ఓ ప్రవాస వైద్యుని జీవితగాథ!

పదివేల గుండె శస్త్రచికిత్సలు చేసిన ఘనత...పైగా ఫారిన్‌ రిటర్న్‌డ్‌. మనదేశంలో రెండు చేతులా సంపాయించుకోవడానికి ఓ వైద్యుడికి ఇంతకన్నా అర్హతలు ఇంకేం కావాలి. కానీ ఆయన అలా అనుకోలేదు. స్వదేశానికి తిరిగి వచ్చిన పన్నెండేళ్లలో ఏనాడూ తానందించిన వైద్యసేవలకు డబ్బు తీసుకోలేదు. ఎన్నెన్నో ఆశలు మిగిల్చి తమకు శాశ్వతంగా దూరమైన కూతురు జ్ఞాపకార్థం ఓ ఆసుపత్రి నిర్మించి జనం గుండెచప్పుళ్లు సరిచేస్తున్నారు. ఆయనే ఉషాముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌ అధిపతి ముళ్లపూడి వెంకటరత్నం. కార్పొరేట్‌ ఆసుపత్రుల హంగు భరించలేని మధ్యతరగతి వారికి వీలైనంత తక్కువ ధరల్లో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందించడమే తన లక్ష్యం అంటున్న డాక్టర్‌ వెంకటరత్నం జీవిత చిత్రం...

హైదరాబాద్‌ జీడిమెట్ల సమీపంలోని గాజులరామారం. విశాలమైన తొమ్మిదెకరాల స్థలంలో నీరెండ పడి తళుక్కున మెరిసే ఆరంతస్తుల భవనం... ఉషాముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌. డాక్టర్‌ ముళ్లపూడి వెంకటరత్నం ఆశల ప్రతిరూపం ఆ హృదయ వైద్యాలయం. సాధారణంగా ఆ ఆసుపత్రి క్యాంటీన్‌లోనో... కారిడార్‌లోనో... రిసెప్షన్‌ ఏరియాలోనో... రోగులు అడిగే ప్రశ్నలకు నవ్వుతూ సమాధానమిస్తూ కనిపిస్తారాయన. ఒంటి మీద ఏప్రాన్‌... ఆయన మనసంత తెల్లగా. ఆస్పత్రి ఉద్యోగులతో పాటే క్యాంటీన్‌ క్యూలో నుంచుని టోకెన్‌ తీసుకుని వారితో పాటే భోంచేస్తారు. అక్కడ సేవే మతం. బాసులూ అధికారులూ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. శిక్షణ పొందిన సైనికుల్లా ఎవరిపని వారు చేసుకుపోతారంతే! ఆ భవనంలోని ఆరో అంతస్తులోనే ముళ్లపూడి దంపతుల నివాసం. ఉదయం ఆరు గంటలకే మొదలవుతుంది ఆయన దినచర్య. 'మీరు నమ్మండీ నమ్మకపొండీ... నేను చెప్పేది నిజం... నా (చేతి)రాత బాగుండక పోవడం వల్లే అమెరికా వెళ్లాను' అంటూ మొదలుపెట్టారాయన తన జీవితానుభవాలను వివరించమని కోరినప్పుడు...

మాది పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు తాలూకాలోని గౌరీపట్నం అనీ... ఓ పల్లెటూరు. వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. నాన్న పేరు ముళ్లపూడి రామన్న. అమ్మ పేరు అయ్యమ్మ. మేం ముగ్గురం అన్నదమ్ములం. మాకు ఇరవై ఎకరాల పొలం ఉండేది. కానీ అందులో ఐదెకరాలే సాగుకి అనుకూలంగా ఉండేది. మిగిలిందంతా బీడుభూమి. నాకు పదమూడేళ్లు వచ్చేదాకా బడికి వెళ్లింది లేదు. రోజూ పశువుల్ని మేతకు తోలుకెళ్లేవాణ్ని. పక్కపొలాల్లోకి జొరబడకుండా వాటిని కాయడం కష్టంగా అనిపించేది నాకు. మరోపక్క... చదువు మీద బాగా ఆసక్తి ఉండేది. అయినా బడికి పంపించేవారు కాదు. మా ఊళ్లో అంతకు ముందు చదువుకున్న వాళ్లంతా పనీపాటా లేకుండా తిరగడం చూసి మమ్మల్ని బళ్లోకి పంపించడానికి ఒప్పుకొనేవారు కాదు మా నాన్న. 'పదెకరాలుంటే పొలం చేసుకు బతకొచ్చు గానీ చదువుకుని బాగుపడినవాళ్లు లేరనే'వారాయన. మా అన్నయ్యా, తమ్ముడూ ఆయన మాట విన్నారు కానీ నేను మాత్రం తిరగబడేవాణ్ని. 'నేను గొడ్లు కాయను, చదువుకుంటాను' అని అప్పుడప్పుడూ ఇంట్లో గొడవ పెట్టుకునే వాణ్ని. ఏదేమైనా చదువుకుంటానని మొండికేసి చుట్టుపక్కల బడికెళ్లే పిల్లల దగ్గర నెమ్మదిగా చదవడం రాయడం నేర్చుకున్నాను. మా అమ్మ నన్ను అర్థం చేసుకుని నాకు మద్దతుగా రావడంతో మా నాన్న దిగిరాక తప్పలేదు.

ఆయన ఒప్పుకొన్నారు గానీ... నాకప్పటికే పన్నెండేళ్లు. మళ్లీ ఒకటో తరగతి నుంచి చదవడం అయ్యేపని కాదు కదా. అందుకని ఆ ఏడాదంతా కూచుని ఒకటి నుంచి ఏడో తరగతి దాకా పుస్తకాలన్నీ చదివి సెవెన్త్‌ క్లాసు పరీక్షలు రాశాను. చెప్పినంత సులభం కాదది. చాలా కష్టపడ్డాను. ఆ పరీక్షల్లో పాసవడంతో ఎనిమిదో తరగతిలో అడ్మిషన్‌ దొరికింది. కొవ్వూరు హైస్కూల్లో సీటొచ్చింది. మా ఊరికి ఆరుమైళ్ల దూరంలో ఉండేదా బడి. పొద్దునా సాయంత్రం కలిపి పన్నెండు మైళ్లు కాలినడకన వెళ్లిరావాల్సిందే. ఓ వైపు చదువుకుంటూనే... సెలవు రోజుల్లో నాన్నకు పొలంపనుల్లో సాయం చేసేవాణ్ని. అలాగే కష్టపడుతూ పదోతరగతి పూర్తిచేశాను.

చిన్నప్పటి నుంచి బళ్లో చదవక పోవటం వల్లనో ఏవో నా దస్తూరీ అంత బాగుండేది కాదు. పరీక్షల్లో నేనేం రాశానో కనుక్కోవటానికే టీచర్లకు చాలా సమయం పట్టేది. నా పదో తరగతి పరీక్షలయ్యాక మా టీచర్లు పిలిచి... 'నీ చేతి రాత అంత బావుండదు. కాబట్టి ఇంటర్మీడియట్‌లో ఎం.పి.సి. గ్రూపు తీసుకో. ఆ మూడు సబ్జెక్టుల్లోనూ అంకెలతోనే గడిచిపోతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండద'న్నారు. నాకు మాత్రం ఎప్పటికైనా డాక్టరవ్వాలని ఉండేది. ఎందుకంటే... మా ఊళ్లో అప్పటికి సరయిన వైద్యసదుపాయాలుండేవి కాదు. తరచుగా ఊళ్లో ఎవరో ఒకరికి టైఫాయిడ్‌ జ్వరం వస్తుండేది. ఎవరికి ఏ జబ్బు చేసినా నాటు వైద్యులనో, అక్కడ దొరికే మూలికలనో ఆశ్రయించాల్సిందే. కొంత మంది బతికేవారు. ఎక్కువమంది చనిపోయేవారు. మా ఊళ్లోనూ ఒక డాక్టరుంటే బాగుంటుంది కదా అనిపించేది. అందుకని ఇంటర్‌లో బై.పి.సి. తీసుకున్నాను. అలా నా లక్ష్యాన్ని ఆనాడే నిర్దేశించుకున్నాను. నా ఎదుగుదలలో ప్రతిక్షణం దాన్ని గుర్తు చేసుకుంటూనే ఉండేవాణ్ని.

ఇంటర్‌ అయిపోయాక విశాఖపట్నం ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎం.బి.బి.ఎస్‌లో చేరాను. అప్పట్లో మెడిసిన్‌ చేయడానికి అంతగా ఖర్చయ్యేది కాదు. ఫీజు కూడా సంవత్సరానికి 250 రూపాయలే. దాంతో ఆర్థికంగానూ మాకు అంత పెద్ద ఇబ్బందేమీ ఎదురవలేదు. మెడిసిన్‌ చేసేటప్పుడు ఒకసారి హైదరాబాద్‌ వెళ్లాను. అప్పుడు కొన్ని హార్ట్‌సర్జరీలు దగ్గరుండి చూశాను. ఆ క్షణాన్నే నేను హార్ట్‌సర్జన్‌ కావాలని నిశ్చయించుకున్నాను. ఎంబీబీఎస్‌ అయ్యాక విశాఖ కింగ్‌జార్జ్‌ హాస్పిటల్‌లో ఒక ఏడాది పాటు హౌస్‌సర్జెన్సీ చేశాను. ఇది 1963నాటి మాట. ఆ ఏడాదే నాకు పెళ్లయింది. నా శ్రీమతి పేరు నళిని. ఆవిడ అప్పటికి మెడికల్‌ కాలేజి విద్యార్థిని. కె.జి.హెచ్‌.లో హౌస్‌సర్జెన్సీ పూర్తయ్యాక పై చదువులకు అమెరికా వెళ్లాను... అదీ నా రాత కారణంగానే! ఇండియాలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేయడానికి నాకు ధైర్యం చాల్లేదు. ఎందుకంటే ఇక్కడంతా వ్యాస రూప ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అదే అమెరికాలో పీజీ చేయాలంటే పరీక్షలన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. దానికి ప్రయత్నం చేయడం మంచిదని స్నేహితులంతా సలహా ఇచ్చారు. నేను చేసిన ప్రయత్నం సఫలమైంది. అమెరికా వెళ్లడానికి ఆరోజుల్లో పెద్దగా ఆంక్షలూ ఉండేవి కాదు. కోరుకున్న బ్రాంచ్‌లో ఇంటర్న్‌షిప్‌ దొరికింది. అలా అవకాశాల గడ్డపై అడుగుపెట్టాను.

న్యూయార్క్‌లోని ఆల్బెనీ మెడికల్‌ సెంటర్‌లో జనరల్‌ సర్జరీ రెసిడెన్సీగా చేరాను. నెలకు 50డాలర్లు స్త్టెపెండ్‌ ఇచ్చేవారు. ఉండటానికి గది ఇచ్చారు. ఎక్కడో గౌరీపట్నం నుంచి అంత మహానగరానికి వెళ్లిన ఓ పల్లెటూరి కుర్రాడికి ఏమనిపిస్తుంది? నేనూ అంతే. మొదట్లో అంతా అబ్బురంగా అనిపించేది. ప్రత్యేకించి ఆటోమేటిక్‌ డోర్లు... మనిషి రాగానే వాటంతటవే తెరుచుకోవడం, వెళ్లగానే మూసుకోవడం... వింతగా ఉండేది. మాటిమాటికీ ఆటోమేటిక్‌ డోరు గుండా వెళ్లేవాణ్ని. ఇంకా... ఎలివేటర్లూ పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌ అన్నీ ఆశ్చర్యంగా చూసేవాణ్ని. అయితే ఎన్ని సరదాలూ ఆకర్షణలూ ఉన్నా... మూలాలు మరచిపోలేదు. నేను వెళ్లిన మూడేళ్లకు నా భార్య కూడా అమెరికా వచ్చేసింది. ఆవిడ అనస్థీషియాలజిస్ట్‌. ఆల్బెనీలో శిక్షణ పూర్తిచేసుకున్నాక కార్డియో వాస్క్యులార్‌ సర్జరీలో ట్రైనింగ్‌ కోసం అయోవా చేరుకున్నాను. 1972 నాటికి అదీ పూర్తవడంతో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. ముప్ఫై ఐదేళ్లపాటు అక్కడ ఉన్నాను. అమెరికాలో వైద్యులూ నర్సులూ ఎంతో అంకితభావంతో పనిచేసేవారు. డ్యూటీ కోసం డ్యూటీ అన్నట్టుగా ఉండరు. ఎంతపెద్ద డాక్టరైనా ఉదయం ఆరుగంటలకే ఆసుపత్రికి వచ్చేస్తారు. ఇక్కడ పరిస్థితి అలా ఉండదు. నాకూ అవే పద్ధతులు అలవాటయ్యాయి. హస్తవాసి మంచిదని పేరొచ్చింది. మాకు ఇద్దరు అమ్మాయిలు. జ్యోతి, ఉష. పెద్దమ్మాయి జ్యోతి లా చదివింది. ఇక చిన్నమ్మాయి ఉష వెుదట్నుంచి బాగా చురుగ్గా ఉండేది. హైస్కూల్లో చదివేటప్పుడు ఒకసారి తను స్కూలు ప్రోగ్రాంలో భాగంగా కెన్యా వెళ్లింది. అక్కడ మూణ్నెల్లు ఉండి వచ్చాక- పెద్దయ్యాక తాను టీచర్‌నవుతాననీ మళ్లీ కెన్యాకే వెళ్లి సేవలందిస్తాననీ చెబుతుండేది. అలా తనకు మొదట్నుంచి ఆదర్శభావాలూ ఎక్కువే.

అమెరికాలో బాగా స్థిరపడినా ఇక్కడికి రావాలన్న కోరిక బాగా ఉండేది. 1980ల్లో ప్రయత్నించాం కానీ పరిస్థితులు అనుకూలించలేదు. 1995లో... నిమ్స్‌ డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావు ఆహ్వానించడంతో 'నిమ్స్‌'లో కార్డియాలజిస్టుగా చేరాను. కానీ... మేం ఇక్కడికి వచ్చిన రెండు మూడు నెలలకే మా రెండో అమ్మాయి ఉష అయోవాలోనే దురదృష్టవశాత్తూ రైలు ప్రమాదంలో చనిపోయింది. రైలు ట్రాకు మీద భయంతో నిలబడిపోయిన పెంపుడు కుక్కను రక్షించబోయి తాను మమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయింది. అప్పుడు మేం ఇక్కడే ఉన్నాం. అది మాకు తీరని దుఃఖం. అమ్మాయి ఆశయాల మేరకు తన కళ్లూ కిడ్నీలూ ఊపిరితిత్తులూ గుండె, లివర్‌, పాంక్రియాస్‌, ఇలా అన్ని అవయవాలనూ దానం చేశాం. ఇక్కడికి వచ్చి సేవలందించాలన్న మా నిర్ణయానికి తనెప్పుడూ మద్దతు పలికేది. అనుకోకుండా ఉష మాకు దూరం కావడంతో, తన జ్ఞాపకార్థం ఒక ఆసుపత్రి నిర్మించాలనుకున్నాం. అంతకు ముందు అలాంటి ఆలోచనేదీ లేదు. ఒకసారి ఆ నిర్ణయానికొచ్చాక అమెరికాలో మేం సంపాదించిందంతా పెట్టుబడిగా పెట్టి ఉషా ముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌ నిర్మించాం. ఎవరి దగ్గరా ఒక్కరూపాయి కూడా విరాళంగా తీసుకోలేదు. ఆస్పత్రి ప్రారంభోత్సవం అట్టహాసంగా చేయలేదు. కనీసం కొబ్బరికాయా కొట్టలేదు. 2000 సంవత్సరంలో జనవరి 15న ఆసుపత్రిని ప్రారంభించాం. మొదట్లో రెండు మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులు కూడా రాలేదు. మేం మిగుల్చుకున్న ఆఖరిపైసా కూడా ఆసుపత్రి మీదే పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఫరవాలేదు. కాకపోతే వీఐపీలకు ప్రత్యేక మర్యాదల్లాంటివి మాకు సాధ్యం కాదు. వాటికి మేం పూర్తిగా దూరం.

నిమ్స్‌లో పనిచేసేటప్పుడు గౌరవవేతనంగా ఒక్క రూపాయి మాత్రం తీసుకున్నాను. ఇప్పుడదీ లేదు. మాకు అమెరికన్‌ పౌరసత్వం ఉంది. అక్కడ అరవై ఐదేళ్లు దాటిన వారికిచ్చే రెండువేల డాలర్ల ఫించన్‌ సరిపోతుంది మాకు. మా దగ్గర వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా తిరిగి వెళ్లే వారిని చూసినప్పుడల్లా ఆనందంగా అనిపిస్తుంది. మా అమ్మాయి ఆదర్శాలను సాఫల్యం చేస్తున్నామనిపిస్తుంది. అంతకు మించిన తృప్తి ఇంకేం కావాలి. నిర్వహణ ఖర్చుల కోసం నామమాత్రంగా ఐదుశాతం లాభాలు మాత్రం తీసుకుంటున్నాం. గుండెజబ్బులకు సంబంధించినంత వరకూ రాష్ట్రంలో మా ఆస్పత్రిలోనే తక్కువ ఖర్చుతో వైద్యం జరుగుతోందని కచ్చితంగా చెప్పగలను. అది కూడా భరించలేని నిరుపేదలు వస్తే కొన్ని సంస్థలకు సిఫారసు చేస్తాం. వారు యాభైశాతం ఖర్చును భరిస్తే మిగతాది ట్రస్టు భరిస్తుంది. మా ఆవరణలో ఇంకా నాలుగు ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. చిన్నపిల్లల కోసం ట్రస్టుహాస్పిటల్‌ పాకరంభించేందుకు ఎవరైనా ఉత్సాహంగా ముందుకు వస్తే వారికి ఆ స్థలాన్ని కేటాయించే ఆలోచన ఉంది. పిల్లల కోసం హైదరాబాద్‌లో మంచి ట్రస్టుహాస్పిటల్‌ ఒకటి ఎంతైనా అవసరం. అన్నిటికీ మించి... అమెరికాతో పోలిస్తే ఇక్కడి పరిస్థితుల్లో చాలా తేడాలున్నాయి. వైద్యం అక్కడ అందరికీ అందుతుంది. ఇక్కడ మాత్రం మంచి చికిత్స కావాలంటే కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లాలి... కానీ ఖర్చెక్కువ. ఖర్చు తక్కువైన ప్రభుత్వ ఆసుపత్రులకూ వెళ్లొచ్చు... సదుపాయాలుండవు. ఆ తేడాను దూరం చేయడమే మా ఆశయం.
(ఈనాడు 'ఆదివారం' నుంచి)

1 comment:

Rajendra said...

manchi vyaasam. ee rojullO ilaanTi ennaareila sEva sahaayam avasaram mana maatRbhuumiki chaalaa avasaram. Oka manchi manishini vaari aadarSaalani parichayam chEsinanduku vyaasakarta ki dhanyavaadaalu

raajEndra aalapaaTi