తెలుగు బ్లాగులు ఓ మంచి చర్చా వేదికగా బాగా పనికొస్తున్నాయి.మరి మన అభిరుచులు, కోపాలు, సరదాలు పంచుకోవడమే కాక ఇంకా ఏదైనా నిర్మాణాత్మక కార్యక్రమం ఈ బ్లాగుల ద్వారా చేయొచ్చా? అని చాన్నాళ్లుగా నాలో నలుగుతున్న ప్రశ్న. అందుకు సమాధానం కూడా దొరికింది కానీ, దానికి ఓ రూపు ఇచ్చేటప్పటికి ఆలస్యమయ్యింది.
ఈ పెట్టుబడీదారీ ప్రపంచంలో 'ఆలోచనలే' పెద్ద పెట్టుబడులు. తళుక్కున మెరిసిన ఓ ఆలోచన మీ పంట పండిచ్చవచ్చు. అలాగే మనం బ్లాగుల ద్వారా ఇతర్లతో పంచుకొనే వన్నీ ఆలోచనలే కదా! ఆ ఆలోచనలనే పెట్టుబడిగా మార్చి సొంత లాభం మానుకోకుండానే పొరుగు వాడికి తోడ్పడవచ్చు...అదెలాగంటారా?
నాలో వచ్చిన ఈ ఆలోచనే అందుకు తార్కాణం. ఆ ఆలోచనే "మీరే మీ జిల్లా కలెక్టరయితే?" సొంత ఊరు, సొంత జిల్లా అంటే సాధారణంగా అందరికీ అభిమానముంటుంది. పైపొచ్చు మీ జిల్లా కష్టనష్టాలూ మీకు బాగా తెలిసుంటాయి. అయితే చీటికీ-మాటికీ ప్రభుత్వాన్ని తిట్టిపోసే ముందు, మీకే అధికారమిస్తే మీరేం చేస్తారో బ్లాగితే...అందులో మేలైన కొన్ని ఆలోచనలలో ఒక్కదానినైనా అమలు చేస్తే తద్వారా వచ్చే ప్రయోజనాలు అనంతం. జిల్లా స్థాయిలోనే ఎందుకు అంటే? రాష్ట్ర స్థాయిలో అమలు చేసేవాటి పరిధి విస్తృతమే కాకుండా, అమలులో కూడా పరిమితులుంటాయి. ఇక కలెక్టరెందుకంటే జిల్లాకు రాజు ఆయనే కాబట్టి. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా:)
ఇక తెలుగు బ్లాగర్లు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో నిష్ణాతులు, మీ ఆలోచనలు ఈ వైపునకు మళ్లించడమే ఈ వ్యాసరచన పోటీ ఉద్దేశ్యం. మరి మీ బుర్రలకు పనిపెట్టండి, మేధోతుఫాను సృష్టించండి. తెలుగు బ్లాగుల్లో కొత్త చరిత్రకు నాంది పలకండి! మరి ఈ పోటీలో విజేతనే ఉత్తమ తెలుగు బ్లాగు విజేత-2007 గా ప్రకటిస్తే సరి:)
6 comments:
మొన్న చదువరి రాసిన రాజకీయ టపా చూసి, మనబ్లాగుల్ని ఒక కొత్త రాజకీయ చైతన్యం తేవడానికి ఉపయోగించ వచ్చని చిన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు మీ ఈ ఆలోచన కూడా బాగుంది. విజేతకి నేనొక $25 అమెజాన్ బహుమతి పత్రం ఇస్తాను.
నేనే కనుక కృష్ణా జిల్లా కలెక్టర్ అయితే..ముందు మా మామ బాజాని (నా గర్ల్ ఫ్రెండ్‌కి నాన్న) దగ్గరికి వెళ్ళి.. తన కూతురిని నాకిచ్చి పెళ్ళి చేయమంటాను. ఆ తర్వాత రహదారి భద్రత...నన్ను బాగా కలవరపెట్టే విషయం. హైవేల సంగతి ఏమో కాని, సిటీల్లో/టౌనుల్లో ముఖ్యమైన రహదారులకి ఇరువైపులా ముందు నడిచి వెళ్ళేవాళ్ళకి ...పేమెంట్ ఉండేలా చేస్తాను. నేను విజయవాడలో రోడ్డు మీద నడవాలంటే.. చాలా ఇబ్బంది పడతాను. అలాగే బండి మీద వెళ్ళేటప్పుడు... రోడ్డు మీద నడిచే వాళ్ళతో ఇబ్బంది. ఇది చాలా చిన్న విషయమేమో కాని....నాకు మాత్రం చాలా ముఖ్యమైన విషయంలా అనిపిస్తాది. అవునూ! కలెక్టర్ అయిన ఆనందంలో ఏమి తెలియటంలేదు...ఇది(రహదారి భద్రత) నా పరిధిలో విషయమేగా!!
నాకు దేశాన్ని ఉద్దరించేయాలన్న ఆవేశం ఎక్కువే. దీని గురించి ఎంతో ఆలోచించి...చించి..చించాను. కలెకటీరుగా ఉంటే ప్రయోజనము లేదు. మంత్రులు చెప్పినట్టు నడుచుకొనకపోతే ఒక్క తన్నుతో బదిలీ అవుతాము. ఎమ్మెల్యేగా, ఎమ్పీ ఏమి చేయగలను అని ఆలోచించినా, ప్రసంగం చేసినా సమయం వృధా తప్ప దమ్మిడీ ప్రయోజనం లేదు. చివరకు కనీనం మా ఊరిలో మా ఇల్లున్న వీధిని మార్చాలని సంకల్పించాను. ఉదాహరణకు నీళ్ళ ట్యాంకర్ వచ్చినప్పుడు..క్యూలో నిల్చునేలా చెయ్యడం. ప్రతి ఇంటా రెండు బుట్టెలు పెట్టుకొని, రీసైక్లింగ్ చెత్తను ఒక దాంట్లో, మిగతా చెత్త వేరొక దాంట్లో వేసేలా చెయ్యటం. రోడ్డులో ఉమ్మకుండా నేర్పడం. కాలువలో అడ్డమైన చెత్త వేయకుండా చెయ్యడం లాంటివి అనమాట.....ఇది ప్రాక్టికల్ గా ఆచరించగలం అనిపించింది. దీన్నిబట్టి పోటీలో మార్పేమైనా ఉందేమో చెప్పండి...లేదంటే ఏమి చేస్తాం మీరు చెప్పిందే బ్లాగుతాం.
డాక్టరు గారూ మీ ఆలోచన చాలా బాగుంది. కొత్తపాళీ గారి బహుమతి టెప్టింగుగానూ ఉంది. (ఒకట్రొండు మంచి పుస్తకాలు కొనుక్కోవచ్చు). కలెక్టరు రాజుకాకపోయినా కొంతవరకు స్వయంనిర్ణయాధికారముంటుంది వరంగల్ జిల్లాలో ఒకానొక కలెక్టరు రేషన్ కార్డులు వగైరా రెవిన్యూ శాఖ చేతిలో ఉండే పనులన్నింటినీ కుటుంబ నియంత్రణకు ముడిపెట్టి అమలుచేసి మంచి ఫలితాలు సాధించారని మా నాన్న చెబుతుండేవాడు..
నా ఆలోచన సరిగ్గా నవీన్ లాంటిదే.
నవీన్, మంచి పని చేస్తున్నారు. అభినందనలు.
ఆలోచన బావుంది. "ఏం చెయ్యాలనుకుంటున్నారో" తో పాటు "ఏం చేస్తున్నారో" కూడా రాస్తే, నవీన్ గారు చేస్తున్న పనుల వంటివి బయటకొస్తాయి.
Post a Comment