విదేశాల్లోని తెలుగు వారికి...(రెండో భాగం)

మొదటి భాగం తరువాయి...

"అయితే-

ప్రజల భాగస్వామ్యంలేని ఏ కృషీ పూర్తిగా విజయవంతం కాదు. ప్రజల తోడ్పాటులేని ఏ కార్యక్రమం ఆశించిన ఫలితాలను ఎప్పుడూ అందివ్వలేదు. ఖండఖండాంతరాలలో ఉన్న మీరందరూ అండదండలిస్తారని, తెలుగుసీమను అభివృద్ధి పథకాలతో ఆదరిస్తారని ఎదురుచూస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

విదేశాలలో మాతృదేశ కీర్తి పతాకాన్ని గగనసీమలో సమున్నతంగా నిలుపుతున్న మేధావులు మీరు. పరాయిసీమలో తెలుగు కీర్తి చంద్రికలను దశదిశలా విస్తరింపజేస్తున్న విజ్ఞానజ్యోతులు మీరు. మీ మీ రంగాలలో, మీ మీ వృత్తులలో నిష్ణాతులై మీకూ, మీ మాతృభూమికీ, కీర్తి ప్రతిష్టలు సముపార్జించిపెడుతున్న విజ్ఞులు మీరు. మీరు మీవెంట తీసుకొని వెళ్లినది మీ విజ్ఞానం, సామర్థ్యం, ప్రతిభావ్యుత్పత్తులు మాత్రమే కాదు- అశేష తెలుగుభాషా సంస్కృతీ, సంప్రదాయాలను; మన జాతి ఔన్నత్యాన్ని; అమూల్య చారిత్రక వారసత్వాన్ని మీ వెంట తీసుకొని వెళ్లారు. మీరు మన సంస్కృతికి నిజమైన రాయబారులు. మీ ఆనందాలకు, మీ విజయాలకు మా హృదయాల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి. మేము మిమ్మల్ని తలచుకొని గర్విస్తున్నాం.

ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక సరికొత్త చైతన్య సాహసయాత్ర ప్రారంభమయింది. రాష్ట్రాన్ని ఫ్యాక్టరీల శంఖారావాలతో, యంత్రచక్రాల నిరంతర పరిభ్రమణంలో చైతన్యమయం చేయడానికి పెద్దయెత్తున కృషి సాగించేటందుకు అంకురార్పణ జరిగింది.

రాష్ట్ర పారిశ్రామికీకరణ దిశగా ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఈ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కావాలి. ఈ కృషిలో సహాయ సహకారాలను అందించడానికి మీరందరూ ముందుకు రావాలి.

పారిశ్రామికీకరణ ద్వారానే లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించగలం. పారిశ్రామికీకరణ ద్వారానే మన శక్తి సామర్థ్యాలను ప్రయోజనకరమైన మార్గంలోకి మళ్లించగలం. పారిశ్రామికీకరణ ద్వారానే ప్రకృతి ప్రసాదించిన అపారవనరులను వినియోగించుకొని అష్టైశ్వర్యాలను సృష్టించుకోగలం. శాంతి పూరితమైన, అభ్యుదయకరమైన , సౌభాగ్య విలసితమైన జాతిని, పటిష్టమైన దేశాన్ని నిర్మించుకోగలం.

మీలో కొంతమంది ఎన్నో ఏళ్ల క్రితం స్వరాష్ట్రాన్ని, స్వదేశాన్ని వదిలి వచ్చి వుండవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతున్నదో ఏమిటో మీకు అంతగా తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి నావారి కోసమే యీ పరిచయం.

సంప్రదాయానికి, ఆధునికతకు మేలి కలయికగా, సుసంపన్నమైన సాంస్కృతిక విలువలకు, అభ్యుదయకరమైన దృక్పథాలకు చక్కని సమ్మేళనంగా అవతరిస్తోంది నేడు ఆంధ్రప్రదేశ్. దక్షిణాది ధాన్యాగారంగా, ఆసేతు హిమాచలానికి అన్నపూర్ణగా అందుకొన్నది అందరి మన్ననలను అత్యుత్తమ స్థాయిలో. ఎరువులు, రసాయన కర్మాగారాలు అవతరిస్తున్నాయి పెద్ద యెత్తున యిక్కడ. ఎలక్ట్రానిక్ కర్మాగారాలు తలెత్తుతున్నాయి- కొత్త రూపంలో, కొంగ్రొత్త రీతుల్లో. పెద్ద ఎత్తున సిమెంటు ఫ్యాక్టరీలు, బ్రహ్మాండమైన థర్మల్, జలవిద్యుత్ ఉత్పాదక కేంద్రాలు రూపొందుతున్నాయి యీ గడ్డమీద. అత్యాధునికమైన భారీ ఉక్కు కర్మాగారం, అవతరిస్తోంది విశాఖలో.

-ఇలాంటివి ఎన్నో...ఎన్నెన్నో...ఇంకెన్నో...మరెన్నో-రాష్ట్రం నలుచెరగులా నవ్యరీతుల్లో రూపాలు దిద్దుకొంటున్నాయి. ఇవన్నీ మన రాష్ట్రం సాదించిన సాంకేతిక విజ్ఞానవ్యాప్తికి సంకేతాలు. ప్రగతికి చిహ్నాలు. మన ఆధునిక దేవాలయాలు. భవిష్యత్ ఆశాసౌధాలు.

పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ సాధించినది ఎంతో ఉన్నా, యింకా సాధించవలసింది మరెంతో ఉంది. విదేశాల్లో వుంటున్న మీరు మీ విజ్ఞాన వెల్లువను, ప్రతిభాసామర్థ్యాలను, మీ వనరులను యిక్కడ మేము చేస్తున్న మా యీ కృషివైపుకు మళ్లించగలరు- మీరు తలచుకొంటే, అనుకొంటే. ప్రపంచంలోని ఉత్తమ సాంకేతిక ప్రతిభను యిక్కడకు తీసుకొనివచ్చి, ప్రగతి పరిధులను విస్తరించి ఆంధ్రప్రదేశ్ ను ఒక పటిష్టమైన, అగ్రగణ్యమైన పారిశ్రామిక శక్తిగా రూపొందించే కృషిలో తోడ్పడవలసిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఆహ్వానిస్తున్నాను.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మీ సంపూర్ణ సహాయ సహాకారాలు లభించగలవని ఆశిస్తున్నాను. అత్యాధునిక పారిశ్రామిక ప్రగతికి ఆహ్వానిస్తున్నాను మిమ్మందరినీ. చిరకాలంగా మనం కంటున్న కలలకు సమీప భవిష్యత్తులో సుస్థిర రూపకల్పన చేసేటందుకై మనమంతా ఒక్కటై చేయి చేయి కలిపి పరిశ్రమిద్దాం, పరిక్రమిద్దాం.

అవిగో! వినిపిస్తున్నాయి
-అలనాటి విజయధ్వానాలు
అవి కావాలి నేటి వైతాళిక గానాలు
అదిగో- ఆశ్వాసిస్తోంది-
అమరకవి గురజాడ కంఠం
'దేశమనెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్!'

ఆరుకోట్ల తెలుగు ప్రజల ఆశీస్సులతో, మీ అందరి అండదండలతో తెలుగునాడును వెలుగునాడుగా తీర్చిదిద్దుకోవాలన్నది నా తీయని కల. ఆ సురుచిర, సుమధుర స్వప్నం తొందరలోనే నిజం చేసుకోగలమన్న ధృఢ విశ్వాసం, ఆశాభావం నాకున్నాయి.

అదిగో- క్రాంతి కల్పవల్లి, తెలుగుతల్లి నా కన్నులముందు కదలాడుతోంది- మిరిమిట్లు గొలిపే కాంతులు వెదజల్లుతూ.

పంటకాలువలతో, పచ్చని పైరులతో, పసిడి పంటలతో పాలు తేనెలు పారే భాగ్యసీమగా పరిమళిస్తోంది. పారిశ్రామిక ప్రగతి పతాకాలతో పరిఢవిల్లుతోంది. సంతృప్తి వెల్లివిరుస్తున్న శ్రామిక, కార్మిక, కర్షకజనాళి జై జై ధ్వానాలతో పరవశిస్తోంది.

అరుగో! పసుపు కుంకుమలతో పచ్చగా నిండుగా వున్న మన ఆడపడుచులు సుమధుర మందహాసాలతో, మంగళారతులతో స్వాగతం చెబుతున్నారు.

నేటి తన ప్రాభవానికి కారకులైన తన ముద్దుబిడ్డల విజ్ఞానాన్ని, మేథాశక్తిని, దేశభక్తిని చూసి మురిసిపోతోంది తెలుగుతల్లి చిరునవ్వులు చిందగా, నిండుగా, పండువగా.

ఇదే ఇదే నేను ఆకాంక్షించే తెలుగుసీమ
ఇదే నేను మీనుండి కోరే సహకారం
ఇదే నా వాంఛితం
ఇదే ఇదే ఇదే నా ధ్యేయం.
లోకసమస్తా సుఖినోభవంతు!
జై తెలుగునాడు - జై హింద్!
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు. మే, 1984.
(ఈ ఉపన్యాసాన్ని యూనీకోడీకరించడంలో నాకు రెండు ప్రాధాన్యాలున్నాయి...ఒకటి- ఆ మహానుభావుడి అప్పటి మాటలు, విదేశాల్లో ఉన్న ఇప్పటి తెలుగువారికి స్ఫూర్తి కలిగించాలని, రెండు- అచ్చమైన తెలుగు భాషలోని సౌందర్యాన్ని, ఆ నుడికారాన్ని మరోసారి గుర్తుంచుకొని మన భాషా పాటవాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుందని. నా తెలుగురాతలో ఏవైనా పంటి కింద రాళ్లుంటే తెలుపగలరు- సవరిస్తాను. చదివినందుకు మీకు నా ధన్యవాదాలు: మీ -డా.ఇస్మాయిల్ పెనుకొండ)

1 comment:

Unknown said...

అద్భుతంగా ఉంది..
దీనిని ఇక్కడ రాసి మంచి పని చేసారు.