'అమ్మ'కు జే! జే!

అమ్మకు జే! జే! నాన్నకు జే! జే!
చదువును నేర్పిన గురువుకు జే! జే!

'అమ్మ' ఎంత కమ్మనైన పదం. తెలుగులో నాకు తెలిసి ఇంతకన్నా మధురమైన పదం ఇంకొకటిలేదేమో! అసలు తెలుగనే కాదు ఏ భాషలోనయినా తల్లిని సూచించే పదం అన్నిటికన్నా అమృతమయం. ఈ 'మదర్స్ డే' లాంటివి పాశ్చాత్య సంస్కృతి మనం పాటించనవసరం లేదు అని కొందరనుకొన్నా, తల్లిని గౌరవించుకొనే ఏ సందర్భమైనా మంచిదే అని నా నిశ్చితాభిప్రాయం.

మా అమ్మ పేరు 'నూర్జహాన్'. (నూర్-జహాన్: ప్రపంచానికే వెలుగు అని అర్థం.జహంగీర్ చక్రవర్తి తన ముద్దులభార్య 'మెహరున్నీసా'కు ప్రేమతో పెట్టిన పేరది.) తను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని. నా చిన్నప్పటి గురువు కూడా. నా జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులలో అగ్రస్థానం అమ్మదే! సర్వమతసమానత్వం, సౌభ్రాతృత్వం అని చెప్పడమే కాక నన్ను చిన్నప్పటి నుంచి మసీదుకు,చర్చికి,గుడికి పంపేది. నేను వెళ్లిన 40రోజుల 'ఇస్తెమా'నే కాకుండా ఇప్పటికీ నా దగ్గర ఉన్న 'భగవద్గీత'పోటీలో గెలుచుకొన్న కప్పులు, 'తితిదే' పురాణ ప్రభోధ పరీక్ష ప్రశంసాపత్రాలు, మా ఊరి సి&ఐ.జి మిషన్ చర్చి వారి 'వెకెషనల్ బైబిల్ స్కూల్' మెరిట్ సర్టిఫికెట్లు దీనికి సజీవసాక్ష్యాలు. (మా నాన్న 'బుద్ధుడి'బోధనలు తప్ప వేరెవర్నీ నమ్మని 'ఆగ్నోస్టిక్.')

చిన్నప్పటి నుంచి ప్రతి పరీక్షకు మా అమ్మ నా పక్కన ఉంటే అదో పెద్ద గుండె ధైర్యం. చివరకు నా మెడిసిన్ పరీక్షలతో సహా! కానీ మా అమ్మకు నేను పెట్టిన బాధలు అన్నీ ఇన్నీ కావు. తెలిసీ తెలియని తనంతో అలిగి ఇల్లు విడిచి పోయినప్పుడు తను పడ్డ బాధ తలుచుకొన్నప్పుడల్లా నా మీద నాకే కోపం కలుగుతుంది. నన్ను క్షమించు అమ్మా! ఇక మా అమ్మ అమ్మ పేరు కుళ్లాయమ్మ(ఈ పేరుకు కృష్ణదేవరాయలకు సంబంధముందడోయ్...అది మరెప్పుడైనా) ఎన్నో కష్టనష్టాల కోర్చి మా అమ్మను 'టీచర్' చేయాలనే తన కోరికను నెరవేర్చుకొంది.75 ఏళ్ల పరిపూర్ణ జీవితం గడిపి నా చేతుల్లోనే కన్నుమూసింది. తన గురించి బాధపడినప్పుడల్లా 'పండుటాకులు రాలిపోక తప్పదు, కొత్త చిగుర్లు వేయకా తప్పదు' అంటుంది.

ఇప్పుడు నాతో ఉన్న మా అమ్మానాన్నలు ఇంకో నెలన్నర తర్వాత ఊరికెళతారు అంటే ఇప్పటి నుంచే బెంగ పెట్టుకుంది.ఈ సంవత్సరమే మా అమ్మ పదవీవిరమణ కూడా, కాబట్టి వెళ్లక తప్పదు. మళ్లీ త్వరగా రావాలని బ్లాగు ముఖంగా వారిని కోరుకొంటూ, ఈ 'మాతృదినోత్సవం' రోజు మా 'అమ్మ'కు నా మన:పూర్వక శుభాకాంక్షలు. అలాగే మా సుహాస్, శ్రేయల తరఫున వాళ్ల 'అమ్మ'కు కూడా:-)

3 comments:

Anonymous said...

మీ తల్లి తండ్రులకు నాగరాజా పాదభివందనాలు. అదృష్టవంతుడివి నాయనా...

spandana said...

మీరు ధన్యులు!

--ప్రసాద్
http://blog.charasala.com

Naga Pochiraju said...

amma ammE!