షికాగో విమానాశ్రయం,
మధ్యాహ్నం 1.30, 19 జనవరి 2007.
మధ్యాహ్నం 1.30, 19 జనవరి 2007.
మరోసారి టెక్సాస్ వెళుతూ ఇలా షికాగో విమానాశ్రయంలో వేచి చూస్తూ...ఈ జాబు. ముఖ్యంగా ఇప్పుడే రాయడానికి కారణం ఓ నాలుగేళ్ల చిన్నారి, పేరు- రోషన్ గాంధారి. ప్రయాణంలో మాట కలపడం చిన్నప్పట్నించీ అలవాటు. అలా ఈ తల్లీకూతుళ్లు పరిచయం. అమ్మ శ్వేతజాతీయురాలిలా కనబడ్డా ఈ అమ్మాయిలో మన భారతీయ లక్షణాలు కన్పించాయి. మాటల్లో పడ్డాక తెలిసింది అసలు సంగతి నాన్న ఇరాన్ నుంచి, అమ్మ అమెరికా. మళ్లీ ఇంకా ముందుకెళితే నాన్న వైపు ఆఫ్ఘాన్ (అందుకే గాంధారి నామధేయం!)నుంచి ఇరాన్ చేరి అమెరికాలో తేలితే, అమ్మ వైపు తూర్పు రష్యన్ మరియు బ్రిటిషు వారసత్వం. ఎంతో చక్కగా ముద్దుముద్దుగా మాటలు చెప్పింది. తెలుగులో తన పేరు రాసి చూపితే పర్షియనా? అని ప్రశ్నించింది. కాదు తెలుగు అంటే స్పష్టంగా 'తెలుగు' అని పలికింది. ఇరాన్ నుంచి, ఆఫ్ఘాన్ నుంచి సాగిన జాతుల మిశ్రమం వల్ల మన దేశంలో ఆ అమ్మాయి లాంటి ముఖం ఎక్కడో చూసే ఉంటాను. రోషన్ మా దేశంలో పేరున్న సినిమా స్టార్ అని చెపితే అవునా! అంది. రోషన్ అంటే వెలుతురు, మా అమ్మ పేరు 'నూర్జహాన్', అంటే ప్రపంచానికే వెలుగు నీ పేరులాగానే అని చెపితే కొంటెగా నవ్వింది. మా కౌంటీ గ్రంథాలయం నుంచి తెచ్చుకొన్న ఇండియాటుడే చదవుతూంటే ఆ పత్రికలోని ఓ చిత్రంలో నా పోలికలతో ఉన్న భారతీయున్ని చూపి ఇది నువ్వేనా అని అడిగింది. కాదు అని నవ్వుతూ చెప్పాను. మా వెనుక సీటులో అచ్చం పెనోలెపె క్రజ్ లా ఉన్న మరో ప్రయాణీకురాలి అబ్బాయి ఏడుస్తూంటే బూచాట ఆడి నవ్వించింది. ఆ వయస్సులో పిల్లల కుండే ఆసక్తి, ఉత్సాహం మనకెప్పుడూ ఎందుకుండవు అనిపించింది.మొత్తానికి ఆ అమ్మాయి వల్ల ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా సాగింది.
No comments:
Post a Comment