'రానారె' తో ముచ్చట్లు!

మొన్న నా ఇంటర్వ్యూలలో భాగంగా టెక్సాస్ కు మూడు సార్లు వెళ్లాను. కానీ ప్రతి సారీ మన తోటి తెలుగు బ్లాగరయిన 'కాదరయ్య'ను అదే మన 'రానారె' ను కలవాలనుకొంటూనే ఉన్నాను. మొదటి రెండు సార్లు కుదిరింది కాదు, ఇలా కాదని ఈసారి వయా హ్యూస్టన్ వెళ్లాను. అలా మూడోసారి ముచ్చటగా కలిసి ముచ్చట్లు చెప్పుకొనే అవకాశం దొరికింది.

ఠంచనుగా అనుకొన్న సమయానికే కలుసుకొన్నాం ఇద్దరం. అన్నట్టు మీరెవరైనా ఆర్కుట్ లో రానారె ఫోటోలు చూసిఉంటే (మా మరో మిత్రుడన్నట్లు తన బ్లాగులోని కళ్లల్లో 'అమాయకత్వాన్ని' ఎలానూ చూసి ఉంటారు) మీకో సంగతి చెప్పాలి. ఫోటోలో కంటే అందంగా ఉన్నాడు. పెళ్లీడు కొచ్చిన అమ్మాయిలూ ఒక్కసారి మీ చెవులు రిక్కించి వినండి...ఈ యువకుడు యుక్తవయస్సు కొచ్చాడు ('ది మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ ఇన్ ది టౌన్' అని దీనర్థం.)

ఇప్పటివరకూ పెళ్లిపత్రికలే మన బ్లాగుల్లో చూస్తున్నాం (చూ.అనిల్ చీమలమర్రి) ఇకపై పెళ్లిచూపులు కూడా బ్లాగుల్లో జరుగుతాయేమో;-) ఏదేమైనా తనివితీరా మాట్లాడుకొన్నాం... ఎంతదాకా అంటే నేనెక్కాల్సిన విమానం ఎగిరిపోయేదాకా! నాకది తెలిసే సరికి అప్పటికే రానారె తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. ఇక ఏం చేస్తాం అంటూ ఒక పుస్తకాల షాపులో కూలబడి ఆవురావురుమని తినడం మొదలుపెట్టాను పొత్తాలని. చిత్రం ఏమిటంటే తను కూడా దారితప్పి గంట ఆలస్యంగా చేరాడట తన నెలవుకి. నేనేమో ఆరు గంటలు ఆలస్యంగా చేరాను కొలువుకి.

సి.బి.రావు గారూ మీరేనా తెలుగు బ్లాగర్ల చిత్రాలు పెట్టేది? సముద్రానికీవల మేము సైతం అంటూ పెడదామనుకొని వీరలెవల్లో కెమెరా తీసుకెళితే...అక్కడికీ రానారె గుర్తు కూడా చేసాడు, కానీ ఏది మాటల ఊసుల్లో పడి అదీ మరచిపోయాను...ప్చ్! మొత్తానికి ఎలాగో 'ఒడెస్సా' చేరాను. కింద చూస్తే అంతా ఎడారే, కనుచూపు మేరా నలుచదరంగా చిన్న చిన్న మట్టిరోడ్లు మధ్యలో ఆయిల్ పంపులు. పైపొచ్చు భూషయ్య సొంత ఊరట (పుట్టిన ఊరు కాదు) పక్కనున్న మిడ్-ల్యాండ్.

మొత్తానికి బాగానే చేశాను ఇంటర్వ్యూ. నా రెసిడెన్సీ (ఎం.డి.) ప్రస్థానంలో ఇదే చివరి మజిలీ. ఫలితాలు తేలేది మార్చి 15న, అప్పటి వరకూ వేచి చూస్తూ ఇదిగో ఇలా...అన్నట్టు చెప్పడం మరిచానండోయ్! నా ఈ 'శ్రీ కృష్ణదేవరాయలు'ని బ్లాగర్ల పోటీలో నామినీగా ఎన్నుకొన్నందుకు మీకు, ఆ నిర్ణేతలకు నా కృతజ్ఞతలు. పక్కనే చూశారుగా 'మీ ఓటు నాకే' అనే లంకె ఎలా మెరిసిపోతోందో...ఇంకెందుకింక ఆలస్యం ఆ లంకె మీద నొక్కండి, మీ ఓటును వేయండి!

7 comments:

Nagaraju Pappu said...

సదాస్మైల్ గారూ,
ఇప్పుడిప్పుడే మీ బ్లాగులో అడుగుపెట్టేను .. పెట్టగానే కాలుజారింది, తాజా జాబుల చివరదాకా వచ్చేవరకూ జారటం ఆగలేదు. పాత టపాల ఆసరాతో లేచి నిలబడదాం అనుకొన్నాగాని, పాత టపాల లంకె కనిపించడంలేదు.
--నాగరాజు

Sudhakar said...

e-telugu సంఘ సమావేశాలు కూడా ఇలానే జరుగుతున్నాయి. మొన్నటి సమావేశంలో మూడు గంటలు మాట్లాడుకున్నాక వెళ్దామని లేస్తుంటే "అప్పుడేనా" అని ఎవరో అన్నారు :-)

అంటే సాధారణంగా మేము నాలుగయిదు గంటలు హాయిగా బగ్స్ బన్నీ క్యారట్లు తిన్నట్లు లాగించేస్తాము...అనుకోండి :-)

Unknown said...

మీరు ఇలా కలుసుకోవడం బాగుంది. ఫోటోలు తీస్తే మరీ బాగుండేది. ఆ "most handsome bachelor" ని చూసే అదృష్టం లేక పోయింది :(

రాధిక said...

ఇక్కడ కూడా సమావేశాలు జరుగుతున్నయని వినగానే చాలా ఆనందం అనిపించింది.కలుసుకున్నాము,మాట్లాడుకున్నాము అని చెప్పితే సరిపోదు.ఆ విశేషాలు మాతో పంచుకోండి.ఈ సారి మాత్రం ఫొటోలు తీసుకోవడం మరిచిపోవద్దు.

Anonymous said...

మీరు మావూరెప్పుడొస్తారు? మేయో క్లినిక్లో ప్రయత్నించట్లేదా?

Dr.Pen said...

గురువు గారూ...

మహద్భాగ్యం! పాత టపాల లంకె ఎందుకు కనిపించడం లేదంటే...కూడలిలో కానీ,తేనెగూడులో కానీ ఆ రోజు టపా మాత్రం వస్తుంది. అందులో పాత జాబుల విభాగం కనిపించడం లేదు. అందుకే బ్లాగు చివర ఇలా పెట్టాను చూడండి..."మరిన్ని విశేషాలకై 'శ్రీకృష్ణదేవరాయలు' అన్న బ్లాగు మకుటం పై నొక్కి అప్పుడు కనబడే 'పాత జాబులు' విభాగంలో చూడండి!"

సుధాకర్ గారూ...

అవునవును... ప్రయత్నిస్తే సంవత్సరానికి ఒకసారైనా అమెరికా తెలుగు బ్లాగర్లు కలవొచ్చు! మీకేం ప్రతి నెలా హాయిగా మాట్లాడుకొంటున్నారు.

ప్రవీణ్ & రాధికగారూ...

అవును మిస్ అయ్యాను.ఈ సారి తప్పకుండా పట్టి చూపుస్తాను:-)

వైజాసత్య గారూ...

డిమాయిన్స్ దాకా వచ్చాను.అక్కడా మెర్సీమేయో అని మేయో వారి సమర్పించు ప్రోగ్రామే! ఈ సారి తప్పకుండా వస్తాను అటువేపొస్తే.మీరు ఎప్పుడైనా ఇటొస్తే మా ఇంటికి రండి!

రానారె said...

డాక్టర్ గారూ, మీరు నన్ను క్షమించాలి. నా గురించి మంచిగా చెబుతూ మీరు బ్లాగు రాస్తే అది నేనింత వరకూ చూడకపోగా, అదేదో ప్రైవేటు విషయమైనట్లు నేను ఎవ్వరితోనూ ఇంతవరకూ చెప్పలేదు, మా నాన్నతోనూ నా స్నేహితుడితోనూ తప్ప. మీ అభిమానానికి శతధా కృతజ్ఞతలు. మనోడు అనిపిస్తే చిన్నచిన్న లోపాలు కనపడవు కదా!