చాన్నాళ్ల నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ...ఇంకా బెంగ తీరకున్నా... కనీసం ఇలా అయినా బ్లాగు నీడన సేదదీరుదామని నాకిష్టమైన రెండు చెట్ల కథ చెప్పడానికి వచ్చాను. ఆలకించండి! చెట్టుతో నా పేరుకు రెండు బాదరాయణ సంబంధాలున్నాయి. ఒకటి- 'చెట్టు ఇస్మాయిల్'గా లబ్ధప్రతిష్టుడైన కవిగారి పేరు నా పేరు ఒకటి కావడం. రెండు- 'చింతు' అన్న నా ముద్దుపేరుకు 'చింత' చెట్టుతో ఉన్న చుట్టరికం. అదే కాక చిన్నప్పుడు నన్ను ఏడిపించడానికి అందరూ 'చింతొక్కు', 'చింతకాయ్' వగైరా పదబంధాలతో నాతో ఆడుకోవడం.
నాకిష్టమైన చెట్లలో 'వేప'ది అగ్రస్థానం. మండువేసవిలో, పల్లెపట్టున చల్లని వేపచెట్టునీడన, నవారు మంచం వేసుకొని ఓ కునుకు తీస్తే...అబ్బో ఆ హాయే వేరు. వేపాకు గాలిలోనే ఆ గమ్మత్తు ఉన్నదేమో తెలియదు. కానీ ఇప్పుడు వేపాకునూ పేటెంట్ చేసే రోజులొచ్చేసాయి. మనం గమనిస్తే గ్రామసీమల్లో 'వేపాకు'కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ఉదా. జాతరల్లో, ఆరోగ్య సంబంధ విషయాల్లో. ఇంకా ఊర్లల్ళో పీర్లచావడిగా ఉపయోగపడేది వేపచెట్టే. షిర్డీ సాయి తన జీవితంలో చాలా భాగం వేపచెట్టు కిందే జీవించాడట. ఇక వేప గురించి ప్రస్థావన వచ్చినప్పుడు 'చేదు' గుర్తు రాకమానదు. అలాగే వేమన్న 'తినగ తినగ వేప తియ్యనుండు' కూడా. నా చిన్నప్పుడు మా పిల్లగుంపు అంతా పండిన వేపకాయలు రుచి చూసేవాళ్లం. ఇక వేపపువ్వు లేని 'ఉగాది పచ్చడి' మనం ఊహించలేము. ఏదైతేనేం ఈ ఉగాది కాస్త చేదుగానే మొదలైంది తీయటి తేనె(హనీ) రుచి చూశాక!
ఇక 'చింత' చెట్టుకు చాలా కథ ఉంది. నేను నాలుగవ తరగతిలో అనుకొంటా...ఓ రాత్రి మా అమ్మ ట్యూషన్ అయ్యాక పిల్లలంతా ఒక్కరొక్కరే బయటకు వెళుతున్నారు, మా ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న 'చింత చెట్టు' క్రింద అందరూ గుమిగూడారు. ఆపుకోలేని ఆసక్తితో నేనూ వెళ్లాను. మా అందరిలో పెద్ద కుర్రాడు ఓ చింత బర్ర చేతిలో పట్టుకొని 'అదిగో...అక్కడ తెల్లగా కనిపిస్తూందే అదే దెయ్యం బాగా చూడండి' అని అందరికీ చూపిస్తున్నాడు. నాకేమో పై ప్రాణాలు పైనే పోయాయి...కారణం అక్కడ వాడు చెప్పినట్టే ఓ కొమ్మ మీద తెల్లగా మెల్లగా కదలుతూన్న దెయ్యం కనపడింది...ఇక్కడ కత్తిరిస్తే...ఆ దెబ్బకు పొద్దున కల్లా 102 జ్వరం! ఇప్పటికీ అది తలచుకొంటే ఒక రకమైన గగుర్పాటు కలుగుతుంది. కానీ ఇప్పుడు అనిపించేదేమిటంటే అక్కడ ఏ పాతబట్టనో తగులుకొని ఉంటుంది గాలికి కాస్తా రెపరెపలాడి ఉంటుందని.
చింత చెట్టు నుంచి కాస్త పక్కకెళ్లినట్టు ఉన్నాను కానీ చింత చెట్టుతో ఉన్న అనుబంధమే అదీ. ఇక చింతొక్కు, చింతచిగురు పప్పు...ఆహా అద్భుతం, అమోఘం. మా ఊరి చెఱువు గట్టున ఉన్న చింతచెట్టు కొమ్మలెక్కి ఆడుకొన్న ఆటలు, గురి చూసి కొట్టి రాల్చిన చింతకాయలు, కుప్పలు కుప్పలు పోసి తిని,తిని నోరంతా పొక్కిపోయి పడ్డ బాధలు...అన్నీ గుర్తొస్తాయి. తిన్న తరువాత మిగిలిన చింతగింజలను పగులగొట్టి, అరగదీసి వాటితో ఆడిన పరమపదసోపానపటములు, బారాకట్టలు అన్నీ మధురానుభూతులే. కొమ్మకు ఊయలేసి ఊగిన ఊసులు...అన్నీ తలచుకొంటూంటే అదీ ఈ నవవసంత సమయంలో ఇప్పటికిప్పుడు మళ్లీ బాల్యానికి వెళ్లాలని అనిపిస్తూంది. ఎవరో అన్నట్టు 'నా బాల్యాన్ని నాకిచ్చేయి...నా సమస్తమూ నీకిచ్చేస్తా' (సినారె?). ఇక చివరగా చెట్టు ప్రాముఖ్యాన్ని రెండు ముక్కల్లో చెప్పాలంటే "చెట్టంత కొడుకు" అన్న నానుడి చాలు!
3 comments:
చింతూ గారూ,
చింతాకు పొడ్ ఎంత కమ్మగా వుంటుందో, వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే!
--ప్రసాద్
http://blog.charasala.com
చెట్టుతో నా పేరుకు రెండు బాదరాయణ సంబంధాలున్నాయి.
తెలిసివాడారో తెలీక వాడారో కానీ, చెట్టు మెటఫర్ ని బాగా పండించారు. బాదరాయణ సంబంధమంటే చెట్టుతో వచ్చిన సంబంధం - రేగి చెట్టో ఉసిరి చెట్టో నాకిప్పుడు గుర్తులేదు.
:-)
బదరీఫలమంటే రేగుపండు. మాప్రాంతంలో రేణిగాయ అని వాడుకలో ఉంది. రేణిపండ్లు లేదా రేగ్గాయలు ఇలా.
Post a Comment