విదేశాల్లోని తెలుగు వారికి...

"సుదూర సాగర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతీ దీపికలు వెలిగించి మాతృభూమికి ఖ్యాతి ఆర్జించుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు ఆరుకోట్ల తెలుగు ప్రజల పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన, నా పక్షాన యివే నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, నమస్సుమాంజలులు.

మీ మీ శేముషీ ప్రాభవంతో, సాంకేతిక విజ్ఞానంతో, వైద్యశాస్త్ర ప్రావీణ్యంతో, వివిధ విషయ పరిజ్ఞానంతో వివిధ దేశాలలో ఉన్నత పదవుల నలంకరించి, భగవంతుని అనుగ్రహం వల్ల లబ్ధ ప్రతిష్టులైన తెలుగు తల్లి గర్భశుక్తి ముక్తాఫలాలు మీరు. మీ కర్తవ్యదీక్ష, కార్యదక్షత, నీతి, నిజాయితి, సంస్కారం, సహృదయత మీకు అక్కడి ప్రజలలో ప్రేమానురాగపూరిత గౌరవస్థానాలను ఆర్జించిపెట్టాయి- శాశ్వతంగా. మీతో పాటు మీ మాతృభూమికి కూడా వన్నెతెచ్చాయి- సమధికంగా.

'ఏ దేశమేగినా ఎందు కాలిడినా'- ప్రభోదకవి రాయప్రోలు చెప్పినట్టు- తల్లినేలను మరువని మనీషులు మీరని నాకు తెలుసు. మరువ సాధ్యమా తెలుగు తల్లిని?

ఏనాటిదీ తెలుగు తేజం?

శాతవాహనులనాడే అలల తలదన్ని చెలగింది తెలుగు శౌర్యం. కాకతీయుల కరవాలాల కణకణలు దిగ్దిగంతాల ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి- 'విన నేర్చిన మనసుంటే వినవోయి తెలుగు బిడ్డా'- అంటూ.

విజయనగర రాజవీధులలో రతనాలు రాసులుపోసి వ్యాపారం సాగించారట బేహారులు నాడు.

'గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెనుఁగువారికి' ఆదికావ్యాన్ని అందించాలని అంధ్రమహాభారత సంహితారచన బంధురుడయ్యాడు ఆదికవి నన్నయ్య ఆనాడు.

ఆ మహనీయుడారంభించిన బృహత్ప్రయత్నానికి సాఫల్యంసాధిస్తూ మహాభారతాన్ని రాజనీతి శాస్త్రంగా, నవరస మధు మందాకినిగా మలచాడు కవిబ్రహ్మ తిక్కన్న.

'కాటుక కంటినీరు చనుకట్టు బయింబడ ఏల ఏడ్చెదో కైటబదైత్య మర్దమని గాదిలి కోడల!' కాసుకోసం కక్కుర్తిపడి నిన్ను కీచకుల కమ్ముకోనని బాసచేసి, కావ్య సరస్వతి నోదార్చి, భగవదర్పితంగా మహాభాగవతాన్ని రచించాడు భక్తపోతన.

'తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగువల్లభుండ, తెలుగొకండ, ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స' అని శ్రీకృష్ణదేవరాయలతో సెలవిచ్చాడు సాక్షాత్తూ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఏనాడో. ఆ రసమయ స్వాప్నిక ప్రసాదంగా అవతరించింది అపూర్వ రసబంధుర మహాంధ్రకావ్యం అముక్తమాల్యద.

ఆటవెలదుల రోసి, ఆశుకవితల దూసి అలవోకగా జీవితసత్యాల నందించాడు ఆటవెలదులతో తేట తెలుగులో అలనాడు వేమన్న.

-అట్టి మహత్తర సాహితీ సంపదకు మనం వారసులం. ఆ మహా సారస్వత సంప్రదాయాలను ఎలా మరువగలం?

త్యాగయ్య సుమధుర సంగీతలయవీచికా రవళులు-

క్షేత్రయ్య సులలిత మొవ్వగోపాల శృంగార భక్తిమయ జావళీలు-

అభినవ నటరాజు సిద్ధేంద్రుని అంగాంగ భంగిమానంద లాస్యాలు, మంజుల మంజీర విలాస్యాలు-

అమరావతీ, లేపాక్షీ, రామప్ప దేవాలయాల అద్భుత శిల్పవిలాసాలు-

అజంతా గుహలలో అపురూప రీతిలో తెలుగు చిత్రకారుల తూలికా విన్యాసాలు-పుణికి పుచ్చుకొని పునీతమైన జీవగడ్డ మనది.

'కోహం" అన్న జిజ్ఞాసతో ప్రారంభించి, 'తత్వమసి' అన్న ఎరుకమ సంపాదించి, 'అహం బ్రహ్మస్మి' అన్న స్థాయికి ఎదిగిన ఆధ్యాత్మిక భావ సంపద మనది. 'తొలగు తొలగు ఛండాలుడా!' అన్న అహంకారాన్ని నిలవేసి 'తొలగవలసింది ఎవరు? అనిత్యమైన దేహమా, అనశ్వరమైన ఆత్మయా? - అని ప్రశ్నించిన జ్ఞానం సమాధాన మిచ్చింది- చండాలోస్తు సతుర్ద్విజోస్తు గురిరిత్యేషా మనీషా మమ:- అని ఆదిశంకర భగవత్పాదుల అమరవాక్కులతో.

జ్ఞానసాక్షాత్కారాన్నందుకొన్న తథాగతుని ఆశ్రయించారు 'బుద్ధం శరణం గచ్ఛామి'- అని. ఆయన బోధలతో తెలివి తెచ్చుకొని స్వార్థాన్నిజయించి సామాజిక దృష్టి నలవరచుకొన్నది 'సంఘం శరణం గచ్ఛామి'- అని. 'మానవసేవయే మాధవసేవ' యని చాటిన మహోన్నత మానవతా వాదం మనది. విశ్వజనీనమైన, విస్ఫారితమైన, విశాల సమతా భావపూరితమైన నిండుమనసు మనది. కనుకనే 'త్రైలోక్యం మంగళం కురు' అంటూ భక్తి భావనలో భగవంతుని ఆమంత్రించారు మనవారు.

'చిట్టి నాబొజ్జకు శ్రీరామరక్ష' అన్న సంకుచిత దృష్టితో సరిపెట్టుకోక సర్వమానవ సంక్షేమాన్ని ఆకాంక్షించారు. ఈ మతమైనా, ఏ ఇజమైనా పురోగమించాల్సింది ఆసమతావాదంవైపే, ఆ మమతావాదం వైపే.

మన సమతావాదం మిథ్యా నినాదంగా మిగిలపోలేదు. ఇంటింటా, వూరూరా కుటీర పరిశ్రమలతో, హస్త కళాకారుల నైపుణ్య దీప్తులతో వెలుగులు చిమ్మింది. అగ్గిపెట్టెలో చీరను అమర్చి ఐరోపాకు ఎగుమతి చేసిన అలనాటి అపూర్వ కళాకౌశలం మనది. ఖండ ఖండాలలో అఖండ వాణిజ్య సంబంధాలను నెలకొల్పిన ఐశ్వర్య విలసితమైన శోభా నిలయం మనది.

అదంతా గత చరిత్ర.

మరువలేని, మరపురాని తీయనిగాథ.

ఆ మహోజ్వల వైభవాన్ని మరల చూడగలుగుతున్నాం- మీ అందరి విజయసాధనలో.

- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు. మే, 1984.
(ఇంకా ఉంది...రెండో భాగం కోసం వేచి చూడండి)

2 comments:

వెంకట రమణ said...

ఈ ప్రసంగ పాఠం చాలా బాగుంది. దీన్ని అన్నగారి మాటల్లో ఊహించుకుంటే,ఆడియో వర్షనుకూడా ఉంటే ఇంకా బాగుండుననిపిస్తుంది. రెండోభాగం కోసం ఎదురు చూస్తుంటాను.

కనకాంబరం said...

We lokking for Second part n Audio if available .Thanks for sharing. ..Nutakki Raghavendra Rao.