గ్రహణం మొర్రి - వైద్యసహాయం!

నిన్న ఇక్కడ మాకు చంద్రగ్రహణం. అది చూశాక నేను మీతో చెప్పాలని మరచిపోయిన ఓ మంచి విషయం గుర్తొచ్చింది. కడుపుతో ఉన్న వాళ్లు గ్రహణం రోజు బయట తిరగకూడదని, లేకపోతే పుట్టే పిల్లలకు 'గ్రహణం మొర్రి' వస్తుందని మన పెద్దవాళ్లు అంటూంటారు. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ గ్రహణం మొర్రి అని మనం పిలిచే "క్లెఫ్ట్ లిప్" మరియు "క్లెఫ్ట్ పాలట్" లకు కారణం అయితే అది కాదు. బయటకు ఆ ఒక్కరోజు వెళ్లకుంటే వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదనుకోండి అది వేరే సంగతి.

గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకొనే ఆహారంలో పోషక పదార్థాలు లోపించినా, కొన్ని రకాల విటమిన్లు తగ్గినా ఇలాంటివే కాక వెన్నుపాము దెబ్బతినే అనేక అవకరాలు వస్తాయి. వీటిలో కొన్ని ప్రాణాంతకం కూడా. మరీ ముఖ్యంగా విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, పాలు గర్భంతో ఉన్న మొదటి నెలల్లోనే మొదలుపెట్టాలి. అలాగే 'ఫోలేట్' అన్న విటమిన్ మాత్రలు కూడా తీసుకోవాలి.

ఇలాంటి అవకరాలే కాకుండా ఇంకా దారుణమైన అంగవైకల్యాలు కల ఎంతో మందికి ప్రవాస భారతీయుడైన డా.లిఖిత్ రెడ్డి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి వారికి కొత్త జీవితాన్నిస్తున్నారు. మన హైదరాబాదుకు చెందిన ఈయన అదే నగరానికి చెందిన ప్రొ.శ్రీనివాస గోశల్ రెడ్డి మరియు డా.రాజ్ రెడ్డిలతో కలిసి చేసిన కొన్ని శస్త్రచికిత్సలు మొన్న డిస్కవరీ ఛానల్ వారు ప్రసారం చేస్తే చూశాను. మీరు కూడా చూడాలంటే...(సూచన: కొన్ని చిత్రాలు, వీడియో మీరు చూడలేకపోవచ్చు. కాబట్టి రక్తం చూడ్డానికి ఇబ్బంది పడేవారు చూడకపోవడమే మంచిది) ముఖం సరిగాలేని 'సురేష్ బసగాని'కి చేసిన శస్త్రచికిత్స ఈ లంకెలలో {వీడియో-1, వీడియో-2 }చూడండి. ఈ లంకెలో గ్రహణం మొర్రి మొదలైన వాటి చిత్రాలు చూడొచ్చు.

ఇక వీరు నడుపుతున్న "జి.ఎస్.ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రేనియో ఫేషియల్ సర్జరీ" సైదాబాద్ లో ఉంది. మీకెవరైనా ఇలాంటి అభాగ్యులు తటస్థపడితే ఇక్కడికి పంపండి లేదా చిరునామా/ఫోన్ నెం. ఇస్తే వారే బస్సు వేసుకొని వచ్చి పేదవారికి ఉచిత వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రహణం మొర్రియే కాకుండా ఇంకా అన్ని రకాల ముఖవికృతులకు వీరు వైద్యం చేస్తున్నారు. వీరి ఈ ప్రయత్నం అభినందనీయం!

(చదువరి గారూ...ముక్కు పెరిగిన బాలుడి గురించి తెలిస్తే ఈ సమాచారం వారికందించండి. టు మేక్ ఎ ఢిఫరెన్స్ సభ్యులకు కూడా తెలియజేస్తాను.)

No comments: