
పెనుకొండ బాబయ్య ఉరుసు..అంటే చిన్నప్పటి ఎన్నో సంగతులు గుర్తొస్తాయి. ఆ పెనుకొండ కొండల్లో దారీ, గమ్యం తెలీకుండా తిరిగిన సంగతులు...మరీ ముఖ్యంగా ఆ రోజు మా బాబు మామ ఫోటో స్టూడియోలో కిందపడ్డ ఓ ఇరవై రూపాయాల నోటు చూసి ఎవరూ చూడలేదనుకొని జేబులో దోపుకొని, దర్గా దగ్గర మా పిల్ల గుంపు కందరికీ తలా ఓ బఠానీల పొట్లమో, ఓ మరమరాల పొట్లమో, ఓ లడ్డూ పొట్లమో కొనిపించి హీరోలా ఫీలయ్యా! ఒక రూపాయికి అరశేరో, శేరో వచ్చే కాలమది.అందరి చేతుల్లో అంతంత చిరుతిళ్లు చూసిన మా అమ్మకు ఎక్కడో అనుమానం వచ్చింది. ఇంటికెళ్లాక తీరిగ్గా చేసిన అపరాధ-పరిశోధనలో నా ఘనకార్యం బయటపడింది. ఇంకేముంది మా అమ్మ ట్రేడ్ మార్క్ పనిష్మెంటు: బచ్చలిలోకి తీసుకెళ్లి ముఖం పై ఓ చెంబుడు చన్నీళ్లు కాంతి వేగంతో కొడితే, నా మెదడు బ్లాంకయి, ఇక మళ్లీ ఆ తప్పు మరోసారి చేయను అంటూ ఏడ్చుకొంటూ చేసిన వేడుకోలులన్నీ ఆ చన్నీటిలో కలిసిపోయిన వేడి కన్నీళ్లయ్యాయి. ఆ ఇరవైకు పరిహారంగా మరో ఇరవై జతచేసి దర్గా హుండీలో నాతో వేయించి నా తప్పు కాయమని బాబయ్యకు దువా చేసి ఇంటికి తీసుకొచ్చింది. ఆ రోజు నుండి ఎక్కడ ఏ వస్తువు కనిపించినా ఆ సొంతదారుకు ఇచ్చేంత వరకు నా మనస్సు ఊరుకోదు. కానీ ఇప్పటికీ ఆ ఇరవై ఎవరిదో నాకు ఇంతవరకు తెలీదు