లక్షకోట్లతో విజ్ఞాన నగరం - కరువు జిల్లాకు చల్లని వరం!

అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు, ఆమడగూరుల్లో పదివేల ఎకరాల్లో ఏర్పాటు జురాంగ్‌ గ్రూపుతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం పదేళ్లలో పూర్తి, 25 లక్షల మందికి ఉపాధి! ఉద్యోగుల సగటు వేతనం నెలకు పాతిక వేలు!! నిర్వాసితులకు మార్కెట్‌ ధర ప్రాజెక్టులో వాటా, వృత్తివిద్యలో శిక్షణ-ఉపాధి ఇళ్లూ కట్టిస్తారు! జిల్లాలో అంతర్జాతీయ స్థాయి సైన్స్‌ సిటీ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి సింగపూర్‌కు చెందిన జురాంగ్‌ గ్రూపు నేతృత్వంలోని అంతర్జాతీయ కన్సార్టియంతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 'ఒడిస్సీ సైన్స్‌ సిటీ' పేరుతో నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 25 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.1 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు జురాంగ్‌ ఇండియా సీఈఓ మునుకుట్ల రావు వెల్లడించారు. ఈ మొత్తాన్ని కన్సార్టియంలోని స్ప్రింగ్‌ఫీల్డ్‌ ల్యాండ్‌ కార్పొరేషన్‌, మ్యాకురీ బ్యాంకు (ఆస్ట్రేలియా), జురాంగ్‌ ఇంటర్నేషనల్‌ గ్రూపు, సెంబ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ (సింగపూర్‌)లు సమకూరుస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ సమక్షంలో గురువారమిక్కడ రాష్ట్రప్రభుత్వం, స్ప్రింగ్‌ఫీల్డ్‌ ల్యాండ్‌ ఎండీ బాబ్‌షార్ప్‌లెస్‌లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

సైన్స్ సిటీ స్వరూపమిదీ: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అవసరమైన మౌలిక సదుపాయాల సాయంతో ఏర్పాటుచేయతలపెట్టిన సైన్స్‌ సిటీ ప్రాజెక్టును 'ఇంటిగ్రేటెడ్‌ సైన్స్‌ సిటీ'గా తీర్చిదిద్దేందుకు ఒడిస్సీ కన్సార్టియం ప్రయత్నిస్తోంది. విద్యుత్తు, నీరు, ఎక్స్‌ప్రెస్‌ వే, మెట్రో రైళ్లు, టెలికమ్యూనికేషన్లు, పారిశుద్ధ్యం, తదితర కనీస సౌకర్యాలను ఇందులో కల్పిస్తారు. కన్వెన్షన్‌ సెంటర్లు, వినోద పార్కులు, గోల్ఫ్‌ కోర్సులు, ఐదు నక్షత్రాల హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌లు నిర్మించి పర్యాటకానికి అనువుగా తీర్చిదిద్దుతారు. ఐటీ, బయోటెక్నాలజీ, బయోఫార్మాసూటికల్స్‌, టెలికమ్యూనికేషన్లు, సూపర్‌కంప్యూటింగ్‌, హైటెక్‌ తయారీ సంస్థలు తదితర పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సదుపాయాలను సైన్స్‌ సిటీలో పొందుపరుస్తారు.
(వార్త ఈనాడు నుంచి)

1 comment:

Gowri Shankar Sambatur said...

నా పుట్టిన ఉరికి ఇన్నాళకు అదృష్టం పడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇతర పట్టనాలకు ఎప్పుడో?