హీరోలు, వైద్యులు, ఇద్దరు అమ్మాయిలు

హీరోలనగానే మనకు గుర్తొచ్చేది సినిమా హీరోలే! కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది ఆ హీరోల గురించి కాదు నిజజీవితపు హీరోల గురించి. చాలా రోజుల కిందటే "సి.ఎన్.ఎన్. హీరోస్" అని ఆ ఛానల్ ఓ పోటీ పెట్టింది. మనకు తెలిసిన హీరోల గురించి వారికి సమాచారమిస్తే వారు, న్యాయనిర్ణేతలు ఓ ఆరు హీరోలను ఎంపిక చేస్తారు. అందులో చివరి వరకు వచ్చిన వారిలో మన అయ్యకుడికి చెందిన ఎస్.రామకృష్ణన్ కూడా ఉన్నారు. నా వంతుగా తమకు చేతనైన కృషి చేస్తూ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతూన్న 'టుమేక్ ఎ ఢిఫరెన్స్' ప్రశాంతి గారి గురించి ఈ పోటికి సిఫార్సు చేసాను. చిన్న చిన్న అడుగులే ఓ మహా ప్రస్థానానికి కారణభూతమవుతాయి.

ఈ హీరోల్లో నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలచుకొన్న వ్యక్తి కెన్యాకు చెందిన 'పీటర్ కిటానే'. పన్నెండేళ్ల ప్రాయంలో ఏదో తెలియని జబ్బుతో ఇద్దరు తల్లిదండ్రులు, ఆరుగురు తోబుట్టువులు అసువులుబాస్తే అనాథగా మిగిలిన ఈ కుర్రాడు, తోటి బంధువులు-స్నేహితులు వద్దన్నా వినకుండా చదువును వదిలిపెట్టకుండా, కష్టపడి ఓ మంచి ఉన్నత పాఠశాలలో స్థానం సంపాదించి, చివరకు అమెరికాలోని సియాటిల్లోని కళాశాలలో చేరాడు. అంతటితో తన జీవితానికి ఓ ఆధారం దొరికిందని ఊరుకోకుండా, తన వాళ్లకు ఏదైనా చేయాలనే తపనతో సొంతూరులో "మామా మారియా క్లినిక్" స్థాపించి వైద్య సదుపాయాల్లేని ఆ ఊరి ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నాడు. ఎయిడ్స్ రోగ బాధితుల కోసం మరో పెద్ద క్లినిక్ నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నాడు. ఇతను నా హీరో. నా స్ఫూర్తి ప్రదాత.

* * *

గత కొన్ని రోజులుగా ఆంధ్రదేశంలో జరుగుతున్న దాడులు, కొనసాగుతున్న సమ్మెలు, మధ్యలో నలిగిపొతున్న అమాయక ప్రాణాల గురించి ఆలోచిస్తే...దాడులు కొత్త కావు, ఆ మాటకొస్తే సమ్మెలూ కొత్తేం కాదు. దీనికి కారణం కేవలం వైద్యులు, దాడి చేస్తున్న రౌడీమూక కాదు అసలు దోషి 'వైద్య వ్యవస్థ'. ప్రతిదాన్ని ప్రవేటుపరం చేయాలని ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. కానీ మన ప్రజల్లో ఎంత మంది ఖరీదైన వైద్యాన్ని చేయించుకొనే స్థోమత కలిగి ఉన్నారో అందరికీ తెలుసు. ఏ రంగాన్ని ప్రైవేటీకరించినా విద్య, వైద్యం అందరికీ అందించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఏ కారణాల వల్లనైతేనేమి ఆ బాధ్యతల నుంచి తప్పుకోజూస్తూంది. సరైన మౌలిక వసతుల్లేని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం వికటిస్తే ఆ నెపమంతా అక్కడి వైద్యుల పైనే పడుతుంది.

మొన్న జరిగిన వైద్య విద్యార్థిని పై దాడి కేసులో రోగి చనిపోవడానికి మూలకారణం 'పల్మనరీ ఎంబాలిజం' అనే సమస్య. ముందే ఆ అభాగ్యురాలి కడుపులో పిండం చనిపోయి కొద్దిరోజులవుతోంది. అలాంటప్పుడు మన శరీరంలో రక్తం గడ్డ కట్టే పరిస్థితి ఎదురవుతుంది. మనకు ఏదైనా గాయం తగిలితే కొద్ది సేపట్లోనే రక్తం గడ్డకడుతుంది. రక్తంలోని 'ప్లేట్లెట్లు' అనబడే కొన్ని కణాలు, ఇతరత్రా కారకాల వల్ల జరిగే ఈ ప్రక్రియ మన ప్రాణాలు కాపాడుతుంది. ఇదే శరీరంలో జరిగితే చాలా ప్రమాదకరం. పైన చెప్పిన ఈ కేసులో అలా జరగడానికి పిండం చనిపోవడం వల్ల, తల్లి రక్తంలో జరిగే మార్పుల వల్ల ఆస్కారం ఎక్కువ. అలా తయారైన రక్తపు గడ్డలు, రక్తనాళాల్లో ప్రయాణించి ఊపిరితిత్తుల్లో ఉండే రక్తనాళాలలో చిక్కకొని, మనకు ప్రాణాధారమైన 'ఆమ్లజని' (ఆక్సిజన్)ను అందకుండా చేస్తుంది, మరణానికి కారణమవుతుంది. ఇదంతా క్షణాల్లో జరగొచ్చు, అంటే రక్తపు గడ్డలు ఎక్కడో ఉండి, రక్తప్రవాహ వేగానికి ఉన్నట్టుండి ప్రవాహంలో చేరి ఈ 'పల్మనరీ ఎంబాలిజం'ను కలిగించొచ్చు.

ఇవన్నీ చెబితే అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఆ రోగి బంధువులు ఉండాలిగా! ఏదేమైనా ఇలా ప్రతి చావుకు దాడి జరుపుకుంటూ పోతే ఇక వైద్యం చేయడానికి ఎవరూ మిగలరు. కొద్ది నెలల క్రితం కర్నూలులో ఇలాగే, తన తప్పులేకపోయినా, ఓ పి.జి.వైద్య విద్యార్థిపై యాసిడ్ తో దాడి చేసారు. ఇప్పుడతను కళ్లు కోల్పోయి ఇన్నేళ్లు చదివిన వైద్య వృత్తికి దూరంగా ఉన్నాడు. ఇలా ఎన్నో! ప్రభుత్వం ఇలాంటి వారి మీద కఠిన చర్యలు చేపట్టి, వైద్యుల్లో, వైద్య విద్యార్థుల్లో ధైర్యం నింపకపోతే అందరూ ఇతర చదువులకు మళ్లే ప్రమాదముంది.

* * *

సమాచార విప్లవం తెచ్చిన ఒరవడి వల్ల ఈ ఇద్దరు అమ్మాయిల గురించి చదివే అవకాశం కలిగింది. ఒకరు కుడివైపు గుండె కలిగి, గుండెలో రంధ్రం ఉండి శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తూన్న అభాగ్యురాలు, మరొకరు చేయూత అందిస్తే మరో పి.టి.ఉషలా దేశానికి పేరు తెచ్చే తెగువ ఉన్న తరుణీమణీ. చేతనైన సాయం నేను చేశాను, మీరు చేయండి ఇక్కడ.

6 comments:

కొత్త పాళీ said...

ఇటువంటి అసాధారణ హీరో హీరోయిన్లని పరిచయం చేసినందుకు థాంకులు డాక్టరు గారూ.

Naga said...

చక్కటి విషయాలను తెలియజేశారు. థాంకులు.

రవి వైజాసత్య said...

పీటర్ కిటానే కథ చాలా స్ఫూర్తిదాయకం. పరిచయం చేసినందుకు నెనర్లు.
రెండో కథ నాకు అర్ధం కాలేదు (పూర్వరంగం తెలియని కారణంగా) ఏదో ఎంఐఎం ఎమ్మెల్యేలు, జూనియర్ డాక్టర్లు, కొట్టారు అన్న పదాలు అక్కడక్కడా బ్లాగుల్లో చదివాను.

ఈ ఇద్దరు అమ్మాయిలకు సహాయం TMAD చేపట్టిందా?

Dr.Pen said...

కొ.పా. & నా.రా. గార్ల స్పందనకు ధన్యవాదాలు.
రవి గారు...అవును చేపట్టింది. ఇక తెవికీలో వైద్య సంబంధమైన వ్యాసాలను రాయాలని అనుకొంటున్నా...కొన్ని సాంకేతిక కారణాల వల్ల కుదరడం లేదు. ఇందుకు మీ సహాయం కావాలి. వైద్యశాస్త్ర పుస్తకాలన్నీ తెలుగులో చూసుకోవాలని ఒకప్పటి నా ఆశ తెవికీ ద్వారా తీరుతుందేమో!

netizen నెటిజన్ said...

అల్లోపతి వైద్యవిధానం అధారంగా తెలుగులో "బహూశా మొట్టమొదటిసారిగా పుస్తకాలను వ్రాసి ప్రచురించినవారు - గాలి బాల సుందరరావు గారని అంటారు.
రచయిత్రి, కధకురాలు, సాహిత్యాభిమాని తులసీ జలంధర వీరి తనయ. చలన చిత్ర నటుడు చంద్రమోహన్ ఈమే భర్త. వారి దగ్గిర ఆ పుస్తకాలకు తగిన సమాచారం దొరకవచ్చు.

"సాంకేతిక"కారణాలు అన్నారు కాబట్టి ఈ వివరణ. వారి వాడిన పదజాలం మీకేమన్నా ఉపకరిస్తుందేమోనని !

Rajendra Devarapalli said...

డాక్టర్ గారూ,మీరు అన్నట్లు తెలుగులో వైద్య శాస్త్రాల గురించి నేను ఏమీ చెప్పలేను గానీ, దేబీప్రసద్ చటోపాధ్యాయ రచించిన సైన్స్ అండ్ సొసైటీ ఇన్ ఏనిషిఎంట్ ఇండియా కు తెలుగు అనువాదం సంఘము:శాస్త్రము,ఆచార్య గూడ సుందరరామయ్య డాక్టర్.యెస్ డిఏ జోగారావులు తెలుగులోకి అనువదించిన గ్రంధాన్నొక సారి చూడండి,భారతీయ వైద్య శాస్త్రాల గురించి చాలా ప్రస్తావనలు పరిశీలనలు ఉన్నాయి.