హిందూపురం ఛైర్మన్ 'అనిల్ కుమార్'

ఈ మధ్య మా హిందూపురం వార్తలు చూడలేదు కానీ నిన్న చూస్తే తెలిసింది. ఈసారి మునిసిపల్ ఎన్నికలలో హిందూపురం పురపాలకసంఘం ఛైర్మన్ గా 'అనిల్ కుమార్' కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యాడని! అనిల్...ఈ సందర్భంగా నీకు నా శుభాకాంక్షలు.

నాకు రాజకీయాల మీద ఆసక్తి లేకున్నా ఈ విషయం నా బ్లాగులో రాయడానికి కారణం...చిన్నప్పుడు ఒకే వీధిలో ఉంటూ కలిసి గోళీలాడుకొన్నవాడిగా 'అనిల్' తెలుసు కాబట్టి. హిందూపురంలో 'ముక్కిడిపేట' (ముక్కిడమ్మ అనే ఆవిడ పేరు మీద ఉన్న పేట అట!)లో మేము నివసించేటప్పుడు ఈ అనిల్ వాళ్ల ఇల్లు మా ఇంటికెదురుగా ఉండేది. అప్పటి నుంచే అనిల్ వాళ్ల నాన్న కాంగ్రెసు నాయకుడు.

మా అమ్మ చెబితే తెలిసింది అప్పట్లో ఎన్నికలప్పుడు వీడితో పాటు నేనూ కాంగిరేసు జెండా పట్టుకొని పరుగెత్తేవాడినని(పిల్ల చేష్టలు కదా!). కానీ ఆ తర్వాత 'ఎన్టీవోడు' రాజకీయాలలోకి వచ్చాక, ఎన్.టి.ఆర్ వీరాభిమానిగా మా నాన్న షామియానా వేసి 'చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా!' అంటూ తెలుగుదేశం ఎన్నికల డేరా వేశాక, నేను వీరావేశంతో ఈ సారి పసుపుపచ్చ జెండా, షర్టుకు ఎన్టీయార్ బొమ్మ తగిలించి తిరిగేవాడిని.

మొత్తానికి ఇలా 31 ఏళ్ల వయస్సులోనే ఓ రాజకీయ పదవికెక్కాడు నా సహాధ్యాయి. ఇప్పుడు నాకే రాజకీయ పార్టీ పైనా అభిమానం లేకపోయినా తెలిసిన వాడికి మంచి జరిగినప్పుడు అభినందించాలని ఇలా. ఇక పైనున్న చిత్రం హిందూపురం నడిబొడ్డున ఉన్న 'టూరిస్ట్ లాడ్జ్'. ఎన్నో ఎన్నికలలో తెదేపాకు పార్టీ కార్యాలయంగా ఉండేది. పక్కనే నేను పుట్టిన ప్రభుత్వ వైద్యశాల బోర్డు కూడా లీలగా కనిపిస్తోంది చూడండి!
(చిత్రసౌజన్యం: చింతు)

2 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

నాకూ హిందూపూర్ కి చాలా అనుబంధం ఉంది. నా పి.హెచ్.డి. కోసం రైతులని సర్వే చేయడానికి ప్రత్యేకంగా హిందూపూర్ తాలూకాని ఎంచుకొన్నాను. దానికి కారణం నా స్నేహితుడు, అత్యంత ఆత్మీయుడు డా. మాడుగుల సత్యన్నారాయణ- భారత్ ప్రెస్ వాళ్ళు- హిందూపూర్- కీ.శే.సితారామాశాస్త్రి గారి అబ్బాయి. నా అనుభవాలని నా బ్లాగులో పంచుకొంటాను. ఈ లోగా- కొట్నూర్ చెరువు, రాగిముద్ద, హిందూపూర్ వీధి చిత్రం మీ బ్లాగులో పెట్టి నా తీపి జ్ఞాపకాలని ఒక్కసారి గుర్తు తెచ్చినందుకు కృతజ్ఞతలు

భవధీయుడు said...

సార్!హిందూపూర్ పట్ల మీకున్న అభిమానానికి వందనాలు,అనిల్ కుమార్ గారు నాకు మంచిమిత్రులు,ప్రస్తుతం నేను హిందూపురం మునిసిపాలిటిలో టీచర్ గా పని చేస్తున్నాను .అనిల్ స్వల్పకాలం లోనే ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నందుకు మిత్రునిగా గర్విస్తున్నాను.మీబ్లొగ్ గురించి అనిల్ తో తప్పక చెబుతాను .