'శ్రీకృష్ణదేవరాయలు' పేరు వినగానే తెలుగువారి ఒళ్లు పులకరిస్తుంది. ఎన్నెన్నో దివ్యానుభూతులను స్ఫురింపజేస్తుంది. ఏవేవో దివ్యలోకాల్లో విహరింపజేస్తుంది. తెలుగువారిని సదా ఉత్తేజపరిచే పేరు అది. తెలుగుజాతిని మేల్కొల్పే పేరు అది. అందుకే శ్రీకృష్ణదేవరాయలు అందించే స్ఫూర్తితో తెలుగు సంస్కృతీ పునర్వికాసానికి నడుం కట్టడం మన విద్యుక్త ధర్మం.
తెలుగు ప్రజలున్న అన్నిచోట్లా నేటికీ శ్రీకృష్ణదేవరాయలు నిలిచే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, బయటి రాష్ట్రాల్లోకూడా తెలుగువారికి నేటికీ ఆయన స్ఫూర్తి దాత. తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవే ఇందుకు కారణం. యుద్ధతంత్రంలో ఎంత నేర్పరో, సాహితీక్షేత్రంలోనూ అంతటి ప్రతిభాశాలి. సైనికబలంతో పాటు కవి దిగ్గజాలను కూడా తనతో తోడ్కొని వెళ్లి యుద్ధ విరా మ సమయాల్లో సాహితీగోష్ఠి జరిపిన రాజు మరొకరు మనకు చరిత్రలో కనిపించరు. అందుకే ఆయనను సాహితీ సమరాంగణ సార్వభౌముడు అన్నారు.
తెలుగువారు భాషాప్రయుక్త రాష్ట్రంకోసం, విశాలాంధ్ర కోసం చేసిన పోరాటంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు స్ఫూర్తికేంద్రం. సంస్కృత భాషలో పండితుడయివుండీ, ఇతర ద్రావిడ భాషలు తెలిసినవాడయివుండీ తెలుగులో 'అముక్తమాల్యద' వంటి ప్రబంధ రచన చేయడం ఆయనకు తెలుగుభాషతో, తెలుగుజాతితో ఉన్న మమేకతను తెలుపుతుంది. ప్రజల భాషలో పరిపాలన చెయ్యాలని, తన ప్రజల భాషాసాహిత్యాల వికాసానికి రాజే బాధ్యుడనీ ఆచరణాత్మకంగా నిరూపించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. నేటి మన ప్రజా ప్రభుత్వాలు శ్రీకృష్ణదేవరాయల నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. పరిపాలకుడుగా సామరస్యతను, రాజనీతిని ఎలా ప్రదర్శించగలిగాడో, ప్రజల భాషను ప్రోత్సహిస్తూనే వివిధ భాషీయులున్న సమాజం లో భాషా జాతి సమైక్యతను ఎంత నేర్పుగా సాధించ గలిగాడో, శ్రీకృష్ణదేవరాయలనుంచి నేర్చుకోవాలి. భారతీ య సంస్కృతీ మర్యాదలను పటిష్టం చేస్తూ, వాటి విలువలను చాటి చెప్పడంలో నిపుణతకు ఆయన ఒక ప్రతీకగా నిలిచాడు.
అయితే, ఇంతటి మహావ్యక్తి గురించి, ఇంతటి గొప్ప పాలకుడి గురించి పరిశోధన ఏమాత్రం జరిగింది? ఆయనను గురించిన వివరాలను వెలికితీసి ఎంతమాత్రం గ్రంథస్థం చేశాం? విదేశీ రచయితలు మన ముందుకు తెచ్చిన వివరాలే మనకు ఆయన్ను గురించి కొంత సమాచారాన్నందిస్తున్నవి. శిలాశాసనంతోపాటు, సాహిత్య సంపద మాత్రమే మనకు ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తున్నది. వీటి ఆధారాలతోనైనా మనం ఎంతో పరిశోధన చేయవలసివుంది.
కృష్ణాజిల్లా విజయవాడకు 45 కి.మీ. దూరంలో కృష్ణా నది ఒడ్డున శ్రీకాకుళంలో ఆంధ్రమహావిష్ణువు దేవాలయం ఉన్నది. తొలి ఆంధ్ర సామ్రాజ్య స్థాపకుడుగా ప్రసిద్ధుడై, ఆదర్శ రాజ్యాన్ని స్థాపించి, చరిత్రకెక్కిన ఆంధ్ర మహా విష్ణువు క్రీస్తుపూర్వం అయిదారు శతాబ్దాల నాటివాడని తెలుస్తున్నది. అప్పటికే భాషా సంస్కృతులు కలిగిన నాగరిక రాజ్యాన్ని ఆ ఆంధ్ర నాయకుడు ఏలినట్లు తెలు స్తున్నది. ఇప్పుడు తెలుగుభాషా ప్రాచీనతను మనం నిరూపించుకొనే కృషిలో దీన్ని ఒక ప్రధానాంశంగా గ్రహించాలి. తర్వాత దాదాపు 2000 ఏళ్లకు, 1518లో కళింగ జైత్ర యాత్రకు వచ్చిన 'సాహితీ సమరాంగణ సార్వభౌముడు' శ్రీకృష్ణదేవరాయలు, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని సేవించడానికి 1518 ఫిబ్రవరి 11న వచ్చి ఇక్కడ విడిది చేశాడు. ఆ పుణ్యరాత్రి శ్రీకాకుళాంధ్రదేవుడు రాయలవారికి కలలో ప్రత్యక్షమై 'అముక్తమాల్యద' రచన చేయవలసిందిగా ఆదేశించాడట. దాదాపు రెండువేలేళ్ల తర్వాత, మరొక సువిశాల తెలుగు సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు ఈ తొలి తెలుగు నాయకరాజు దేవాలయాన్ని దర్శించి స్ఫూర్తి పొందడం, 'అముక్త మాల్యద' వంటి ప్రబంధ రచనకు శ్రీకారం చుట్టడం... ఈ తెలుగుజాతి ఆత్మజ్యోతి ఎంత శక్తి మంతమైనదో మనకు తెలుపుతున్నది.
తెలుగువారి తొలి రాజధానిలో విడిది చేసిన శ్రీకృష్ణదేవరాయల అంతరంగంలోకి ప్రవేశించిన ఆంధ్ర మహా విష్ణువు- ఆనాటికీ ఏనాటికీ చెదరరాని ఒక ఆదేశాన్నిచ్చాడు. 'తెలుగదేల యన్న దేశంబు తెలుగు' అని ఆ ఆదేశం. అంటే ఈ దేశం తెలుగు ప్రజలది కనుక ఇక్కడ తెలుగే రాజ్యమేలాలి అని. 'దేశభాషలందు తెలుగు లెస్స' అని కూడా ఆయనే చెప్పాడు. ఈ దేశాన్ని పాలించేవాడిగా తాను తెలుగు వల్లభుడననీ చెప్పుకున్నాడు. ఆంధ్రమహావిష్ణువు ఇచ్చిన ఈ ఆదేశాన్ని స్పష్టం చేయడం ద్వారా శ్రీ కృష్ణదేవరాయలు ఒక తెలుగు రాజ్యాధీశుడుగా తన విధాన ప్రకటన చేశాడన్నమాట. ఇదే సమయంలో రాయలు, తన సామ్రాజ్యంలోని అయిదు భాషా ప్రాంతాలకు విజయనగరాన్నే కేంద్రంగాచేసి, శాసనములను తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ, కొంకణ భాషల్లో వేయించాడని, తన ఆస్థానంలో తెలుగు కవులతో పాటు తమిళ, కన్నడ కవులకు కూడా స్థానం కల్పించి గౌరవించాడని మరచి పోకూడదు. భాషా సమైక్యత, జాతీయ సమైక్యతలకు ఆయన ఎంత ప్రాధాన్యమిచ్చాడో గమనించండి.
మన గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా మనం మన భాషా సంస్కృతులను వికసింపజేసుకోవడం మీదే ఆధార పడి ఉంటుంది. మన జాతి ఐక్యతను కాపాడుకొంటూ, రాజ్యాన్ని సుభిక్షంగా విలసిల్లజేసుకోవడం మీదే ఆధార పడి ఉంటుంది. ఈ సత్యాన్ని నాటి ఆంధ్రనాయకుడయిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు, నిన్నటి తెలుగు వల్లభుడైన శ్రీకృష్ణదేవరాయలు ఆచరణాత్మకంగా చాటిచెప్పారు.ఈ మహత్తర చారిత్రక సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసు కుని శ్రీకాకుళంలో శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు ఫిబ్రవరి 9నుండి మూడు రోజుల పాటు జరుగుతాయి. అముక్తమాల్యద మండపంలో శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుంది.మనది తెలుగుజాతి. రెండువేల అయిదువందల సంవ త్సరాల ఘనమైన చరిత్రగల మహోన్నత జాతి. మన జాతి, చరిత్ర, భాష, సంస్కృతుల ఔన్నత్యాన్ని మరచి పోతున్న ప్రస్తుత తరాన్ని జాగృతం చేయడం, వాటి ప్రాచీనతను, గొప్పతనాన్ని మన జీవనవిధానంలోని విశిష్టతను తెలియజేస్తూ ఆత్మౌన్నత్యభావాన్ని పెంపొందించుకుని 'నేను తెలుగువాడిని' అని సగర్వంగా ప్రపంచంలో ఏ మూలనైనా ప్రకటించుకొనేలా చేయడానికి కావలసిన స్ఫూర్తిని, సమాచారాన్నీ, ఉత్తేజాన్నీ నింపడానికి శ్రీ కృష్ణ దేవరాయలు సదా మనకు స్ఫూర్తికేంద్రం.
ఆంధ్రజ్యోతి నుంచి: వ్యాసకర్త అవనిగడ్డ శాసనసభ్యులు - మండలి బుద్ధప్రసాద్
1 comment:
వ్యాసం బాగుంది.
బుద్ధప్రసాద్ గారి గురించి పూర్తి గా తెలియదు కనీ తెలుగు చాలా చక్కగా, సంపూర్ణం గా మాట్లాడతారు.
sure
Post a Comment