గురు - ఓ సమీక్ష!

నిన్ననే మణిరత్నం 'గురు' చూశాను. మొత్తానికి మణిరత్నం సినిమా అనిపించాడు. చూసిన ప్రతి ఒక్కరికీ తెలుసు ఆ గురుభాయ్ ఎవరో, కానీ కథంతా కల్పితం అని ఎందుకు అంటారో? మణిరత్నం ఇలాంటి జీవితచరిత్రలను చిత్రాలుగా తీయడంలో ఘనాపాటి. బొంబాయి డాన్ వరదరాజన్ మొదలియార్ పై 'నాయకుడు' తీసినా, తమిళ రాజకీయాల్లో దిగ్గజాలైన ఎమ్.జి.ఆర్. కరుణానిధిల జీవితాలను ఇతివృత్తంగా తీసుకొని 'ఇద్దరు' తీసినా అతనికతనే సాటి.

ఇక 'గురు' విషయానికొస్తే ఒక సామాన్య మధ్యతరగతి పౌరుడు, ఓ బడిపంతులు కొడుకు భారతదేశపు పారిశ్రామిక ముఖచిత్రాన్నే ఎలా మార్చేశాడో చూపే చిత్రం. కానీ అందుకు పాల్పడ్డ అవినీతి, మేపిన లంచాలు, పోయిన ప్రాణాలు వీటన్నిటి గురించి రేఖామాత్రంగానే చూపించాడు దర్శకుడు. ఒకడు ఎదగాలంటే వంద మందిని తొక్కేయాలి ఇది పెట్టుబడిదారుని సూత్రం (ప్రస్తుతం ఉన్న కొన్ని దేశి సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీలను గమనిస్తే అది బాగా తెలుస్తుంది) . అతని వల్ల బాగుపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నా, అందుకు అతను ఎంచుకొన్న మార్గం స్వచ్ఛమైనది కాదు.ఇందులో అభిషేక్ నటన నాయకుడు లోని కమలహాసన్ ను గుర్తుకు తెస్తుంది కొన్ని సీన్లలో.

ఎన్ని విజయాలు సాధించినా ఆ విజయాలను అందుకొనే క్రమంలో అతను లోనైన ఒత్తిడి అతని ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపింది. చిన్న వయస్సులోనే వచ్చిన పక్షవాతం (రక్తపోటు దీనికి మూలకారణం) ఆరోగ్యం మీద శ్రద్ద లేకపొవడం వల్ల కాదు మానసికంగా నిరంతర ఒత్తిడిలో బ్రతకడం వల్ల అని నేను భావిస్తాను. మనకు ఓ సూక్తి ఉండనే ఉంది: డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పాడైతే కొంత వరకు తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోతే మళ్లీ అది తిరిగిరాదు. ఇది మనకు ఓ గుణపాఠంలా నిలవాలి.

4 comments:

రానారె said...

పక్షవాతానికి నిరంతర మానసిక ఒత్తిడికి మీరు చెప్పిన సంబంధం మానాన్న ఆరోగ్యానికీ వర్తిస్తుంది.

Dr.Pen said...

అయ్యో! ప్రస్తుతం వారి ఆరోగ్యం క్షేమమే కదా?

సత్యసాయి కొవ్వలి Satyasai said...

మేము కూడా మొన్ననే చూసాం. మీరనుకొన్నట్లే మేము కూడా అనుకొన్నాము. గురు చిన్నచితకా మోసాలు చేసాడు, ప్రభుత్వాన్ని, ప్రజల్నీ కూడా. కాని చివరలో ఉద్రేకమైన ఉపన్యాసం ఇప్పించి గురుని హీరోని చేయడానికి ప్రయత్నించాడు మణిరత్నం. ఖాళీ డబ్బాలనీ సరుకున్నట్లు చూపించి ఎక్స్పోర్ట్ చేసినట్లు లెక్కలు చూపించడం, అనుమతించబడిన కెపాసిటీని మించి ఫేక్టరీని స్తాపించడం వగైరాలు చీటింగ్ కిందకే వస్తాయి. కాని మన ప్రభుత్వ(రాజకీయ) విధానాలు, వాటిని గుడ్డిగా అమలుచేస్తోన్న తీరుతో ప్రజల్ని వేధించే ఆఫీసర్లు, ఉద్యోగులు కూడా 'గురు'ల్లాంటి కార్యశూరులతో పాటు నేరస్థులే. నీతిగా వ్యాపారం చేద్దామన్నా కుదరనివ్వరు.

రానారె said...

అడిగినందుకు ధన్యవాదాలు. గురు లాగే మా నాన్నకూడా ధైర్యాన్నికోల్పోని మనిషి. దాదాపు పూర్తిగానే కోలుకున్నాడు. నిన్న చూశానీసినిమాని. ఒక మధ్యతరగతి మామూలు మనిషి వ్యాపారంలోకి దిగే అవకాశాల్లేకుండా మూసుకుపోయిన తలుపులను తనదైన శైలిలో తెరిచి దూసుకెళ్లి ధైర్యంగా దాన్ని సమర్థించుకొనే కార్యశూరునిగా ఆవ్యక్తి న్యాయస్థానాన్ని అడిగే ప్రశ్నలు ఆలోచించదగినవి. అప్పడే అయిపోయిందా అనిపించే కథనం చాలా అరుదైనది.