అరచేతిలో ప్రపంచం: ఐఫోన్ - బెంజమిన్ ఫ్రాంక్లిన్ 'ఈల'?

ముందు ఫ్రాంక్లిన్ 'ఈల' సంగతి చూద్దాం...అంటే చదువుదాం! వంద డాలర్ల నోటుమీద నవ్వుదామా, వద్దా అనే మీమాంసలో ఉన్న ఈ అమెరికా పెద్దాయన తన చిన్నప్పటి సంగతిని ఇలా బ్లాగీకరించాడు..."నేను ఏడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఓసారి పెద్ద పండుగ వచ్చింది. నా స్నేహితులు, పెద్దలు నాకు దండిగా రాగి నాణేలు ఇచ్చారు. ఇక చెప్పేదేముంది హుషారుగా ఈల వేసుకొంటూ మా ఊర్లోని బొమ్మల అంగడికి పరుగెత్తాను. అక్కడ కనిపించిన 'ఈల' ను చూసి మనస్సు పారేసుకొన్నాను. నా మిత్రుల దగ్గర అప్పటికే చూసి ఉండడం వల్ల వెంటనే కొనాలనిపించి నా దగ్గర ఉన్న సొమ్మంతా అంగడి వాడికిచ్చి ఆ 'ఈల'ను సొంతం చేసుకొని ఇల్లంతా వినపడేలా తిరుగుతూ నానా అల్లరి చేశాను. కానీ కాసేపట్లోనే మా బావలూ-బామ్మర్దులూ, అక్కలూ-తమ్ముళ్లూ అందరూ, నేను ఆ 'ఈల' విలువ కన్నా నాలుగింతలు ఎక్కువగా ఖర్చు పెట్టాననీ, ఆ పైకానికి ఇంకా బోలెడు బొమ్మలొచ్చేవనీ చెప్పగానే నా ఉత్సాహం అంతా నీరుగారి పోయి, లేని బాధ మొదలయ్యింది. అందుకే ఆ పిమ్మట ఎప్పుడూ ఏదైనా అనవసర వస్తువు కొనేముందు "ఈ ఈల విలువెంత?" అని నన్ను నేను ప్రశ్నించుకొనడం అలవాటయి చాలా డబ్బు ఆదా చేసాను."
- బెంజమిన్ ఫ్రాంక్లిన్ "ద విజిల్" (రచనా కాలం:1779) కు స్వేచ్ఛానువాదం.
ఈ రోజు పని మీద గ్రంథాలయం వెళ్లినప్పుడు చిన్నప్పటి 'బెన్' పాలరాతి విగ్రహం కింద ఈ కథ చదవగానే మొన్నటి 'ఆపిల్' కథ గుర్తుకొచ్చింది. తొందరగా కొనాలన్న ఆతృతలో రెండు వందల వరహాలు నష్టపోయి 'చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు' మరో వంద వరహాల ఆటబొమ్మలయినా దక్కాయని తృప్తిపడ్డ 'ఫ్రాంక్లిన్'లూ గుర్తుకొచ్చారు... ఆగండాగండి అక్కడికే వస్తున్నా, ఇంకొన్నాళ్లు ఆగు నాయనా 'నవ్విన నాపచేనే పండుతుంది' అనుకొంటున్నారు కదూ! అలాగే కానివ్వండి. కానీ నిజంగా అరచేతిలో ప్రపంచం ఈ ఫోను. కానీ వచ్చిన చిక్కల్లా తెలుగు చూడ్డానికి, చదవడానికీ వీలు లేకపోయింది. అందుకే ప్రారంభోత్సవం ఇలా తెలుగు వల్లభుడితో కానిచ్చేశాను!

2 comments:

Unknown said...

ధన్యవాదాలండీ ఇస్మాఇల్ గారు
outlook లో మీ బ్లాగు గురించి వ్చ్చినందుకు.

Unknown said...

Mee blog ippude choostunnanu.nemmadiga mottam chaduvutanu.