినాదమిచ్చాడు, నేనేమో 'రాయలతెలంగాణా' మంచి ఆలోచన అంటూ...మధ్యలో కల్పన గారే ఏమీ మాట్లాడలేదు. అఫ్సర్ గారిది నల్లొండ అయితే, కల్పన గారిది బెజవాడ. అలాగే మా ఇంట్లోనూ సీమ-కోస్తానే! రానారెనే సీమ కట్టుబాటు దాటకుండా చిత్తూరు అమ్మాయిని కట్టుకోవాలనుకొంటున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహం కాస్తా ఎడబాటు వల్ల ప్రేమ వివాహం అయ్యి కూర్చొంది. అయ్యవారేమో విరహగీతాలు పాడేసుకొంటున్నాడు. అందుకే తన బ్లాగులో విరివిగా టపాలు రావడం లేదని అప్పుడు అర్థమయ్యింది.
సరే, అతిథులకు 'రానారె' సంగీతాభిరుచిని పరిచయం చేద్దామని, చెప్పడమే తడవు, మన వీరబల్లె వీరుడు గొంతెత్తి "సిరిమల్లె పువ్వా..." అంటూ పాట ప్రారంభించడంతో అందరూ ఒళ్లంతా చెవులు చేసుకొని మరీ విన్నాం. ఓ పాట తర్వాత మరో పాట అలా ఆ సాయంత్రం పాటలా సాగిపోయింది. పూటకూళ్ల వారింటి నుంచీ తెచ్చిన భక్ష్యాలతో భోజనం కావించి కవి-జంట ఇంటికి బయలుదేరారు. ఆ రాత్రికి ఉండిపోండి అంటే పిల్లవాణ్ని మితృని ఇంటిలో వదిలి వచ్చినందున పోకతప్పలేదు. పోతూ పోతూ మా ఇద్దరికి ఆఫ్సర్ గారి "ఊరి చివర", కల్పన రెంటాల గారి "నేను కనిపించే పదం" కవితా సంకలనాల్ని ఈ కలయికకు తీపిగుర్తుగా బహూకరించారు. వాటి గురించి నా సమీక్ష త్వరలో...
 నాకు "స్మైల్"దేవరాయల వారికి కాస్త ప్రాంతీయాభిమానంతో అని అఫ్సర్ గారు, "రాయల"ఇస్మాయిల్ కు సాహిత్యాభినందనలతో అని కల్పన గారు పుస్తకంపై వారి స్వదస్తూరీతో రాసి, సంతకం చేసి మరీ ఇచ్చారు. అదో తబ్బిబ్బు! ఇవన్నీ రానారెకు రాసిన మూడే మూడు మాటల ముందు తేలిపోయాయి..."సీమ మాట పొగరు" రానారెకు అని రాసుందందులో. నీకు మున్ముందు ఎన్ని బిరుదులొచ్చినా ఈ ఒక్క మాట చాలు ,కోహినూరు వజ్రంలా చిరస్థాయిగా నిలిచిపోతుంది అని రానారెతో అన్నాను. ఎంత చక్కటి మాట, ఎంత రోషమున్న మాట, ఎంత సరైన మాట...రానారెకు  ఇది అతికినట్టు సరిపోతుంది. అలా కవిత్రయంతో ఆ సాయంత్రం అలా ముగిసింది.
కొసమెఱుపు: అలా వారు వెళ్లిపోయాక, ఒంటరి గాళ్లయిన మేమిద్దరం ఈ సారి మార్గరీటాతో కాకుండా, ఓ మధువనితో సర్దుకొందాం అనుకొన్నాం. కానీ పెళ్లి కాకుండానే 'పెళ్లాం-మెగుడ'యిన రానారె తనకు ఆ అనుమతి లేదని మనవి చేసుకొంటే నేనొక్కడినే ఓ అరపాత్ర ఎఱ్ఱటి మధువుని గ్రోలుతూ, రానారె విరహగీతాల్ని ఆస్వాదిస్తూంటే మా 'న్యామద్దల' గ్రామం నుంచీ కాలొచ్చింది. అది ఎవరో కాదు సకలకళావల్లభుడయిన మా బావ 'ఖలీల్' నుంచి. ఆయన పాటల్లో 'రానారె' కంటే రెండాకులు ఎక్కవే నమిలాడు. ఇక దూరవాణిలో ఇద్దరి జుగల్-బందీ మొదలయ్యింది.
ఒకరికి మించి ఒకరు మధురాతిమధురంగా పాటలు పాడుతూంటే నా మనస్సు ఎక్కడికో తేలిపోయింది. చివరికి 'రానారె' కూడా మా బావ పాటలకు తాదాత్మ్యం చెంది సంగీతసాగరంలో మునిగి తేలాడు. కానీ ఖలీల్ పాడిన చివరి పాట నా గుండెను చెఱువు చేసింది, అప్పటికే ఉన్న కాస్త నిషా కాస్తా ఆ పాటతో తలకెక్కేసింది. ఆ కొన్ని క్షణాలు నేనెంత ఆనందం అనుభవించానో చెప్పనలవి కాదు. ఆ పాట మీరూ నినండి...

1 comment:

Winner said...

ఏదో వెతుకుతూ ఇక్కడకొచ్చి...

కాస్త మధువు తోడుగా, మనసున్న వారితో, మధురమైన క్షణాలు...

అన్నట్టు చివరిపాట ఒక్కటి చాలు, అదెంత మధురమో చెప్పడానికి

ప్రసాదం