'హ్యూస్టన్' నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

జనవరి 1, 2009. కొత్త సంవత్సరపు తొలి క్షణాలు... తేట తెలుగు పాటలను, అదీ మన 'రానారె' నోట వింటూ మొదలెట్టాను. ఎన్నాళ్లగానో అనుకొన్న ప్రయాణం 2008, డిసెంబరు 31న కుదిరింది. 31 రాత్రి 'కింగ్' సినిమా థియేటర్లో కలవాలనుకొన్నప్పటికీ, మన 'కాదరయ్య' మిత్రబృందంతో కలసి వనవిహారం చేస్తూండడం వల్ల, సినిమా అయ్యాక కలిసాం. ఇక 'కింగ్' బాగానే వినోదపరచింది, బోలెడు నవ్వుల్ని పంచింది.

ఆ తరువాత మావాళ్లని ఓ హోటల్లో దించేసి, పన్నెండింటికి అందరూ ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకొని, అటుపై మేమిద్దరం రానారె ఇంటికి బయలుదేరాం. అలా కొత్త సంవత్సరపు తొలి క్షణాలు హ్యూస్టన్ నగర వీధుల్లో, రంగు రంగుల టపాసుల పేలుళ్ల మధ్య, రానారె 'రథ'సారథ్యంలో నడిచాయి. ఇక ఇంటికెళ్లాక, న్యూఇయర్ రోజు 'మార్గరీటా'ను పలకరించకపోతే బావోదని అడ్రసు తెలుసుకొని మరీ వెళ్లి ఓసారి(ఒక్కసారే) పలకరించి వచ్చాం.

అప్పటికే అలసిపోయిన కథానాయకునికి 'రీటా' పరిచయం తరువాత కొంచెం హుషారొచ్చింది. సన్నగా కూనిరాగాలు మొదలయ్యాయి, ఆ రాగాలాపన కోసమే ఇంత దూరం వచ్చిన నేను మహా సంతోషపడి దరువెయ్యడం మొదలుపెట్టాను. 'కాదరయ్య పాట'ను కాదరయ్య నోటనే వినడం నేను చేసుకొన్న అదృష్టం కాదా? అటుపై నాకత్యంత ప్రియమైన పాట 'ఏ దివిలో విరిసిన పారిజాతమో' ఆ గొంతులో అలా జాలువారుతూంటే మైమరచిపోయి విన్నాను. ఇంకా ఎన్నో మధురమైన పాటలతో, అలా ఆ రాత్రిని ఏకవీరలో ఎన్టీయారు, కాంతారావుల 'వసంత రాత్రి'లా మార్చేశాం:-)

మళ్లీ ఉదయం తిరిగి హోటలుకు బయలుదేరిన మాకు ఈ కింది దృశ్యం కనిపించి అబ్బురపరచింది. దూరంగా ఆ వెండి మబ్బులు, సునామీ కెరటం నగరం మీద పడబోతోందా అనే భ్రాంతిని కలిగించాయి. అలాగే తన కారులో బాలసుబ్రహ్మణ్యం పాతపాటలు వింటూ, 'కడప కేంద్రం' నుంచి చిత్రసీమ ఫిలిం గీతాలు విన్నంత అనుభూతిని పొందాం.
'కొత్త సంవత్సరపు స్వాగత కిరణాలు'

కారులోనూ కొన్ని పాటలకు గొంతు కలిపి ఆనందించాం. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని నా ఐఫోనులో ఆ క్షణాలను బంధించినా, నేనూ కాస్త గొంతు కలపడం వల్ల, కొత్త సంవత్సరం మీకు తలనొప్పి తెప్పించే ప్రమాదం ఉందని ఇక్కడ పెట్టడం లేదు. 'సిరిమల్లె నీవె...విరిజల్లు కావె" అంటూ ఇద్దరూ గొంతు కలిపి పట్టపగలే 'వెన్నెల'ను తాగినంత పని చేశాం. ఆ తరువాత నన్ను హోటల్ దగ్గర దించేసి, తన మిత్రులతో కలవాలని మా అందరికి వీడ్కోలు చెప్పి వెళ్లిపోయాడు.

ఇంకో విశేషం అప్పుడెప్పుడో 'రానారె పెళ్లి' అని మిమ్మల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించాను, ఇప్పుడు ఇనుకోండి రానారె పప్పన్నం పెట్టే రోజు నిజంగానే వచ్చేసింది, పెళ్లీడు కొచ్చిన అమ్మాయిలూ...మీ ఛాన్స్ మిస్సయ్యింది. అప్పుడప్పుడూ దూరవాణిలో కాబోయే శ్రీమతితో ముచ్చట్లలో మునిగాడు కూడా, అయినా పెద్దలు నుడివినట్లు 'భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ!' అంటూ నేనూ ఓ పాట పాడి కాస్త భయపెట్టాను. ఏమాటకామాటే చెప్పుకోవాలి కుర్రాడు చాలా బుద్ధిమంతుడు అని మా శ్రీమతి దగ్గర మాంఛి సర్టిఫికెటొకటి కొట్టేసాడు:-)

ఆ తరువాత మేము హ్యూస్టన్లోని 'మీనాక్షి' ఆలయానికి వెళ్లాం. అక్కడ ఎంతో మనోహరంగా అలంకరించిన దృశ్యాలను చూసి తరించి, ఆరుబయలు గుడారాల్లో పెట్టిన పూటకూళ్ల వారి దగ్గర ఇడ్లీ-వడ, పూరీ, దోశె వగైరాలని కడుపారా ఆరగించాం. పక్కనే ఉన్న గ్రంథాలయంలో వెల్చేరు గారి 'క్లాసికల్ తెలుగు పొయెట్రీ' ఆంగ్ల పుస్తకాన్ని, తెలుగు పాటల విజ్ఞానఖని 'వి.ఎ.కె. రంగారావు'గారి 'ఆలాపన'ని కొని సంబరపడ్డాను. అలాగే కొన్ని మంచి శాస్త్రీయ సంగీతం సిడిలు కూడా.

రెండో ప్రపంచ యుద్ధనౌక పై 'డాడీ'

ఆ తరువాత ఎన్నాళ్లగానో చూడాలనుకొంటున్న 'నాసా' కేంద్రాన్ని దర్శించాము. అంతరిక్ష శాస్త్రమెప్పుడూ నన్ను అబ్బురపరస్తూ ఉంటుంది. అక్కడ చూసిన చిత్రాలు, విశేషాలు సంభ్రమాశ్చర్యాలను కలిగించాయి. చంద్రుని పై మనిషి అడుగులను, అందుకు ఆలంబనగా నిలిచిన 'మిషన్ కంట్రోల్' గదిని చూసి అచ్చెరవొందాను. మానవుడు సాధించిన ప్రగతికి, శాస్త్రవిజ్ఞానానికి సాక్ష్యంగా నిలిచింది 'మూన్ ల్యాండింగ్'.
చందమామ నుంచి తెచ్చిన 'చంద్రశిల'ను తాకగానే ఏదో తెలియని అనుభూతి . మనమూ ఆ చంద్రునిపై నిలబడినట్లు ఒక్కసారి ఊహించుకొంటే, ఈ సృష్టిలో మన స్థానమేమిటో ఎరికలో వచ్చి మన మధ్య జరిగే యుద్ధాలు, కక్షలూ, కార్పణ్యాలు అన్నీ మటుమాయమవుతాయి. ఒకప్పుడు పైలట్ కావాలని కలలు కన్న నేను, మా 'సుహాస్'ని అంతరిక్ష యాత్రికుణ్ణి చేయాలని మనస్సులో అనుకొన్నాను (వాడికిష్టం ఉంటేనే లెండి!).
చంద'మామ' వాళ్లింటి కెళ్లడానికి సిద్ధమవుతున్న 'అల్లుడు':-)
ఇక రాత్రికి 'మొఘల్' రెస్టారెంటులో విందారగించి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. అలా కొత్త సంవత్సరపు తొలి రోజు స్నేహ-సాహిత్య-సాంస్కృతిక-శాస్త్ర విజ్ఞానాల వేదికగా నిలిచింది. అయితే గడచిన సంవత్సరం నాకు వ్యక్తిగతంగా ఎన్నో శుభాలను చేకూర్చింది. అలాగే ఈ కొత్త సంవత్సరం భూమిపై నివసించే అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ మీకందరికీ "నూతన సంవత్సర శుభాకాంక్షలు". సెలవా మఱి!

' రానారె 'తో 'రాయలు'
"లోకా సమస్తా సుఖినోభవంతు! సర్వేజనా సుఖినో భవంతు !!

6 comments:

cbrao said...

రానారే ని నాకంటే ముందర కలిసే chance మీరే కొట్టేశారే! నూతన సంవత్సర శుభాకాంషలు.

జ్యోతి said...

సంతోషం.. ఐతే రాముడికి సీత దొరికిందన్నమాట..మన రామయ్య పెళ్లికొడుకాయెనే. మీ పాటలతో మా మనసు అలా అలా మధురస్మృతులలో తేలిపోయింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాము ఇప్పుడే తక్కువ రాస్తున్నాడు. ఇక అంతే సంగతి. గోవిందా!!!!

సిరిసిరిమువ్వ said...

"రానారెతో రాయలు" పాట కచేరీ బాగుంది. శుభవార్త అందించారు డాక్టరు గారు.

teresa said...

cool!

రానారె said...

రాయలవారూ, మీ ప్రకటన విని జ్యోతిగారు అప్పుడే గోవిందనామస్మరణ చేసి నా బ్లాగు తలుపులు మూయించెయ్యాలని చూస్తున్నట్టున్నారు. ఆ పనికి ఇంకా చాలా సమయముందని చెప్పి నన్ను మీరే రక్షించాలి. :)

రాధిక said...

బావుందండి.అద్భుతమైన ప్రారంభం అన్న మాట.మేమేమీ అనుకోము గానీ ఆ పాట ని ప్రసారం చేసి మమ్ము ఆనందింపచేయ ప్రార్ధన :)