మా 'కర్నూలు వైద్య కళాశాల' స్వర్ణోత్సవాలు జరుగుతున్న ఈ శుభ సందర్భంలో మీతో ఆ సంతోషాన్ని పంచుకొనేందుకు 'స్వర్ణోత్సవ సంచిక' కోసం రాసిన ఈ వ్యాసాన్ని మీ ముందుంచుతున్నాను. మా కళాశాల చరిత్ర గురించి అందులో చాలా మంది వ్రాసారు కాబట్టి నేను ముఖ్యంగా కర్నూలు చరిత్ర దృష్టి కోణంలో రాసాను. ఎందరెందరో మేధావుల్ని అందించిన మా కళాశాల కలకాలం ఇలాగే కళకళలాడుతూ ఉండాలని ఆశిస్తూ... మీ కోసం ఈ వ్యాసం:
జనని - జన్మభూమి
"జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అన్నట్లు మనకు జన్మనిచ్చిన 'అమ్మ', ఆ అమ్మకు జన్మనిచ్చిన 'భూమి' స్వర్గానికంటే ఉన్నతమైనవి. అలానే మనకు వైద్యులుగా జన్మనిచ్చిన 'కర్నూలు వైద్య కళాశాల' మన అమ్మ అయితే, 50 ఏళ్ల క్రిందట ఆ 'అమ్మ'కు జన్మనిచ్చిన కర్నూలు ('జన్మభూమి') చరిత్ర గురించి కొన్ని సంగతులు ముచ్చటించుకొందాం.
ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామధేయం 'కందెనవోలు'. 11వ శతాబ్దిలో 'ఆలంపూరు' లో ఆలయం కట్టడానికి బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో ఈ ప్రాంతంలో బండి చక్రాలకు 'కందెన' రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి 'కందెనవోలు' అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది.
బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనంలోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయలి కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడిలోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన 'కొండారెడ్డి బురుజు' అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.
1565లో తళ్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్ధీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. 1733లో నవాబు అయిన హిమాయత్ ఖాన్ 'కర్ణాటక యుద్ధాలు'గా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, వారి హయాంలోనికి వచ్చింది.
1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ 'బుస్సీ' (పిల్లల పాటల్లోని 'బూచాడు') కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో 'టిప్పు సుల్తాన్' మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఇప్పటి రాయలసీమ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు, ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.
అలా మద్రాస్ ప్రెసిడెన్సిలో భాగమైన 'కందెనవోలు' కర్నూలుగా మార్పుచెందింది. కానీ రాయల కాలంనాటి నుంచి ఉన్న పాలెగాళ్లు (ప్రస్తుత ఫ్యాక్షనిష్టులు) ఈ ప్రాంతం మీద తమ పట్టునిలుపుకొన్నారు. వీరికి నెలసరి భరణం ఇచ్చేవారు. కొన్నాళ్లకు అదీ నిలిపివేశారు. 1846లో ఉయ్యాలవాడకు చెందిన 'నరసింహారెడ్డి' బ్రిటిషు సేనలతో వీరోచిత పోరాటం చేశాడు. కానీ చివరకు అతనిని పట్టి బంధించి 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద బహిరంగంగా ఉరి తీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసి ఉంచారు.
1947 దాకా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న కర్నూలు అటు తర్వాత అప్పటి వరకు రాజరికంలో ఉన్న బనగానపల్లెతో కలిసి కొత్తగా ఏర్పడ్డ మద్రాస్ రాష్ట్రంలో ఓ జిల్లాగా అవతరించింది. భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు త్యాగఫలితంగా, 1953లో మద్రాసు రాష్ట్రంలోని ఉత్తర 11 జిల్లాలన్నీ కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 'కర్నూలు' కొత్త రాష్ట్రానికి తొలి రాజధాని అయ్యింది. మళ్లీ 1956లో విశాలాంధ్ర నినాదం ఫలితంగా నైజాం ప్రాంతం కలిసి 'ఆంధ్రప్రదేశ్' ఏర్పడినప్పుడు రాజధాని నగరం హైదరాబాద్ కు మారింది.
అదే 1956లో మన కర్నూలు వైద్య కళాశాల పురుడుపోసుకుంది. రాజధానిగా ఉన్నప్పుడు ఉన్న సచివాలయం కళాశాల భవనంగా, శాసనసభ్యుల వసతిగృహం మరియు రాష్ట్ర అతిథి గృహం వైద్యవిద్యార్థుల వసతిగృహాలుగా మారాయి. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఐదువేల పైబడి వైద్యులకు జన్మనిచ్చింది ఈ కర్నూలు నగరం మన కర్నూలు వైద్య కళాశాల ద్వారా.
3 comments:
డాక్టర్ గారు కర్నూలు గురించి మీరు చలా బాగ రాసారండి. నేను కర్నూలు వాసినే. తీపి గురుతులు ఎన్నో. ఇప్పుడు సౌదీలో పనిచేస్తున్నాను. కర్నూలు మెడికల్ కాలేజిలో చాలా తిరిగాను - చాలా మంది డాక్టర్లు మా నాన్న వారి స్నేహితులు - Dr Nagaraju, Dr Mohan Reddy, Dr Subba Reddy, Dr Aanjaneyulu మొదలగు గొప్ప డాక్టర్లు. నాకు చాలా గర్వంగా వుంది సుమా.
ఈ వ్యాసమును నా సంగ్రహాలయములో చేరుస్తానండి.
గౌరి శంకర్
www.thenegoodu.com
http://sangrahaalayam.blogspot.com
http://keelugurram.blogspot.com
Nice article.
I too am associated with Kurnool. I was in Kurnool only till I was 16. After that, we moved. Still, I feel Kurnool is - "maa kurnoolu" :)
Post a Comment