చుక్కలకు ఱేడు, వలరాజు మేనమామ - మన చందమామ!

సీ.కలశ పాథోరాశి గర్భ వీచిమతల్లి
గడుపార నెవ్వానిఁ గన్న తల్లి,
యనలాక్షు ఘన జటా వన వాటి కెవ్వాడు
వన్నెవెట్టు ననార్త వంపుఁ బువ్వు,
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాని
పుట్టు కామని లేని మెట్ట పంట,
కటిక చీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు తొగకన్నె నవ్వఁ జేయు,

తే.నతడు నొగడొందు మధుకైటభారి మఱిది,
కళల నెలవగు వాఁడు చుక్కలకు ఱేడు,
మిసిమి పరసీమ వలరాజు మేనమామ,
వేవెలుంగుల దొర జోడు, రే వెలుంగు.
-19,ప్రథమాశ్వాసం: ఆముక్తమాల్యద,శ్రీకృష్ణదేవరాయలు.
-----------------------------------------------
కలశ పాథోరాశి = పాలసముద్రముయొక్క
గర్భ= కడుపులోని
వీచిమతల్లి = గొప్ప అల
కడుపార = సంతృప్తిగా
ఎవ్వాని = ఎవని
కన్నతల్లి = ఏ చంద్రుని కనిన మాతృదేవతయో;
అనలాక్షు = అగ్ని ఫాలనేత్రంగా గల శివునియొక్క
ఘన = దట్టమైన
జటా = జడలనెడి
వనవాటికి = తోటకు
వన్నెవెట్టు = అందానిచ్చే
అనార్తవంపుఁబువ్వు = ఋతు సంబంధం కాని పుష్పము;
సకల = సమస్తమైన
దైవత = దేవతలయొక్క
బుభుక్షా = ఆకలి
పూర్తికిన్ = తీరుటకు
ఎవ్వాని పుట్టుక = ఎవని జన్మ
ఆ మనిలేని = మార్పిడి లేని
మెట్టపంట = వర్షాధారంగా పండే పంట;
ఎవ్వాడు = ఏ చంద్రుడు
కటిక చీకటి తిండి కరము = కటిక చీకటియే ఆహారంగా కలిగిన కిరణములచేత
తొగ కన్నెన్ = కలువ కన్యను
గిలిగింత = చక్కిలిగింత చేత
నవ్వ చేయు = నవ్విస్తాడు;
అతడు = ఆ చంద్రుడు
మధుకైట భారి = మధుకైటభుల శత్రువైన విష్ణువుకు
మఱిది = బావమరిది
కళల నెలవగువాడు = పదునారు కళలకు ఉనికి పట్టయినవాడు
చుక్కలకు ఱేడు = నక్షత్రములకు రాజు
మిసిమి = జిలుగు కాంతికి
పర = ఆవలి
సీమ = హద్దు అయిన
వలరాజు = మన్మథునకు మేనమామ
వేవెలుంగుల = వేయి కిరణాలు గల
దొర = సూర్యునకు
జోడు = దీటైనవాడు
రేవెలుంగు = రాత్రికి వెలుగైనవాడు


(ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు రచించిన ఆముక్తమాల్యద సౌందర్యలహరీ వ్యాఖ్యానం నుంచి)
----------------------------------------------------------------------------------
మొత్తానికి ఇన్ని రోజులకు ఈ మహాప్రబంధాన్ని చదివే అదృష్టం కలిగింది. మొదటి యాభై పేజీలలో నన్నాకర్షించిన పద్యం ఇదే. సుధాకరుడిని ఇంత అందంగా వర్ణించిన పద్యం ఇదే! ఆ తేటగీతిలోని తేటదనం ఒక్కసారి గమనించండి. అయితే ఈ పద్యం ఆముక్తమాల్యదలోనిదైనా, రాయలవారు రాసారనుకొంటే మీరు పప్పులో కాలేసినట్టే! ఇది పెద్దన విరచిత మనుచరిత్ర నుంచి తీసుకోబడింది. అంత మాత్రాన మన రాయలవారిని పద్యచోరుడిగా ముద్ర వేసేరు, ఇది రాయల వంశ చరిత్ర గురించి చెబుతూ పెద్దన రాసిన పద్యాల సరళిలో మొదటిది. తన ఆముక్తమాల్యదలో తన గురించి తనే రాసుకోవడం ఇష్టం లేకనేమో పెద్దన రాసిన పద్యాలను ఇలా వాడుకొన్నాడు. చంద్రుడు శ్రీకృష్ణదేవరాయల వంశ మూలపురుషుడు కాన ఆయనని వర్ణిస్తూ చేసిన రమణీయ చక్కెర గుళిక ఈ పద్యమాలిక.


కొసమెఱపు: మొన్న మా సుహాసు "నాన్నా! నేను ఎక్కడికి వెళితే అక్కడికి, చందమామ, నా వెంటే ఎందుకు వస్తున్నాడు?" అని అమాయకంగా మొహం పెట్టి అడిగాడు. నా చిన్నప్పటి బస్సు ప్రయాణాలలో నాలో ఎప్పుడూ రేగే ఈ ప్రశ్నను మా వాడి నుంచి వింటూంటే అదో వింత అనుభూతికి లోనైయ్యి "నీవంటే ఇష్టంలేరా మీ మామకు" అని చెప్పాను, కానీ ఆయన అల్లుడు మన్మథుడనుకోలేదు:)

2 comments:

కొత్త పాళీ said...

సెబాషో

Sriram said...

మంచి పద్యం గురించి బ్లాగినందుకు నెనరులు.