పెళ్లి - ఎయిడ్స్!

పెళ్లికి ముందు హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి చేసే ఆలోచన
హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 : పెళ్లికి ముందు హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరిచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి రోశయ్య తెలిపారు. అయితే ఈ బిల్లును తీసుకురావడంలో తొందరపాటు లేదని.. అన్ని పార్టీలతో చర్చించి వారి సలహాలు తీసుకుంటామని చెప్పారు. వీలైతే వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నిస్తామని మంత్రి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. (ఈనాడు నుంచి)

మంచి ఆలోచనే! కానీ అందువల్ల జనించే పర్యవసానాలని లెక్కలోకి తీసుకోవలసి ఉంటుంది. అసలే మనవాళ్లు దొంగ పత్రాలు సృష్టించడంలో ఆరితేరిన ఘనులు. ఇక పరీక్షాఫలితాలని నకిలీ చేయరనడంలో సందేహం లేదు. కానీ ఇందువల్ల జరిగే చెడు కన్నా మంచే ఎక్కువ. కనీసం తమకు ఈ జబ్బుఉందని తెలిసాకయినా అందుకు తగ్గ చికిత్స తీసుకొని జాగ్రత్త పడతారు. కొంత మంది అపోహలకు గురై ఆత్మహత్యలకు పాల్పడవచ్చు కూడా. అందుకు ఈ బిల్లు కన్నా ముందు ప్రజలకు, ముఖ్యంగా యువతీయువకులకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడం ముఖ్యం. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు! ఓ వైద్యుడిగా నా వంతు బాధ్యతగా ఈ చిన్ని వ్యాసం...

ఎంతో మంది అభం-శుభం తెలియని పిల్లలు, వారి తప్పేమీ లేకుండానే ఈ వ్యాధికి గురవుతున్నారు. పెళ్లికి ముందు హెచ్.ఐ.వి పరీక్ష ద్వారా చాలా వరకు చిన్నపిల్లల్లో ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ సందర్భంగా హెచ్‌.ఐ.వి మీద అవగాహన కొరకు నా వైద్యబ్లాగు కెళ్లండి. టూకీగా చెప్పాలంటే హెచ్- హ్యూమన్, ఐ- ఇమ్యూనోడెఫిషియన్సీ, వి- వైరస్ అనగా "మానవ రోగనిరోధశక్తి వినాశిని" (మా.రో.వి).

ఈ 'మా.రో.వి' వైరసు మన రక్తంలో రక్షకభటులలా పని చేసే ఒక రకం తెల్లరక్తకణాల (సి.డి.-4 టి.కణాలు) మీద దాడి చేసి, వాటిలో ప్రవేశించి కొంత కాలం ఆ కణ జన్యువులలో దాగి ఉండి, అదను చూసుకొని వాటిని నాశనం చేస్తాయి లేదా వాటిని శక్తివిహీనం చేస్తాయి. తద్వారా మన రోగనిరోధకశక్తి నశించి ఎన్నెన్నో అంటురోగాలు, కాన్సర్లు దేహాన్ని అతలాకుతలం చేస్తాయి. అప్పుడు అలా వచ్చే ఈ వ్యాధిని 'ఎయిడ్స్' అంటున్నారు. ఎ- అక్వైర్డ్, ఐ- ఇమ్యూన్, డి- డెఫిషియన్సీ, ఎస్- సిండ్రోమ్ అనగా మనం 'ఆర్జించుకొన్న రోగనిరోధ న్యూన్యతా లక్షణసముదాయం'. సరయిన వైద్య పర్యవేక్షణ లేకపోతే దీనివల్ల చావు సమీపిస్తుంది.

ప్రస్తుతం చాలా మందులు ఉన్నా అవి ఈ మా.రో.వి. ని కొంత వరకు నిరోధించగలవు కానీ అన్నిటికన్నా మిన్నగా నిరోధించేది 'నిరోధే'. అవును ఇది నిజం. ఎందుకంటే ఈ వైరస్ మానవులలో ప్రవేశించే మార్గాలు:
1. సంపర్కం (సెక్సు) ద్వారా 1:30 నుంచి 1:1000
2. రక్తమార్పిడి ద్వారా (రక్తదాతలో వైరస్ ఉంటే) 1:2
(కానీ సురక్షిత రక్తదానం లో 1:10,00,000)
3. సూదులు మార్చుకొనే మత్తుమందు సేవికుల ద్వారా 1:150
(ఒకరు వాడిన సూదిని, వారి రక్తనాళంలో గుచ్చబడిన దానిని వేరొకరు ఉపయోగించడం ద్వారా)
4. రోగి అయిన తల్లినుంచి గర్భంలో ఉన్న శిశువులకు వ్యాపించడం ద్వారా 1:10
5. వైద్య సంబంధమైన కొన్ని ప్రక్రియల్లో, రోగి రక్తంతో కలుషితమైన సూది గుచ్చుకోవడం ద్వారా 1:300

అన్నిటిలోనూ మానవ సంపర్కం ద్వారానే ఎక్కువ మందికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అందులోనూ రకాలున్నాయి. స్వలింగ సంపర్కం ముఖ్యంగా మగవారిలో (గే) ఒక వ్యక్తికి ఈ వ్యాధి ఉంటే మరొకరికి సంక్రమించే అవకాశాలు ఎక్కువ. మగ-ఆడ సంపర్కంలో 'ఆడవారి నుంచి మగవారి' కన్నా 'మగవారి నుంచి ఆడవారికి' సంక్రమించే అవకాశం పది రెట్లు ఎక్కువ. కాబట్టి సురక్షిత శృంగారం అన్ని విధాల శ్రేయస్కరం. ఏకపత్నీవ్రతం/ఏకపతీవ్రతం మిమ్మల్ని ఈ 'మా.రో.వి' నుంచి కాపాడే వ్రతాలు, నోములు! ఇక పెళ్లికాని కోడెత్రాచులు, పెడత్రోవ తొక్కితే 'తొడుగు'(కండోమ్)లే మీకు శ్రీరామరక్ష!

ఈ 'మా.రో.వి' రావడానికి సవాలక్ష కారణాలు ఉన్నందున పెళ్లికి ముందు హెచ్.ఐ.వి. పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ఈ పరీక్ష (ఎలీసా) లో పాజిటివ్ వచ్చినంత మాత్రాన జబ్బు ఉన్నట్టు కాదు. పరీక్ష ఫలితం తప్పు కూడా కావచ్చు. అప్పుడు ఈ ఫలితాన్ని రూఢి పరచడానికి మరో పరీక్ష (వెస్టర్న్ బ్లాట్) చేస్తారు. పై రెండింటిలోనూ పాజిటివ్ వస్తే 99.99% ఈ వైరస్ సంక్రమించినట్టే. అంత మాత్రాన ఎయిడ్స్ ఉందని కాదు. అప్పుడు 'వైరల్ లోడు', పైన చెప్పిన 'సి.డి.-4 గణన' చేస్తారు. వ్యాధి తీవ్రతనుబట్టి చికిత్స చేస్తారు. ఇతర జబ్బులు రాకుండా మందులిస్తారు.

అన్నిటికన్నా ముఖ్యంగా తల్లికి ఈ వ్యాధి ఉంటే కాన్పు సిజేరిన్ ద్వారా చేసి, కాన్పుకు ముందు/తర్వాత తల్లికి మరియు బిడ్డకు జిడోవుడిన్, లామివుడిన్, నెవిరాపైన్ అనే మందులు ఓ పద్ధతి ద్వారా ఇవ్వడం వల్ల తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే శాతాన్ని మూడింట రెండు వంతుల వరకు తగ్గించవచ్చు. కానీ ఓ మహానుభావుడన్నట్టు "వ్యాధి నయం చేయడం కంటే అసలా వ్యాధి రాకుండా ముందుజాగ్రత్త పడడం వివేకమనిపించుకొంటుంది".

5 comments:

Anonymous said...

మంచి ఆలోచన. డాక్టరుగారూ, ఈ నిష్పత్తుల అర్థం ఏమిటి? (ఉదా: సంపర్కం (సెక్సు) ద్వారా 1:30 నుంచి 1:1000)

రాధిక said...

caalaa manchi vyaasam.oka doctor ga mii baadhyata nu blaagu dwaara kuuda nirvartimcaaru.great sir.naaku kuuda nishpattulu ardam kaledu

Anonymous said...

బాగా రాసారు. life insurance చేసుకొనే ము౦దు పరీక్షలు చేస్తున్నప్పుడు అ౦తక౦టే ముఖ్యమైన వివాహ౦ కోస౦ పరీక్షి౦చట౦ చాలా ముఖ్య౦. మీరన్నట్టు అవగాహన కల్పి౦చాలి లేకపోతే కొన్ని ప్రమాదాలు జరుగక మానవు. ఇది రాష్త్ర౦కి పరిమిత౦ కాకు౦డ, దేశ౦ మొత్త౦ అమలు చేయాలి.

Dr.Pen said...

నిష్పత్తి అర్థం ఏమిటంటే...ఉదా: వైరస్ ఉన్న వ్యక్తితో సంభోగిస్తే, ప్రతి 30 సంఘటనలకు ఒక్కసారి ఆ వైరస్ సంక్రమించే అవకాశమన్న మాట.అంటే ఓ 3000 సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయనుకోండి అందులో 100 ఘటనల్లో వైరస్ సంక్రమించ వచ్చన్న మాట. ఇది మరీ వివిధ రకాల ప్రాకృత, వికృత కామకేళీ కలాపాల పై ఆధారపడి ఉంటుంది. అందుకే స్వలింగసంపర్కులలో ఈ నిష్పత్తి 1:30 ఉంటే స్త్రీ-పురుష సంపర్కంలో 1:1000 వరకూ ఉంటుంది. మరీ ఇందులోనూ పురుషుడి నుంచి స్త్రీలకు వైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువ. రానారె,రాధిక,ఆసా...మీ ప్రత్యుత్తరాలకు కృతజ్ఞతలు!

Anonymous said...

చక్కగా వివరించారు డాక్టరు గారూ!