నా 'అవతారం'



అమ్మయ్య! ఓ పరీక్ష ముగిసింది, ఒకటి కాదు రెండు రోజులు- రోజుకి ఎనిమిది గంటల పాటు జరిగే ఈ బృహత్కార్యానికి మంగళం పాడేశాను. ఇది దాటందే పట్టా చేతికి రాదు. మొత్తానికి సంతృప్తికరంగా పూర్తి చేశాను. పరీక్ష పూర్తయిన మరుక్షణం చేసిన మొదటి పని 'అవతార్' టిక్కెట్లు జాలంలో పట్టడం.

మొత్తానికి ఐమాక్స్ కుదరకపోయినా '3డి' లోనే చూడడం జరిగింది. సినిమా పై భారీ అంచనాలతో వెళితే ఒక్కోసారి నిరాశే ఎదురవుతుంది. కానీ నిజంగా ఈ సినిమా ఓ అద్భుతసృష్టి. అన్నిటికన్నా ఈ చిత్రంలో నాకు నచ్చింది ఆ చెట్లూ , పుట్టలూ! మరీ ముఖ్యంగా నావీ వారి నివాసమైన 'కెలూట్రాల్'.

సినిమా కథ అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది. నవతరంగంలో బోల్డన్ని రివ్యూలు. కానీ మానవ జన్యువుని, నావీ ట్రాన్స్'క్రిప్టేస్ తో సృష్టించిన 'అవతార్', నిజజీవితపు నాడీవ్యవస్థతో అనుసంధానించబడి, మన మెదడు నియంత్రణలో పని చేయడమనే భావన ఈ చిత్రానికి ఆయువుపట్టు.

చందమామ కథలు నచ్చే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందనే భావిస్తాను. అసలు మన భారతీయ ఇతిహాసాల్లో నుంచి స్ఫూర్తి పొందిన విశేషాలు ఎన్నో- సినిమా పేరు దగ్గర నుంచీ, ఆ నీలి రంగు మన నీలిమేఘశ్యాముడిదేగా. ఇక నావీలూ, వారి తోకలూ, ఆ అరణ్యమూ చూస్తూంటే మన వానర సైన్యం, దండకారణ్యం గుర్తుకు రావూ. ఏది ఏమైనా సృష్టికి ప్రతిసృష్టి చేసిన ఆ సాంకేతికతకు నా జోహార్లు.

ఇక అమెరికా పరంగా ఈ చిత్రంలో లెక్కలేనన్ని 'connotations'. ఆరోగ్యభీమా, ఆక్రమణ యుద్ధాలు, సామ్రాజ్యవాదం, ఇంధన సంక్షోభం, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఒక్కోచోట సంభాషణలు చురుక్కుమంటాయి. అయినా జేమ్స్ కెమరూన్ ఇవన్నీ తన ధృక్పథంలో ఉన్నవేననీ ఘంటాపథంగా చెప్తున్నాడు.

వయస్సొచ్చాక నేను చూసిన మొదటి హాలీవుడ్ సినిమా 'ది ఆబిస్'. సినిమా చూశాక ఆ విభ్రాంతి నుంచి తేరుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఆలాంటి అనుభవాన్నే మిగిల్చింది ఈ చిత్రం. కానీ ఆ విభ్రాంతికీ ఈ విభ్రాంతికీ పొంతన లేదనుకోండి. తెలిసీ తెలియనప్పుడు కలిగే అబ్బురం కన్నా, కాస్త జ్ఞానం వచ్చాక పొందే అనుభవం తప్పకుండా తక్కువే అవుతుంది. చివరికి చెప్పొచ్చేదేమంటే ఈ సినిమా తప్పకుండా చూడండి అని.