తెల్ల కాగితం.

అర్ధరాత్రి...ఊరంతా గాఢనిద్రలో ఉంది. కలెక్టరాఫీసుకి కూతవేటు దూరంలోనే స్మశానం. ఆ పక్కగా ఖాళీ వీధుల్ని వెలుతురుతో నింపుతున్న విద్యుద్దీపాలు. ఆ స్మశానానికి ఎదురుగా ఓ చిన్న గుడిసె. దాని ముందు, ఓ వీధి దీపం కింద చాప పై కూర్చొని దీక్షగా చదువుతూన్న సిద్ధయ్య. రేపొద్దున ఉన్న క్లాసు టెస్టులో ఫస్టు రావడానికి ఈ ఆత్రమంతా. చేతిలో ఉన్న పుస్తకంలోని కాగితాలు చల్లగా వీస్తున్న వేసవి గాలికి రెపరెపలాడుతున్నాయి. అలా చదువుతూ చదువుతూ ఆ చల్లగాలికి అలాగే నిద్రలోకి జారుకున్నాడు.

సిద్ధయ్య వాళ్ల నాన్న ఊరూరు తిరుగుతూ పాత సామాన్లు కొని-అమ్మే ఓ చిరు వ్యాపారి. తెల్లవారగానే సైకిలేసుకొని అనంతపురం నుంచి బయలుదేరి, చుట్టుపక్కల ఉన్న పల్లెలు, కాలనీలు అన్నీ తిరుగుతూ పాకం పప్పుకో, పదీ పరక్కో ఇళ్లలో మూలన పడున్న పాత సామానునంతా కొంటూ ఉంటాడు. అలా కొన్న సామానునంతా తన సైకిలుకు తగిలించుకొన్న బుట్టలో వేసుకొని మరో ఊరి దారి పడుతూంటాడు. వారం దాటాక ఓ రోజు గుజరీ కొట్టుకు వెళ్లి తూకం లెక్కన ఆ సామానంతా అమ్మి ఆ వారానికి సరిపడా సొమ్ము సంపాదించుకొంటాడు. ఏదైనా ఒకరోజు జబ్బు పడ్డాడో ఇక ఆ వారం గడవడం కష్టం, అలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు దస్తగిరి.

దస్తగిరికి తన కొడుకును బాగా చదివించాలని పెద్ద ఆశ. తన గుడిసె ముందుగా పెద్దకారులో వెళ్లే కలెకటేరుని చూసినప్పుడల్లా తన కొడుకునీ అంత వాన్ని చేయాలనే పెద్ద ఆశ. అందుకే తనకు సాయపడ్డానికి వాడి ఈడు జతగాళ్లలాగా మెకానిక్ పనికి వెళతానన్నా వద్దని స్కూలుకి పంపుతున్నాడు. ఉన్న దాంట్లో ఏదో కొంత మిగిల్చి వాడి చదువుకు ఖర్చు పెడుతున్నాడు. కానీ ఏ దానికి ఖర్చు పెట్టినా, రాసుకొనే నోటుబుక్కులకు పైసా తీయడు దస్తగిరి.

తన వ్యాపారంలో అక్కడా ఇక్కడా రోజూ ఒక పుస్తకమో, కొన్ని కట్టకట్టిన కాగితాలో దొరుకుతూ ఉంటాయి. అందులో ఖాళీగా మిగిలిపోయిన కాగితాలు చాలా ఉంటాయి. ప్రతి వారమూ గుజరీ సేటుకి అమ్మే ముందు ప్రతి పుస్తకాన్నీ దీక్షగా పేజీ పేజీ తిప్పి చూసి, మిగిలిన ఆ ఖాళీ కాగితాల్ని చింపి ఓ పక్కన పెడుతూ ఉంటాడు. అలా పోగుపడిన కాగితాల్ని ఈనాడు పేపరునో, పాత సితారనో అట్టగా - వేసి సూది,దబ్బలంతో కుట్టి ఓ చక్కని పుస్తకం తయారు చేస్తాడు. అలా చేసి ఇచ్చిన పుస్తకాలతోనే సిద్ధయ్య చదువంతా సాగింది. ఫ్రీగా వస్తునప్పుడు కొత్త నోటుబుక్కలకని డబ్బు ఎందుకు తగలెయ్యాలనేది దస్తగిరి ఫిలాసఫీ.

కానీ సిద్ధయ్యకు తీరని కోరిక ఏదైనా ఉందంటే అది అప్పుడే కట్ట నుంచి తీసిన, లేపాక్షి నోటుబుక్కుని కొని, ఫెళఫెళలాడే ఆ తెల్లని కాగితాలను అటూ ఇటూ తిప్పి, గట్టిగా వాసన చూసి, మొదటి పేజీలో, కొత్త పెన్నుతో తన పేరు రాసుకొని మురిసి పోవాలని. ఎన్నాళ్లగానో ఆ కోరిక అలానే ఉండిపోయింది. ఆ పుస్తకం కంటే ఖరీదైన టెక్స్టుబుక్కుల్ని కొనిస్తాడు కానీ ఇంట్లో దొరికే తన పుస్తకాలను కాదని వాటికి డబ్బు తగలెయ్యడానికి ఎప్పుడూ ఒప్పుకోడు దస్తగిరి.

మరుసటి రోజు ఉదయం అనుకొన్నట్టే టెస్టులో ఫస్టు వచ్చాడు సిద్ధయ్య. తన సంతోషానికి అవధుల్లేకపోయింది. కారణం ఫస్టు రావడం కాదు. చేతిలో కొత్త పుస్తకం. ఆ రోజు ఏదో స్వచ్ఛంద సంస్థ వారు తన తరగతిలో ఉన్న పిల్లలందరికీ తలా ఒక కొత్త నోటు పుస్తకాన్ని, ఒక కొత్త రేనాల్డ్సు పెన్నుని ఇచ్చారు. స్కూలు గంట కొట్టగానే, ఆనందాన్ని పట్టలేక ఎగురుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికెళ్లి తన పేరును ఎంత జాగ్రత్తగా రాసుకోవాలో పదిసార్లు ఆలోచిస్తూ, తనలో తనే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ పొంగిపోతున్నాడు.

ఇంతలో సరిగ్గా కలెక్టరాఫీసు ముందర గుమిగూడిన జనం. ఏమైఉంటుదబ్బా అనుకొంటూ ముందుకు వెళ్లి చూసాడు. రోడ్డు మధ్యలో శవం. ఓ పక్కగా పడి ఉన్న సైకిలు, చిందరవందరగా పాత సామాను. ప్రపంచమంతా గిర్రున తిరిగినట్లయ్యింది. " ఆ లారీ డ్రైవరు మిట్టమధ్యానం తప్పతాగినట్లున్నాడు. ఓ పక్కగా పోతున్న ఈ పెద్దాయనను అన్యాయంగా పొట్టన పెట్టుకొన్నాడు" అని ఎవరో శాపనార్థాలు పెడుతూంటే లీలగా వినిపిస్తోంది. చేతిలో ఉన్న బ్యాగు ఎప్పుడో జారిపోయింది. కొత్త పుస్తకంలోని తెల్ల కాగితం దస్తగరి రక్తంతో తడిసి ఎర్రగా మారుతోంది.

10 comments:

చిన్నమయ్య said...

ఏలిన వారు కాస్త కనికరించాలి. ఏం తప్పు చేసేడని దస్తగిరికి ఇంత పెద్ద శిక్ష? ఇది అన్యాయం. రాయల వారి పాలన జనరంజకంగా వుండాలి. దస్తగిరి బతకాలి. సిద్ధయ్య బతుకు వెలుగు చూడాలి. లేకపోతే బ్లాగ్ప్రజలు తిరగబడతారు.

ఎవరీ వదరుబోతు అనుకోకుండా, ప్రభువులు మరొక్కసారి ఆలోచించండి.

Dr.Pen said...

చిన్నమయ్య గారు,

మీ వ్యాఖ్య ఆలోచించదగ్గదే.కానీ ఈ కథ పూర్తిగా కల్పితం కాదు, నా ఊహాజనిత ప్రపంచంలోనిదీ కాదు. నేను అతి దగ్గరగా చూసిన జీవితాల్లో కొన్ని సంఘటనలు కలగలిపి అల్లిన కథ.

ఇది రాయల వారి పాలనలో జరిగిన కథ కాదు. నాయుడి గారి - ఆ తరువాత - రెడ్డి గారి రాజ్యంలో జరిగిన-జరుగుతూన్న కథ! ఇక సిద్ధయ్య తను చదివిన చదువులతో, ఓ మంచి ఉద్యోగం సంపాదించుకొని తన తండ్రికి ఆత్మశాంతి చేకూర్చాడు. అందుకే చదువును నమ్ముకొన్న వాడికి ఎప్పటికీ నష్టం రాదని!

Dr.Pen said...

అంటారు.

రాధిక said...

చాలా బాగుందండి.కధనం బాగా నచ్చింది.
రాయలవారు ఈ సారినుండయినా కొలువుకి క్రమం తప్పకవస్తారా?

Unknown said...

కథ బాగా రాశారు.
ఎక్కడా దారి తప్పకుండా బింకంగా బాగుంది. ముగింపు కొద్దిగా హఠాత్తుగా వచ్చినట్టుంది కాకపోతే.

కొత్త పాళీ said...

ఎంతైనా ప్రభువుల వారు కదా, కాస్త ఆలస్యంగానే వస్తారు :-)
పైన చిన్నమయ్య గారి అభ్యర్ధన ఆలోచించాల్సినదే. ప్రవీణ్ గమనిక కూడా సమంజసంగానే ఉంది.
మీకు మంచి శైలి ఉంది. నిజంగా జరిగినదాన్ని అలాగే రాసేస్తే అది కథ కాదు, పత్రికలో వార్త అవుతుంది. ముగింపుకి ముందంతా మీరు రాస్తున్నది కథే సందేహం లేదు.

Dr.Pen said...

రాధిక గారు...
ఇక క్రమం తప్పక రాస్తాను.
ప్రవీణ్...
నిజమే రాసేటప్పుడే నాక్కూడా అలాగే అనిపించింది. ముగింపు హఠాత్తుగా వచ్చినట్టుందని.
కొత్తపాళీ గారు...
హమ్మయ్య మొత్తానికి మీరు ఓకే అన్నారు. ముగింపు విషయంలో మీరన్నది నిజమే!

సుజాత వేల్పూరి said...

కథని ఇంకా విస్తరించి రాయొచ్చేమో అనిపించింది. క్లుప్తంగా సినాప్సిస్ లాగా ఉంది. కానీ బాగా రాశారు. ముగింపు అలా హటాత్తుగా మన ఊహకందకుండా ఉంటేనే కొన్ని కథలకు బాగుంటుంది.

Anonymous said...

పాపం దస్తగిరిని వున్నట్టుండి పైకి పంపించేసేరేవిటండి. కానీ రాయలు గారు, మళ్ళా చిన్నప్పటి క్రొత్త పుస్తకాల వాసనని మళ్ళా వొకసారి మనసుకి తెలిసేలా వ్రాసారండి. మరింకాలస్యం ఎందుకు కథావిజయం ప్రారంభించెయ్యండి.

Dr.Pen said...

సుజాత గారు-
అవును సినాప్సిస్సే:-) కథ ఎలా రాయలో ఇంకా నేర్చుకోవాలి. నచ్చినందుకు నెనర్లు!

రవికిరణ్ గారు-
మీ ఆశీస్సులకు నా కృతజ్ఞతలు. మొత్తానికి మీ వ్యాఖ్య నా బ్లాగులో చూసుకొంటుంన్నందుకు ఆనందంగా ఉంది. మీరు కూడా అమ్మ నూలు చీర స్పర్శ అనుభవింపజేసారుగా!