తెలుగు సినిమా : నా జీవితం!

'నిర్మలమ్మ' ఎన్ని తెలుగు సినిమాల్లో అమ్మగా,అమ్మమ్మగా నటించిందో! ఆమెను ఎప్పుడు చూసినా మా అమ్మమ్మనే గుర్తుకు వస్తుంది. అచ్చు అలానే ఉండేది మా అవ్వ. ఇక్కడికి వచ్చే ముందు హైదరాబాదులో ఎలాగో ఫోన్ నెంబరు కనుక్కొని ఫోన్ చేస్తే "బాబూ నా ఆరోగ్యం బాలేదు. మళ్లీ ఎప్పుడన్నా కలుద్దాం నాయనా" అంది. ఇదిగో, ఇప్పుడిలా ఈ వజ్రోత్సవాల పుణ్యమా అని మళ్లీ తనని చూసి, తన మాటలు వినే అదృష్టం కలిగింది.

నా ఊహకు తెలిసి నేను చూసిన మొదటి తెలుగు సినిమా 'పొట్టేలు పున్నమ్మ'. ఎన్నో రోజులు ఆ పొట్టేలు నా ఊహల్లో ఉండిపోయింది. తర్వాత మా అమ్మమ్మతో కలిసి నేల టిక్కెట్టులో చూసిన 'పాతాళభైరవి', 'చిక్కడు-దొరకడు', 'లవకుశ', 'భూకైలాస్', 'మయాబజార్', 'మిస్సమ్మ' మొదలైన ఎన్నో పాత సినిమాలు నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి. చిన్నప్పుడు మా అమ్మతో వెళితే మధ్య క్లాసు, మా నాన్న తీసుకెళితే పై క్లాసు, మా అవ్వతో కలసి పోతే నేల క్లాసు!

'శంకారాభరణం' రోజుల్లో నేను, నా చెల్లెలు పక్కింటి వారితో కలిసి మా ఊరికొచ్చిన శాస్త్రిగారిని చూడటానికి వెళ్లి తప్పిపోయిన సంగతి, ఇంట్లో తెలియకుండా మొదటిసారి 'చండశాసనుడు' సినిమా కెళ్లడమే కాకుండా, మా చెల్లెలిని నాతో పాటు తీసుకెళ్లి సినిమా విరామ సమయంలో వెతుక్కుంటూ వచ్చిన మా అమ్మకు దొరికిపోయి సినిమా థియేటరు నుంచి ఇంటిదాకా తిన్న దెబ్బలు...ఎన్టీయార్ వీరాభిమానిగా నా జుత్తును ఆయనను అనుకరిస్తూ పెట్టుకొని మా అమ్మతో 'పిచ్చికగూడు' అని పిలిపించుకొన్న రోజులు...'శివుడు,శివుడు,శివుడు' తో చిరంజీవి అభిమానిగా మారిన క్షణాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో మరపురాని అనుభవాలు.

ఇంట్లో 'మరోచరిత్ర' చిత్రకథ విని వినీ ప్రతి డైలాగు నోటికి వచ్చేది. 'ప్రేమాభిషేకం' లో 'వందనం అభివందనం' అన్న పాటకు టవలును శాలువాగా, స్టీలు గ్లాసును మందు గ్లాసుగా చేసి చేసిన అభినయం... 'బొబ్బిలిపులి'ని చూసి ఆ వయస్సులోనే పడిన ఉద్రేకం, ఆవేశం... 'మూగమనసులు', చిరంజీవి 'ఆరాధన' చూసి రెండు రోజులు మూగగా రోదించిన అమాయకత్వం... మా మేనమామ పని చేస్తున్నపల్లెకు వేసవి సెలవలకు వెళ్లినప్పుడు, శేరు చెనగవిత్తనాలు వలిచి తద్వారా వచ్చే 25పైసలతో ఆ పల్లెలో ఉన్న ఒకే ఒక వీడియో థియేటర్లో చూసిన ఎన్నో సినిమాలు ఎలా మరచిపోగలను.

'బొబ్బిలి బ్రహ్మన్న' చూసి స్కూలు తరగతిలో బల్ల మధ్యలో ఉన్న సందులో ఓ కట్టెపుల్ల ఇరికించి ఉద్వేగంతో పాడిన పద్యాలు, 'తాండ్రపాపారాయుడు' చూసి వచ్చిన ఆవేశంలో ఓ మిత్రునితో కలబడిన సన్నివేశం, 'ఆంధ్రకేసరి' చూసి ఎంతో ఉత్తేజితుడై 'వేదంలా ఘోషించే గోదావరి' అంటూ పాట పాడి గెలుచుకొన్న బహుమతులు, 'అంకుశం' చూశాక ఐతే పోలీసు ఆఫీసరే కావాలి అని డైరీలో రాసుకొన్న స్ఫూర్తి వాక్యాలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి.

'గ్యాంగ్ లీడర్' దగ్గర నుంచీ అటు సూర్యుడు ఇటు పొడిచినా మెగాస్టార్ సినిమా మొదటి ఆట మిస్సవ్వకుండా చేసిన ప్రయత్నాలు. నూనూగు మీసాల నూత్న యవ్వనంలో రౌడీఅల్లుడు, అసెంబ్లీరౌడీ, కూలినెంబర్ 1, మామగారు, ఘరానా మొగుడు, బలరామకృష్ణులు...అబ్బో ఆ రోజులే వేరు! కాలేజీలో చేరాక స్టైలిష్ 'గులాబీ', 'ప్రేమికుడు', 'ప్రేమదేశం'...కాబోయే శ్రీమతితో చూసిన 'తొలిప్రేమ', పెళ్లయ్యాక చూసిన 'సీతారామరాజు' అన్నీ మరువలేని జ్ఞాపకాలే!

ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా 'ఇంద్ర' మొదటి రోజు, మొదటి ఆటకు చేసిన నృత్యాలకు చిరిగిన ప్యాంటు అన్నీ తమాషా గుర్తులే. కడుపులో ఉన్నప్పుడు చూసిన ఇంద్ర కాకుండా మా 'సుహాస్' చూసిన మొదటి సినిమా 'ఒక్కడు'. అమెరికా వచ్చాక ఆ హడావుడి, ఆ అల్లరి మిస్సయినా ఇక్కడా నాకు తెలిసి మొదటిసారి న్యూజెర్సీ లో మళ్లీ బ్యానరు కట్టి ఆ రోజులను గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నం చేసినా ఆ ఆనందం ఇక్కడెలా వస్తుంది చెప్పండి?

8 comments:

Anonymous said...

తెలుగు సినిమా తో మీ అనుబంధాన్ని చాల హృద్యం గా చెప్పారు.
ఒక్కో సందర్భం లో చూసిన సినిమా ఆ సందర్భాన్ని ఎప్పటికి గుర్తు చేస్తుంది కదా.

Unknown said...

తెలుగు సినేమా తో మన ఆంధ్రులకు ఉన్న అనుబంధం అటువంటిది.
మీకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి....

spandana said...

అయితే మీరు పెద్ద వీర సినిమా ప్రేమికులే!

--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

ఇస్మాయిల్ గారు,

మీరు ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. అదేదో "కట్టె కొట్టె తెచ్చె" అన్న చందాన ఓ ముప్పై ఏళ్ళ జీవితాన్ని సినిమా ముందు న్యూస్ రీళ్ళ లాగా చూపించేస్తే ఊరుకుంటామా ఏంటి. ఆ విషయాలన్నీ కాస్త సినిమా లాగో వీలయితే సీరియల్ లాగో చూపించండి.

ఎక్కువ మాట్లాడేశానా. ఎందుకు మాట్లాడంటే మీ పేర్లో స్మైల్ ఉంది. మీ అబ్బాయి పేరులో హాసం ఉంది. ఇన్ని వున్నవాళ్ళు ఏమీ అనుకోరని.

విహారి
http://vihaari.blogspot.com

Anonymous said...

ఇస్మాయిల్ గారూ,

తెలుగు సినీ చరిత్రను చాలా అద్బుతంగా చెప్పారు. ఇంటర్వెల్ లో దొరికిపోయి తన్నులు తిన్న అనుభవం నాకూ ఉంది.;-)

నేనూ అచ్చంగా మీలాగే అంకుశం చూసి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. గీతాంజలి చూసిన తర్వాత కొన్నాళ్ళు చలి లేకున్నా శాలువ బుజాన వేసుకుని తిరిగాను. కాలేజీ రోజుల్లో శివ చూసి సైకిల్ చైను పట్టుకుని మా మిత్రబృందం తో తిరుగుతుంటె, మా వూరి యస్.ఐ. మమ్మల్నందరినీ పోలీస్ స్టేషన్ కు తీసుక పోయి
"... మీరంతా శివ నాగార్జున టైపా, నేను అంకుశంలో రాజ శేఖర్ టైపు రా.." అంటూ మాపైకి లాఠి ని విసిరిన సంగతులన్నీ గుర్తొచ్చాయి.

అమ్మో, చాలా ప్రైవేటు రహస్యాలు బయటకు వస్తున్నాయి.

మరిన్ని ఇలాగే రాయాలని.

ప్రసాదం

Dr.Pen said...

స్వాతి, ప్రవీణ్, చరసాల గార్లకు స్పందించినందుకు కృతజ్ఞతలు.

విహారిగారూ, తప్పకుండా విహరిద్దాం :)

ప్రసాదంగారూ, మీ జ్ఞాపకాలు మరన్ని అనుభవాలను గుర్తుకు తెచ్చాయి.తెలుగు సినిమాను శివ ముందు, శివ తరువాత అని విభజించడం సబబే అనిపిస్తుంది!

మనోహర్ చెనికల said...

మీ మాటలు మళ్ళీ ఆ పాత రోజులను గుర్తుతెస్తున్నాయి. మీ అంత కాకపోయినా కొన్ని మరిచిపోయిన పాత సంగతులను మీ బ్లాగ్ గుర్తు చేసింది. దీనికి మీకు ధాంక్స్ చెప్పాలి.

Afsar said...

"పొట్టేలు పున్నమ్మ'.

భలే గుర్తుకు తెచ్చారు!
ఇలాంటివి మరిన్ని గుర్తుకు తేవాలి, దేవరా!