ఇదిగో ఇదే నేనన్న ఆ కారణం. గత నాలుగు రోజులుగా ఛాతీలో కొద్దిగా నొప్పిగా ఉంటే ఏమవుతుందిలే అని ఊరకున్నాను. కానీ ఇంట్లో వదిలితే కదా! అలా 'అత్యవసర చికిత్సా కేంద్రాని'కెళితే అన్ని పరీక్షలు చేయడానికి రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉంచుకొన్నారు. అదృష్టవశాత్తూ కొద్దిగా 'కొలెస్టరాల్' ఎక్కువగా ఉండడం (శుభ్రంగా నెయ్యి వేసుకొని లాగిస్తూంటే ఎందుకు ఉండదు:-) తప్పించి ఏ రుగ్మతా కనిపించలేదు. అందువల్లే ఈ చిన్న విరామం.
'వైద్యుడే రోగి అయితే...' మీద చాంతాడంత వ్యాసం రాయొచ్చు! కానీ టూకీగా చెప్పాలంటే ఇదొక విభిన్న అనుభవం. చంద్రుని గురించి తెలియాలంటే చంద్రమండలానికే పోనక్కర్లేదు...కానీ ఓ వైద్యుడిగా రోగి పడే బాధను సహానుభూతి చెందాలంటే (ఎంపతైజ్) రోగి పాత్రలో పరకాయప్రవేశం చేయాలి. కానీ అస్వస్థతనొంది వైద్యశాలలో చేరిన ఈ అనుభవం నాకు ఎన్నో పాఠాలు నేర్పడమే కాక... గతంలో నేను నేర్చుకొన్న, నేను ఆచరించిన కొన్ని పద్ధతుల్ని బలపరచేలా చేసింది. మనకెంత తెలిసినా ఆస్పత్రి మంచం మీద ఉన్నప్పుడు మనలో కలిగే ఆ భావతీవ్రత, భావసంచలనం, నిస్సహాయత అన్నిటి గురించి వైద్యుడనే వాడికి అవగాహన ఉండాలి.
ఈ మొత్తం సంఘటనలో నాకు ఇ.సి.జి. తీస్తున్న ఆమె నా చెయ్యి పట్టుకొని 'యూ విల్ బి ఆల్ రైట్' అన్న రెండు మాటలు నాకు ఎంతో భరోసానిచ్చాయి. ఒక చిన్న స్పర్శ అస్వస్థతతో కూడిన వాడికి గుండెనిబ్బరాన్ని ఇస్తుంది. మన మున్నాభాయ్/శంకర్ దాదా చెప్పిన సూత్రమిదే. శాస్త్ర సాంకేతిక పరీక్షలు చాలా వరకు ఉపయోగపడినా ఈ మానవ సంస్పర్శ (హ్యూమన్ టచ్) లేని వైద్యం ఆత్మ లేని ప్రాణం వంటిది. కానీ మరీ ఎక్కువగా ఆలోచించినా కష్టమే... మనం నిర్వర్తించాల్సిన పనికి నూటికి నూరుపాళ్లూ న్యాయం చెయ్యలేము. అందుకే ఈ రెంటి మధ్యనున్న సన్నటి గీతని దాటకుండా మసలుకుంటేనే మంచి డాక్టరుగా పేరొచ్చేది. నేను ఇంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రులలో పల్లెల్లో, చిన్న పట్టణాల్లో పని చేసేటప్పుడు నాకు ఇవన్నీ అనుభవైక వేద్యం.
ఇక నేను మీతో చెప్పాలనుకొన్న సంగతి కొస్తాను. 'గుండెపోటు' ఈ మాటలు వినగానే ఎన్నెన్నో ఆలోచనలు మన మనస్సులో ముప్పిరిగొంటాయి. నాకైతే చిన్నప్పుడు ఈ మాటలు వినగానే సినిమాలలో కనిపించే 'టెలిగ్రాము' , గుండె పట్టుకొని కిందకు పడిపోయే 'క్యారక్టర్ ఆర్టిస్టులు' గుర్తుకు వచ్చేవారు. నేను గమనించింది ఏమిటంటే చాలా మంది గుండెలయ తప్పడాన్ని(అరిథ్మియా), గుండెపని చేయకపోవడాన్ని (హార్ట్ ఫెయిల్యూర్), గుండెపోటును (హార్ట్ అటాక్) ఒకే గాటన కట్టి అన్నిటినీ గుండెపోటనే పిలవడం కద్దు. కానీ ఇవన్నీ వేరు వేరు, ఇవన్నీ కాక పుట్టుకతో వచ్చిన 'ఆగర్భ రోగాలు' (కంజెనిటల్ హార్ట్ డిసీజెస్) కొన్ని.
ఇక మనం సాధారణంగా చూసే గుండెపోటు విషయాని కొద్దాము. ఇది నిజానికి హృదయధమనికి (కరొనరీ ఆర్టరీ) కి సంబంధించిన జబ్బు. మనం తినే ఆహారంలో కొవ్వు పదార్థాలలోని కొలస్టెరాల్, వయస్సు రీత్యా రక్తనాళాల్లో జరిగే మార్పులు, ఇంకా కొన్ని రకాల కణాలు వాటి గోడల మీద పేరుకొని, వాటి కుహరాన్ని తగ్గిస్తాయి. అంతేకాక అలా పేరుకొని పోయిన ఈ కొవ్వు దిబ్బ చిన్నపాటి పగులిచ్చినా వెన్వెంటనే రక్తంలోని బింబాణువులు(ప్లేట్లెట్స్) గుమిగూడి రక్తం గడ్డ కట్టేలా చేస్తాయి. తద్వారా గుండె కణజాలానికి అందించే రక్తము, దానిలో ప్రవహించే ఆమ్లజని(ఆక్సిజన్) సరఫరా తగ్గి గుండె లోని కండరకణజాలం మృతి చెందుతుంది. అప్పుడు ఏ భాగం ఇలా మృతిచెందుతుందో ఆ భాగం పనిచేయదు.కాబట్టి గుండె లయ తప్పడంకానీ, పూర్తిగా పనిచేయక పోవడం కానీ జరుగుతుంది. వీటికి అలా గుండెపోటు ఓ కారణం కానీ ఇవన్నీ ఒకటే కాదు. ఇక్కడ ఈ బొమ్మల చిత్రాన్ని తప్పక చూడండి.
అలా మృతి చెందిన కణజాలం వల్ల మనకు గుండెనొప్పి అంటే ఛాతీలో నొప్పి, ఛాతీ నుంచి చెయ్యి వరకు లేదా మెడ నుంచి దవడ వరకు పాకే నొప్పి, ఆయాసం ఇలాంటి లక్షణాలు కనబడతాయి. వెంటనే గుండెనాళం/హృదయ ధమనిలోని ఆ రక్తపుగడ్డను కొన్ని రకాల పరీక్షల ద్వారా గుర్తించి, మందుల ద్వారా కరిగించి లేదా యాంజీయోగ్రఫీ ద్వారా గుర్తించి తీసివేస్తేనే ప్రాణం నిలబడుతుంది. ఇదంతా ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అందుకే మా వైద్య పరిభాషలో 'టైమ్ ఈజ్ మజిల్' (సమయం=కండరం) అంటారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం పొందడం శ్రేయస్కరం.
కొన్ని పరీక్షల వివరాలు: రక్త పరీక్షలు- చనిపోతున్నగుండె కండరం నుంచి రక్తంలో కలిసిన కొన్ని రకాల అజాలను(ఎంజైమ్) కనుక్కోవడం ద్వారా, ఇ.సి.జి- గుండెలోని విద్యుత్తు వహనాన్ని కొలిచే సాధనం, ఎకోకార్డియోగ్రఫీ- అతిధ్వని శబ్దతరంగాల ద్వారా మన గుండె పనితీరుని, పరిమాణాన్ని కొలిచే పరీక్ష, థాలియం స్ట్రెస్ టెస్ట్- థాలియం అన్న రేడియోధార్మిక పదార్థాన్ని సూదిమందులా ఎక్కించి, ట్రెడ్ మిల్ పై పరుగెత్తించి, అటుపై సి.టి.స్కాన్ ద్వారా గుండెలోని కండరాలలో చేరే ఈ పదార్థాన్ని కనిపెట్టడం ద్వారా హృదయధమనుల్లో(కరొనరీ ఆర్టరీస్) అడ్డంకులు ఉన్నాయేమో తెలుసుకోవడం, యాంజియోగ్రఫీ మరియు క్యాథటరైజేషన్- సన్నటి తీగ/గొట్టాన్ని కటి ప్రదేశంలోని సిరల ద్వారా గుండె వరకు ఎక్కించి అక్కడ మళ్లీ హృదయధమనిళ లోనికి ఒక రకం మందును(కాంట్రాస్ట్) పంపి వాటిలో ఏవైనా అడ్డంకులు ఉన్నాయేమో కనుక్కొంటారు, వీలైతే ఒక జల్లెడ లాంటి పరికరం ద్వారా ఆ రక్తపుగడ్డను అప్పటికప్పుడు తీసివేస్తారు, యాంజియోప్లాస్టీ- అంతా పైలాగే చేసి ఆ ప్రదేశంలో చిన్న బుడగ లాంటి దానిని ఉబ్బించి అక్కడ కొంచెం చదునుగా చేసి వీలైతే 'స్టెంట్' అనబడే ఒక సాధనాన్ని(మళ్లీ ఇలా జరుగకుండా) ఉంచుతారు.
ఇక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కొస్తే మొట్టమొదట చేయాల్సింది పొగ త్రాగడం మానేయడం. (మరుజన్మలో దున్నపోతుగా పుడతానేమోనని నేను అప్పుడెప్పుడో కొన్ని సార్లు గుప్పు గుప్పుమని పొగ వదలడం జరిగింది;-) అలాగే మద్యపానం మానేయాలి లేదా కేవలం వైన్ తీసుకొనే వారు పరిమాణాన్ని తగ్గించి తీసుకోవచ్చు (అప్పుడప్పుడూ తీర్థం పుచ్చుకొన్నా ఇప్పుడు పూర్తిగా మానేసి ఒకటిన్నర సం. అయ్యింది). ఎర్రటి ద్రాక్షాసవంలో(రెడ్ వైన్) లో ఉండే 'రెస్వరెట్రాల్' గుండెకు మంచి చేస్తుందని కొన్ని పరిశోధనలు చెప్పినా పీకల దాకా రకరకాల మందులు కొట్టే మందుబాబులకు ఇది శుభవార్తేమీ కాదు.ఇక తిండి విషయాల్లో జాగ్రత్త తీసుకొంటూ కొవ్వు పదార్థాలను తగ్గించి ఆకుకూరలు,పప్పుదినుసులు బాగా తీసుకోవాలి. అన్నిటికన్నా రోజూ కొద్ది నిముషాల పాటైనా వ్యాయామం అత్యవసరం.
(మొన్న తేనెగూడు వ్యవస్థాపకుల్లో ఒకరైన 'శ్రీ కళ్యాణ్' గారు 32 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో అకాలమరణం చెందడం చదివాక, అంతర్జాలంలో ఈ గుండెపోటు మీద కొన్ని తప్పుడు ఈ-లేఖలు చూశాక, ఇక్కడ దీని గురించి ఓ చిన్న వ్యాసం రాద్దామని అనుకొన్నాను. ఇంతలో కాకతాళీయంగా ఈ సంఘటన. అందుకే ఇక ఆలస్యం వలదని ఈ జాబు మీకందరికీ...అంకితం కళ్యాణ్ గారికి. ఈ సందర్బంగా వారి కుటుంబసభ్యులకు మరోసారి నా ప్రగాఢ సంతాపం.)
11 comments:
చింతూ కెందుకు చింత.
మంచి వ్యాసము అందించినందుకు అభినందనలు.
ఇలాటి సందర్బాలకోసం ICE నంబెర్ (In Case of Emergency anna perutO) మీ సెల్లో తప్పక పెట్టుకోండి.
మంచి వ్యాసం అందించారు.అంతా మంచిగానే జరిగినందుకు ఆనందం గా వుంది.
పోన్లెండి మీరు బాగున్నారు.
ఈ అనుభవాన్ని అందరితో పంచుకుని మమ్మల్ని educate చెయ్యటానికి ప్రయత్నించినందుకు 3థంక్స్
మంచి సమాచారమిచ్చారు. థాంక్ యూ.
ముప్పైల్లో పడ్డాం కదా, మా బోటి వారిక జాగ్రత్తగా ఉండాల్సిందే.
డాక్టరు అందునా మీరు పేషెంటైతే అస్సలు బావుండదు. మీరు బానే చెప్తారు. ఇంట్లోవాళ్ళు ఎంత కంగారు పడ్డారో మీకు తెలిదా. జాగ్రత్తగా ఉండండి.ఇంత మంచి సమచారం అందించినందుకు సంతోషం. కాని సంధర్భం బాలేదు.
బాబూ ఎందుకయినా మంచిది కొద్దిగా కొవ్వు పదార్థాలు తగ్గించకూడదూ ?
హహ డాక్టర్ కే నీతులు చెబుతున్నానుకొకండి. :)
నాకెందుకో ఈ వ్యాసం చదవగానే వన్ను లొంచి వణుకు పుట్టుకొచ్చింది. ఎందుకొచ్చిన బాదరబందీ.. సుబ్బరంగా ఎక్సర్సైజులు గట్రా చేసి fitness పెంచుకోండి.
మంచి వ్యాసం అందించారు. మీరే బ్లాగరుల ఆస్థాన వైద్యులు!
ఈ కొలెస్టరాల్ నన్నూ భయపెడుతోంది. సాధారణంగా భారతీయులందరిలో ఇది ఎక్కువగా వుంటుందట నిజమేనా? (నెయ్యి, వేయించిన పదార్థాలు తినేది మనమే కదా!)
--ప్రసాద్
http://blog.charasala.com
"గతంలో నేను నేర్చుకొన్న, నేను ఆచరించిన కొన్ని పద్ధతుల్ని బలపరచేలా చేసింది." మీరు మహ మంచి డాక్టరు! :) గుండెజబ్బుల గురించి మంచి సమచారం అందించారు. థ్యాంక్యూ డాక్టర్!
అరే నేను మొన్నే డాక్టరుని దర్శించొచ్చా..ఆ డాక్టరు నీకు కొలెస్టరాల్ చాలా ఎక్కువుంది..గుండె జబ్బు వచ్చే అవకాశాలు మెండు అని తెగ భయపెట్టేశాడు..అంతే ఇక కాశీలో తర్పణం చెయ్యలేక..మిన్నియాపోలిస్ లోని మిసిసిపీలో నాకున్న డొనట్లు తెగ మేసే అలవాటును తర్పణం చేశా..సంపూర్ణ పాలు తాగేవాన్ని..సోయా పాలు తాగాల్సొస్తుంది..గోధుమ బ్రెడ్డు కాస్తా..రై బ్రెడ్డాయె..ఇక జన్మలో గుడ్డు సొనలు తినే అవకాశం లేదనుకుంటా..హథవిధీ
శంకర్,రాధిక,స్వాతి,దిల్,త్రివిక్రం గార్లకు...
మీ శుభ భావనలకు కృతజ్ఞతలు.
జ్యోతి గారు...
అవును మీరు చెప్పింది కూడా నిజమే కదా!ఇక సందర్భం కాకున్నా ముందే రాయాలనుకొన్నాను ఇలా రాయాల్సివచ్చింది.
ప్రవీణ్ గారు...
అప్పుడే అదీ మొదలుపెట్టేసాను.
స్పందన,రవి గారూ...
నిజమే మనం వాడే నెయ్యిలో సాట్యురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి.అదేకాక మన భారతీయుల శరీరతత్వం కూడా కారణం.కొవ్వు ఉన్న పదార్థాలే కాకుండా మనం తినే అన్నం వగైరా కార్బోహైడ్రేట్లు కూడా కొవ్వుగా శరీరంలో మారుతుంది.తరతరాలుగా మన పూర్వీకులు కరువు కాటకాలను తట్టుకొని బ్రతికి బయటపడినప్పుడు మన జన్యువులు ఆహారాన్ని దాచుకొనే విధంగా మారాయి.అలాంటి ఎన్నో కారణాలు 'మెటబాలిక్ సిండ్రోమ్'గా నేడు పిలవబడుతున్న మధుమేహం(డయాబెటీస్),అథెరోస్క్లీరోసిస్(రక్తనాళాల్లో కొవ్వు చేరడం) వగైరా రుగ్మతలకు కారణం అవుతోంది.అన్నిటికీ ముఖ్యమైన మందు ('ఎక్సర్సైజ్')వ్యాయామం ...కనీసం కొంతదూరమైనా నడక మొదలుపెట్టాలి!
కలకాలం మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
---------
డాక్టరు గారూ మీ సూచనలకు నాదో చేర్పు..
"బుర్రకు తోచిన దాన్ని బ్లాగులో పెట్టెయ్యండి, గుండె కులాసాగా ఉంటుంది. బ్లాగు రాసేదాకా, గుండె గొంతుకలోన కొట్టాడుతాది."
Post a Comment