'పరిణీత' - ఓ దృశ్య కావ్యం!

'పరిణీత'- పెళ్లయిన ఓ స్త్రీ కథ. మళ్లీ ఒక అద్భుతమైన సినిమా చూసే భాగ్యం లభించింది. బెంగాళీ బాబు 'శరత్చంద్ర ఛటర్జీ' నవలకు తెర రూపం ఈ చిత్రం. నిర్మాత, దర్శకుడు, నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం తగిన న్యాయం చేసారనే భావిస్తున్నాను. రాజసం ఉట్టిపడే 1962 కలకత్తా నగరం, కళ్లు జిగేల్ మనే దుస్తులు, కళ్లకింపైన ఛాయాగ్రహణం, చెవులకింపైన పాటలు, చవులూరించే సంగీతం, మురిపించే నటన, ముచ్చటగొలిపే దర్శకత్వం అన్నిటినీ మించిన కథ. ఓహ్...ఏమి అనుభూతి!

'విధు వినోద్ చోప్రా' సాహసానికి జోహార్లు. ఎంత నమ్మకముంటే ఇలాంటి 'క్లాసిక్' మీద అంత పెట్టుబడి పెడతాడు. అతని అన్ని సినిమాలు సరుకుండేవే! దర్శకుడు 'ప్రదీప్ సర్కార్' ఎంతో శ్రమకోర్చి ఈ కళాఖండానికి జీవం పోసాడు. సంగీత దర్శకుడు 'శంతను మొయిత్రా' నా అభిమాన 'భూపేన్ హజారికా'ను గుర్తుకు తెచ్చాడు. ఛాయాగ్రాహకుడు 'నటరాజ సుబ్రమణియన్' చక్కనైన పనితనాన్ని చూపాడు. ఇక నటీనటుల సంగతి చెప్పేదేముంది, ఛోటే నవాబ్ 'సైఫ్ అలీ ఖాన్' ఎంతో హుందాగా నటించాడు, చిన్న పాత్ర అయినా విషయమున్నపాత్రలో ఎప్పటిలాగే ఒదిగిపోయాడు సంజయ్ దత్.

'దేవదాసు' రాసిన ఆయనే ఇదీ రాసాడంటే...చెప్పను సినిమా చూడండి మీకే తెలుస్తుంది. స్త్రీ హృదయాలను పట్టి వడపోచిన ఘనత 'శరత్' సొంతం. వారిలో ఉన్న భావాలను విప్పి చెప్పి వాటి నిజమైన విలువను వారికే తెలియజెప్పిన నవలాకారుడు 'శరత్'. ఇక ఈ సినిమాలో ప్రేమ, ఈర్ష్య, మోసం, ద్వేషం, దురాశ...లాంటి ఎన్నో మనోభావాలను ముసుగు తీసి మరీ చూపిస్తాడు రచయిత. ప్రేమలో జ్వలించే కథానాయకుడు, కథానాయిక నిస్సహాయత, వారి మధ్య తలెత్తే అపనమ్మకాలు, దోబూచులాటలు...వేసవిలో రాత్రి వీచే చిరుగాలిని మన మనస్సులో అనుభవించేలా చేస్తాయి.

ఇక 'విద్యా బాలన్' అందం నా కళ్లు తిప్పుకోనివ్వలేదు. 'లగేరహో...'లో మెరుపులు మెరిపించిన ఈ మెఱుపుతీగ తన మొదటి చిత్రంలోనే ఇంత పరిణతి చెందిన నటన ప్రదర్శిస్తుందనుకోలేదు. 'పాలక్కాడ్' కు చెందిన ఈ ముద్దుగుమ్మ పాలనురుగు లాంటి శరీరలావణ్యంతో, వంకీలు తిరిగిన చెవి రింగులతో ఉన్న తలకట్టుతో, బంగారు రంగు మేని ఛాయతో, అంతకు మించిన సంస్కారంతో 'శరత్చంద్ర' నవలలోని నాయికను మన ముందు నిలిపింది. నాకు నచ్చిన నటీమణుల్లో సావిత్రి, సుహాసిని, సౌందర్య, లయ, కొత్తగా ప్రియమణి:-) కోవలోనికే చెందుతుంది ఈ బాలామణి!

ఇక ఇది చాలదన్నట్టు మూన్ మూన్ సేన్ పుత్రికా రత్నం 'రైమా సేన్', ఒక పాటలో తళుక్కున మెరిసే 'రేఖ', మన హైదరాబాదీ 'దియా మీర్జా'...అబ్బో చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఎంతైనా హిందీ చిత్రరంగాన్ని మన దక్షిణాది తారలయిన జయప్రద, వహీదా రెహమాన్, టబు-(తెలుగు), శ్రీదేవి, హేమమాలిని, రేఖ -(తమిళం), ఇప్పుడు ఈ విద్యాబాలన్-(మళయాళం) ఒక్క ఊపు ఊపారు/ఊపుతున్నారు.

6 comments:

రాధిక said...

caalaa kaalam ayindi kadandi ii movie vachi?

Dr.Pen said...

నిజమే రాధిక గారూ...కానీ మా అమ్మ వాళ్లు వచ్చారుగా పాత డివిడిల మీద పడ్డాం.ఇంకా అదే కాక చక్రవాకం మొ.సీరియల్లు కూడా:-(

cbrao said...

చక్కని సినిమా పై చిక్కని సమీక్ష. 'విద్యా బాలన్' నిజ జీవితంలో చాలా fast girl అని తనే చెప్పుకుంది. మీరన్నట్లు ఆమె నటన అద్భుతం.

Anonymous said...

సినిమా గురించి..అందులో నటించిన నటీనటుల గురించి అంతంత వర్ణనలు చేసి అసలు కథ చెప్పలేదే!! టూకీగా వ్రాసినా పర్లేదు,...దయచేసి కథ కూడా వ్రాస్తురూ?

Dr.Pen said...

నవీన్...
మీరు అలా అయినా సినిమా చూస్తారనీ:-)కథ చెప్పలేదు!

రావుగారూ...
అవునా! నాకు తెలియదీ సంగతి! మీ మెచ్చుకోలుకి నా కృతజ్ఞతలు!

spandana said...

అవువవును. కథ చెప్పకండి. కథ తెలిసాక మజా ఏముంది?
--ప్రసాద్
http://blog.charasala.com