{ఐదు డాలర్ల నోటు పై లింకన్}
అబ్రహాం లింకన్ అంటే మనకు చెప్పులు కుట్టే స్థాయి నుంచి అమెరికా ప్రెసిడెంటు అయ్యాడని సినిమా డైలాగుల ద్వారా తెలుసు. కానీ ఆయన ఓ వడ్రంగి కొడుకు. స్వయంకృషితో అంత ఎత్తుకు ఎదగగలిగిన మహామనిషి. నాకిష్టమైన నాయకులలో ఒకడు. బానిసత్వపు కోరల నుంచి నల్లజాతిని కాపాడిన సహృదయుడు, అమెరికన్ సివిల్ వార్ లో నెగ్గి అమెరికాకు దిశానిర్దేశం చేసిన ధీరోధాత్తుడు, ఇవన్నిటికీ మించి బడికెళ్లకున్నా ఇంటి దగ్గరే పాఠాలు నేర్చిన ఓ పెద్ద పుస్తకాల పురుగు.అకస్మాత్తుగా లింకన్ గురించి ఎందుకంటే ఈ రోజు బార్న్స్ & నోబుల్స్ లో ఒక ఆసక్తికరమైన పుస్తకం కనబడింది, అది "మిస్టర్ లింకన్స్ టి-మెయిల్స్". అందులో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. మీ కోసం కొన్ని... అమెరికా సివిల్ వార్ లో లింకన్ మొదటిసారిగా టెలిగ్రాఫ్ ఉపయోగించడమే కాకుండా ఆ సాంకేతికతను ఔపోసన పట్టాడు. యుద్ధాన్ని గెలవడంలో ఈ కొత్త ఉపకరణం బాగా సహాయపడింది. చరిత్ర దిశను మార్చడంలో ఇది కూడా ఉపయోగపడింది.
1844 లో సామ్యూల్ మోర్స్ పంపిన "వాట్ గాడ్ హ్యాత్ వ్రాట్" అన్న బైబిల్ లోని వాక్యంతో సమాచార విప్లవానికి నాంది పలికాడు. చుక్కలు, గీతలతో కూడిన మోర్స్ కోడ్ తో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దూరంతో నిమిత్తం లేకుండా సమాచారం పంపే వీలు కలిగింది, మన నేటి ఈ-మెయిలులా. అందుకే ఆ రచయిత దీన్ని సమయోచితంగా "టి-మెయిల్" అన్నాడు టెలిగ్రాఫ్ సందేశాన్ని. అన్నట్టు మొదటి ఈ-మెయిల్ సందేశమేమిటో తెలుసునా?... పేలవమైన "క్యూ,డబ్ల్యూ,ఇ,ఆర్,టి,వై" , మన కీబోర్డ్ పై ఉన్న మొదటి అక్షర క్రమం! మరి ఇప్పుడు రోజుకి వందల బిలియన్ల సందేశాలతో ఈ-మెయిలు మనల్ని ఎంత దగ్గర చేసిందో అందరికీ తెలుసు.
అన్నట్టు ఒక విషయం చెప్పడం మరిచాను, నేను చూసిన లింకన్ స్వదస్తూరితో రాసిన ఆ పత్రాలలో "ఎక్జిక్యుటివ్ మాన్షన్" అని ఉంది మకుటంలో. 1901 వరకు శ్వేత సౌధాన్ని (వైట్ హౌస్) ను అధికారిక పత్రాలలో అలాగే ప్రకటించేవారట!
2 comments:
లింకన్ తాతంటే నాకూ భలే ఇష్టం
mii blaagulo chaalaa mamci vishayalu ceputaaru.telinivi chaalaa telusukogalugutunnanu.
Post a Comment