చింతు చింతలు!

ఈ మధ్య మన బ్లాగుల్లో వేడి పెరిగింది. కూడలిలో కావలిసినంత మేత దొరకుతోంది. అన్ని జాబుల్ని చూస్తూ నేనూ వ్రాయకుండా ఉండలేకపోతున్నాను, ఇల్లు మారే తొందరలో ఉన్నా!

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారి 'కలగూరగంప' చదువుతూంటే మరో లోకంలో విహరించినట్టు ఉంటోంది. 50 ఏళ్లకే ఎంత మార్పు! మన ఘనత వహించిన 'బాబు' గారు అన్నట్టు చరిత్రను చెత్తబుట్టలో వేయకుండా కొంచెం చదివితే మనం ఎంతో కొంత జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు.

ఇక మన రాష్ట్రంలో ఈనాడు-రాజశేఖరోపాఖ్యానం, ఇక్కడ అమెరికాలో ఎన్నికల సమరంలో ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడం కాస్త వినోదాన్ని పంచిపెడుతూ నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక్కడ కూడా అదే వరస. భూషయ్య (రవి గారు మన బుష్ మహాశయుడికి పెట్టిన పేరు నచ్చి నేనూ అదే ఉపయోగిస్తున్నా) గారికి ఆయన రిపబ్లికన్ పార్టీకి ఫాక్స్ ఛానల్ ఓ బాకా లా మారిపోయింది. న్యూయార్క్ టైమ్స్ లో ఏ వార్త వచ్చినా అది భూషయ్యకు వ్యతిరేకంగా అదేపనిగా కక్షగట్టి రాస్తున్నారని తెగ బాధపడిపోతున్నారు. ఎంత వ్యతిరేకంగా వార్తలు వస్తే మాత్రం సహనం కోల్పోయి పత్రికా స్వేచ్ఛను తగలెట్టడం రాజనీతి అన్పించుకోదు, అది ప్రభుత్వానికి శోభనివ్వదు.

పత్రికలన్నవి ప్రజాపక్షం వహించాలి. ఇదే ఈనాడు బాబు గారి భాగోతాలను ఎన్ని వెలికితీసిందో చరిత్ర తరచి చూస్తే తెలుస్తుంది. అలా అని నేను ఈనాడును విమర్శించడం లేదు. నాకిష్టమైన పత్రికల్లో ఈనాడుకే ప్రథమ స్థానం. అవినీతి జరుగుతోంది ఇది నిజం చిన్నపిల్లవాడికి కూడా అది తెలుసు. అది మనం అరికట్టగలమా? అదే అర్థం కాని ప్రశ్న. ఇక జయప్రకాష్ నారాయణ్ 'లోక్ సత్తా' ఎంత మాత్రం ఈ పని సాధిస్తుందో చూడాలి. కానీ జలయజ్ఞం అంటూ పల్లెసీమల్లో కాస్తయినా ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసిన రాజశేఖరుడు అపర భగీరథుడవుతాడా అన్నది ఇప్పటికి శేషప్రశ్నే.

గ్లోబల్ విలేజి అంటూ ప్రపంచం చిన్నదైపోతోందంటూ ఊదరగొడుతున్న అందరూ పల్లెపట్టుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించడం లేదు. ఆత్మహత్యలు, సరైన వైద్యం అందక జరుగుతున్న హత్యలు ఆపాలి. ఇదే గ్లోబలైజెషన్ (ప్రపంచీకరణ) వల్ల ప్రభుత్వం రాజ్యాంగంలో పొందుపరచిన ఆరోగ్య హక్కును నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ వైద్యశాలల్ని పట్టించుకోక ఏ రకమైన ఆరోగ్య భీమా లేని పేదప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. శిశుమరణరేటు వగైరా అభివృద్ది సూచికలు ఇలా కుంటుపడితే ఇక దేశం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా చేరుతుంది?

1 comment:

Anonymous said...

భూషయ్య అన్న వాడకము చరసాల గారిదనుకుంటా. దీనికి ప్రసాద్ గారికే ఇవ్వాలి క్రెడిట్.