నేనే దేవాంతకుణ్ని...

3వ క్లాసే కాదు...ఒక క్లాసు అటు, ఒక క్లాసు ఇటు, చాలా ఘనకార్యాలే చేశాను...


2 క్లాసులో ఉన్నప్పుడనుకొంటా...'శంకరాభరణం' విజయవంతమయ్యాక "శంకరశాస్త్రి" గారు చిత్ర యూనిట్తో మా హిందూపురం వచ్చారు. ఊరు ఊరంతా కాలేజీ గ్రౌండ్స్లో జరిగిన సభకు తరలి వెళ్లింది. మా పక్కింటి వాళ్లతో కలిసి మేమూ వెళ్ళాం. ఆ జనసంద్రంలో... నేనూ మా చెల్లి తప్పిపోయాం. ఇద్దరూ చేయీ చేయి పట్టుకొని ఏడుస్తూ తిరుగుతూంటే, ఎవరో పుణ్యాత్ములు మళ్లీ మా అమ్మ వాళ్ల దగ్గరికి చేర్చారు.



ఇక 4 తరగతిలో ప్రతి రోజూ లాగే గోడకు అంటించిన సినిమా పోస్టర్లు చూసుకొంటూ నడుస్తూ, ఒక చోట మా చిరు నటించిన "దేవాంతకుడు" పోస్టర్ని తదేకంగా చూస్తూ నిలబడిపోవడం వల్ల, మా చిన్న-చిన్మయా స్కూలుకు పోవడం ఆలస్యమైపోయింది. స్కూల్ బెల్ కొట్టి, ప్రేయర్ మీటింగ్ కూడా అయిపోయింది. ఇంకా స్కూల్ అంత దూరంలో ఉండగానే ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూంటే నాలాగే 'శ్రీకాంత్' గాడు అంతకంటే దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు. వాణ్ని కదిపితే బాంబు లాంటి కబురొకటి చెప్పాడు...మా పెద్ద-చిన్మయ హెడ్ మిస్ట్రెస్ గారు ఆ రోజు మా స్కూలు కు వచ్చారని. అమె అసలే చండశాసనురాలు. ఇలా కాదని మా వాడితో "ఒరే మనం ఇప్పుడు వెళ్లామో, ఇక్కడ మేడంతో చేతులు వాచిపోతాయ్...ఈ విషయం ఇంటి దాకా వెళ్తుంది కాబట్టి, అక్కడా వీపు విమానం మోత మోగిపోతుంది. నీకో ఐడియా చెప్తా విను", అన్నా.




ఇద్దరం స్కూల్ చెక్కేసి ఊరి మీద పడ్డాం. ఊరంతా తిరిగాం. మొదటి సారి ఊరి పొలిమేరల వరకూ వెళ్లాం. ఊరి-పొలిమేర అంటే అప్పట్లో మా ఊరి రైల్వేస్టేషన్. అలా పట్టాలపై నడుచుకుంటూ వెళ్తూంటే పక్కన కొన్ని గుడిసెలు వేసుకొన్న సంచార జాతుల వాళ్లు కనిపించారు. ఇక మా 'శ్రీకాంత్' తన ఊహాశక్తికి పదును పెట్టి "వాళ్లు పిల్లలను ఎత్తుకెళ్లే వాళ్లు" అని కథలు కథలుగా చెప్పాడు. ఇక ఒక క్షణం అక్కడ ఉండకుండా పరుగు తీసాం. ఊరి మధ్యలో ఉన్న 'అమృత్' టాకీస్ వచ్చే వరకు వెనక్కు తిరిగి చేస్తే ఒట్టు.
పెద్ద చిన్మయా లోని 'మహిషపు గంట' :P  (Present TIme)


అక్కడే పక్కన ఉన్న చిన్న రూం మెట్లపై కూర్చొని అప్పటికి తెచ్చుకొన్న టిఫిన్ బాక్సును ఖాళీ చేసి వచ్చేవాళ్లని, పోయేవాళ్లని చూస్తూ సమయం గడిపేశాం. చూస్తూండగానే మబ్బు పట్టింది, అప్పటికి చేతికి "ఆపిల్ వాచీ" లేకపోవడం మూలాన టైమెంతయ్యిందో తెలియలేదు:P  ఇక శ్రీకాంత్ "నేను వెళ్తారా!" అని ఇంటి దారి పట్టాడు. నేనింకా అక్కడే కూర్చున్నా. కొంతసేపటికి తెల్ల చొక్కాలు, ఖాకీ నిక్కర్లూ వేసుకొన్న కొందరు కుర్రాళ్లు, పెద్దవాళ్లు అక్కడికి వచ్చి చేతికర్రలతో విన్యాసాలు మొదలు పెట్టారు. అప్పటికి వాళ్లెవ్వరో నాకు తెలియదు. కాసేపు వాళ్ల విన్యాసాలన్నీ చూసి మెల్లగా రోడ్డుపై కొచ్చాను.

అప్పటికే సమయం 'ఏడుంపావు' దాటిందని పక్కన నడుస్తున్న అంకుల్ని అడిగితే తెలిసింది. ఇక నా గుండె గుభేల్మంది. "ఎలారా... భగవంతుడా! ఇప్పుడు ఇంటికి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి?" అని తీవ్రంగా ఆలోచిస్తూ భారంగా అడుగులో అడుగు వేస్తూ వెళ్తూంటే...వెనుక నుంచీ 'చింతూ' అన్న పిలుపు వినపడింది. వెనక్కి తిరిగి చూస్తే ...హీరో సైకిల్ పై మా 'పెద్దమామ'. నేను తప్పిపోయానని మా వాళ్లంతా ఊరంతా జల్లెడ పట్టేస్తున్నారు. నేను దొరికిపోయాను. ఇక చేసేదేముంది, సైకిల్ ఎక్కి 'ముక్కిడిపేట'లోని మా ఇంటికొచ్చాం. ఇక ఆ తర్వాత కథ...మీరే ఊహించుకోండి:-)

ఉపసంహారం: ఆ మర్నాడు తెలిసింది మా శ్రీకాంత్ గాడు ఇంటికి చేరాక వాడికి, "పాపం బిడ్డ తప్పిపోయాడని" ఆపిల్సు, నారింజ తొనలు పెట్టారట తినడానికి. నాలుగు తర్వాత వాడు స్కూలు/ ఊరు మారాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఈ పోస్టైనా మమ్మల్ని కలుపుతుందేమో చూడాలి.

నాలుగో క్లాసులో అన్ని టెస్టుల్లో ఫస్టు వచ్చానని మా 'పెద్దమామ' ఓ డిజిటల్ వాచీ కొనిచ్చాడు. ఈ కింది చిత్రంలో ముంజేతి కంకణంలా చేతికి పెట్టుకొన్న ఆ అబ్బాయి నేనే.

 అమ్మాయి (సునీత) పక్కన చేతులు కట్టుకొని బుద్ధిమంతుడిలా కూర్చొన్న అబ్బాయి (నాలుగో తరగతి)
ఆ 'బాణం' గుర్తు ఉన్న పిల్లోడు నేనే. నా కుడి పక్కన ఉన్నోడే "శ్రీకాంత్" (రెండో క్లాసులో)
ఎడమ వైపు సస్పెండర్ బెల్టుతో నిలుచున్నది R.P. జగన్నాథ్

1 comment:

Gudapati said...

చింతూ గెలిచాడా చింత బరిక గెలిచిందా అని నేను సరిగ్గా ఊహించుకోలేకపోతున్నా , అందుకని మీరే చెప్పెయ్యండి :)