ఈ కిరాతక కృత్యం వెనకాల ఉన్న ముష్కరులెవరు?

దారుణం! ఘోరం! ప్రతి ఒక్కరినీ కలచివేసే ఈ సంఘటన వెనక ఉన్న శక్తులేవి? మొన్నటికి మొన్న మక్కామసీదులో ఇలాగే అమాయకుల ప్రాణాలు బలిగొన్న తరువాతైనా మన ప్రభుత్వం తన గూఢచార వర్గాన్ని అప్రమత్తం చేసి ఉండాల్సింది. ఎన్నో రోజులుగా హైదరాబాదును తీవ్రవాదులు తమ లక్ష్యంగా ఎంచుకొన్నారని తెలిసాకైనా మన పోలీసు వర్గాలు జాగురూకతతో ఉండాల్సింది. అయితే ఈ కుట్ర వెనుక ఉన్న శక్తుల అసలు ఉద్దేశ్యం ఏమై ఉంటుందో ఊహించడం కష్టసాధ్యం కాదు కానీ, అనుమానాలను అన్ని వైపుల నుంచి నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చరిత్రను మలుపు తిప్పిన 9/11 వంటి దారుణాల మీదే అనుమానపు చూపులు మొదలైనప్పుడు, ఈ సంఘటన వెనుక ఉన్న అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ రాజకీయాల మీద అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరపాలి. మన గూఢచారి వర్గాలు ఎంతసేపూ ఎన్నికలు జరిగితే ప్రభుత్వంలో ఉన్న పార్టీ గెలుస్తుందా? ఎవరి బలాలు ఎంతెంత? ఇలాంటి చెత్త రాజకీయాలకు ఉపయోగపడుతున్నాయే కానీ రాష్ట్ర ప్రజల ప్రాణాలు రక్షించే విషయంలో విఫలమవుతున్నాయి. ఇంత జరిగాకయినా ఇప్పటికీ మేల్కొనక పోతే ప్రభుత్వం ఉండీ లేనట్టే. ఈ దారుణంలో అసువులు బాసిన చిన్నారులకు, అమాయకమైన పౌరులందరికీ నా బాష్పాంజలి. అసలు నేరస్తులను పట్టుకొని తీవ్రంగా శిక్షించాలి.

No comments: