సుడిగాలికి వణికిన చిగురుటాకు!

మన తెలుగు బ్లాగుల్లోకి ఒక కొత్త కెరటం ఉవ్వెత్తున ఎగసి పడింది. మన మెదళ్లలో పేరుకు పోయిన చెత్తని చెల్లాచెదురు చేసి క్రొంగొత్త మెఱుపు తెచ్చింది. మీరు ఇప్పటికీ చదవకపోతే నాగరాజు గారి సాలభంజికలలో మొదటి నాలుగు మెట్లని జారకుండా ఎక్కండి. అందులోని భావ-జ్ఞాన-రసాస్వాదనలో మునిగి తేలండి.

ఈ వ్యాసాలు ఆఫీసులో కూర్చొని తొందర తొందరగా చదవడం కాకుండా, ఏ వారాంతమో...చల్లని సాయంత్రాన... ఏకాంతంగా... (కాంతతో కాకుండా :-) అని అర్థం చేసుకోవాలని మనవి!) గారెల్ని మెల్లగా నములుతూ ఆ ఆనందాన్ని అనుభవించినట్టు చదవండి.

ఆ వ్యాసాలను, వాటికి అందరి వ్యాఖ్యలను చదివాక, రాధిక గారు రాసిన కవితను చదవండి. ఆయన ఇచ్చిన హోమ్ వర్క్ ను ఆ జాబు వ్యాఖ్యల్లో చేసినా, మీ ముందు కూడా అది ఉంచాలని ఇలా...

ఓ శిష్యుడిలా నన్ను నేను చెప్పుకొన్నాక, మీ మాట ప్రకారం హోమ్ వర్క్ కోసం ఈ కవిత ఎన్నుకొన్నాను.

"అలుపు తీర్చే చిరుగాలి
అలిగి సుడిగాలైపోతే
చిగురుటాకులా వణికిపోతున్నాను..!

కానీ...

ఈ సుడిగాలి జడివాన కురిపించి
సాహిత్యపు మొలకలెత్తిస్తుంటే
ఆ ధారల్లో తడిసి మురిసిపోతానుగానీ
ఎండుటాకులా దూరం గా ఎగిరిపోను..!" - రాధిక.

నా అనుభవంలో కొచ్చిన రసాలు:

అలుపు తీర్చే చిరుగాలి - శాంతము.
అలిగి సుడిగాలైపోతే - రౌద్రము.
చిగురుటాకులా వణికిపోతున్నాను - భయానకము.
ఈ సుడిగాలి జడివాన కురిపించి - కరుణము.
సాహిత్యపు మొలకలెత్తిస్తుంటే - అద్భుతము.
ఆ ధారల్లో తడిసి మురిసిపోతాను - శృంగారము.
ఎండుటాకులా దూరం గా ఎగిరిపోను - వీరము.

మీ వ్యాసాలు వాటికి రాసిన వ్యాఖ్యలూ చదివిన వారికి ఈ సంగతి బాగా అర్థమవుతుంది. రాధిక గారు అద్భుతమైన కవిత రాసారు...అభినందనలు!

ఇందులో తప్పులెన్నటానికి ఏమీ లేకపోయినా...మిగిలిన భీభత్స, హాస్య రసాలను ఇందులో ఇమడ్చడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం...

"జడివాన చేసిన చిత్తడిలో కాలుజారి - భీభత్సము.
నాలుక్కరచుకొన్న తమలపాకును!" - హాస్యము.

No comments: