అందులో ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న ఇంధన సమస్యకు సమాధానంగా, పెట్రో ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా జీవ-ఇంధనాలను ప్రతిపాదిస్తూ మన ప్రాంతాల్లో విరివిగా పెరిగే ఓ మొక్క గురించి ఇలా రాస్తున్నారు. ఆ నవయుగ సంజీవని పేరే 'జత్రోపా' తెలుగులో నల్ల ఆముదం, నేపాలం, పిప్పలం, కొండముదము (మన గూగులమ్మ తల్లి సెలవిచ్చింది, అసలు పేరు - ఆ పై విశేషాలు మన వ్యవసాయాచార్యులు 'సత్యశోధన' మాస్టారు చెప్పాల్సిందే!) అని అంటారని తెలిసింది. ఈ మొక్కకు ఈ మధ్యే ఎందుకింత పేరొచ్చింది అంటారా? అదీ చెప్తాను.
ప్రపంచంలో నేడు రోజు రోజుకు పెరిగిపోతున్న ఇంధన అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది 'ఇథనాల్'. అసలు కొన్ని దేశాలు ఈ విషయంలో చాలా ముందున్నాయి. ఉదా.బ్రెజిల్ తన ఇంధన అవసరాలలో 30% చెఱుకు పంట నుంచి తీసే ఇథనాల్ మీదే ఆధారపడుతోంది. తద్వారా పెట్రోలు దిగుమతి, అందుకోసం ఇతర దేశాల దయాదాక్షిణ్యాల పై ఆధారపడడం తగ్గించుకొని, తన ఆర్థికవ్యవస్థను పెట్రోలు ధరల కోరల నుంచి రక్షించుకొంటోంది. అయితే ఇక్కడొక తిరకాసు ఉంది.అందుకోసం మొక్కజొన్న, చెఱుకు లాంటి ఆహార పంటలు వినియోగిస్తే, మొన్నెప్పుడో మన చావాకిరణ్ పండితుడు నుడివినట్లు: "పంటలు అన్నీ ఆటోలకే ఆహారంగా వెళ్ళసాగినాయి, రీసెర్చి మొత్తం దానికోసమే జరిగినది, దాని వల్ల అంతంత మాత్రంగా ఉన్న వివిధ దేశాల ఆహార భధ్రత పూర్తిగా ప్రమాదంలో పడినది, ఇహ అప్పటికే కరువు కాటకాలతో, అంతర్యుద్ధాలతో సతమతమవుతున్న మూడవ ప్రపంచ దేశాలు పూర్తిగా కరువు కోరల్లోకి జారుకున్నాయి. ఆహారం రేట్లు ధనిక దేశాల్లో కూడా దిగువ మధ్య తరగతి, పేద వర్గాలకు పూర్తిగా అందకుండా పొయినాయి. ఈ కరువు సుమారుగా యాబై సంవత్సరాలు కొనసాగినది, కొన్ని దేశాలకు దేశాలే , జాతులకు జాతులే తుడిచి పెట్టుకొని పొయినాయి, అక్రమ వలసలు విపరీతంగా పెరిగి ప్రపంచంలోని దేశాలన్నిటికీ సమస్యలు సృష్టించినది. మొత్తం ప్రపంచ జనాభా మూడవ వంతుకు తగ్గిపొయినది!" ఇలా జరగొచ్చు కూడా! మరి ఇక్కడే మన 'జత్రోపా' మొక్క మనకు అక్కరకు వస్తుంది. నీటి అవసరం పెద్దగా లేని, ఆహార పంట కాని, బంజరు భూముల్లో కూడా పెరిగే ఈ మొక్క మన ఇంధన అవసరాలు తీర్చటమే కాకుండా, విదేశాలకు ఎగుమతి చేసి మన ఆర్థిక వ్యవస్థకు ప్రస్థుతమున్న వాపులా కాకుండా నిజమైన బలం చేకూరుస్తూ, నేల ఉన్నా సాగు చేసుకోలేని బడుగు రైతులకు ఉపాధినిచ్చే కల్పవల్లిగా మారొచ్చు. కానీ ఇవన్నీ నిజం కావాలంటే ఇలాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను అభివృద్ధి చేసే చొరవ మన పారిశ్రామికవేత్తలు చూపాలి. వాటినే వాడాలనే గట్టి నిర్ణయం వినియోగదారులు తీసుకోవాలి. ఇక ఈ మొక్కల్ని పండించటం మన రైతులకు చేతిలో పని. సర్వేజనాసుఖి:నోభవంతు!
చిత్ర సౌజన్యం: వాల్ స్ట్రీట్ జర్నల్. మరిన్ని చిత్రాలకై:(ప్రతీక్ బర్థా)
2 comments:
దీన్ని తెలుగులో నేపాళం అంటారు. నాకు తెలిసీ దీని గురించి, హోహోబా గురించి గత 15-20 సంవత్సరాలుగా దూరదర్శన్ రైతాంగ కార్యక్రమములో మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ పట్టించుకొనే నాథుడెవరూ..గొర్రెదాటు ప్రజలకు గొర్రెదాటు ఫలితాలే వస్తాయి.
Post a Comment